రెండు రాష్ట్రాల్లోనూ... ఎస్ఎంఈలను ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విపణిలో చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) కీలకమని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ అన్నారు. గతేడాది ఐటీ, బీపీఓ రంగాల్లో ఎస్ఎంఈల ఎగుమతుల వాటా 20 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. సుమారు 108 బిలియన్ డాలర్లు ఆదాయాన్ని ఆర్జించిందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ ఏర్పడే కొత్త ప్రభుత్వాలు ఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. బుధవారమిక్కడ జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ సంఘం (ఇట్స్‌ఏపీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘పరిశ్రమల రంగం- ఎస్ఎంఈలకు అవకాశాలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ప్రభుత్వం, పరిశ్రమల రంగం రెండూ పరస్పరం సహకరించుకోవాలన్నారు. అప్పుడే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఉందని, దీన్ని ఎస్ఎంఈ రంగం అందిపుచ్చుకోవాలని సూచించారు. రాజకీయ అస్థిరత, ఆర్థిక లోటు, విధాన, పాలనాపరమైన నిర్ణయాల లోపాలు వంటి అనేక కారణాల వల్ల మూడేళ్లుగా దేశీయ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందన్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ఏటా 30% వృద్ధిని నమోదు చేసే పరిశ్రమల రంగం రెండేళ్లుగా కేవలం 10% వృద్ధిని మాత్రమే నమోదు చేస్తుండటమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చన్నారు.
అయితే ఈ ఏడాది కొంచెం మెరుగ్గా 13% వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. కొత్త పెట్టుబడిదారులు దేశీయ విపణిలోకి రావట్లేదని, ఉన్న కంపెనీలు పెట్టుబడులను విస్తరించట్లేదని, కొన్ని చిన్న కంపెనీలైతే బోర్డు తిప్పేశాయని చంద్రశేఖర్ వివరించారు. అయితే ప్రస్తుతం అనిశ్చితి తొలగిందని భవిష్యత్తులో దేశ, విదేశీ పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది పరిశ్రమల రంగం 108 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఈ ఏడాది 118 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా ఉందని చెప్పారు.
సంజయ్ జాజు మాట్లాడుతూ...
ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో చిన్న,మధ్య తరహా పరిశ్రమల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. ఐటీలో 80% పెద్ద కంపెనీలు, 20% చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. వాట్సప్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్లాంటి సంస్థలు ఒకప్పుడు చిన్న చిన్న గ్యారేజీలలో ప్రారంభించినవేనన్నారు. మన దేశంలో ఇప్పుడు ఫ్లిప్‌కార్డ్ ఇద్దరు యువకుల చేత ప్రారంభమయి, సంవత్సరానికి ఆరువేల కోట్ల లావాదేవీలను జరుపుతోందన్నారు.
వచ్చే దశాబ్దంలో ఐడియాలున్న పారిశ్రామికవేత్తలకే కొత్త కంపెనీలు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. కంపెనీలన్నీ పరస్పర సహకారంతోనే అభివృద్ధి చెందాలన్నారు. మొబైల్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా వచ్చిన అంతరాలను పూరించడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎన్నో రకాల ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రోక్యూర్మెంట్ కోనుగొలు చేస్తుందన్నారు. ఇందులో 10% చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి ప్రభుత్వం కోనుగోలు చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇట్స్ఎపి అధ్యక్షులు వి.రాజన్న, ఐడెంటీస్ టెక్ సొల్యూషన్స్ యండి. యల్.సురేష్, రామ్ఇన్ఫో మేనేజింగ్ డెరైక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.