సెల్ఫీ మోజులో నిండు ప్రాణం బలి
కర్నూలు: సెల్ఫీ మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థి రైలు ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నెరవాడలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... దోర్నెపాడు మండలానికి చెందిన ఇద్రూస్ బాషా (20) నెరవాడ ఆర్సీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వాకింగ్ వెళ్లి.. రైల్వే ట్రాక్ సమీపంలో సెల్ఫీలు దిగుతున్నాడు. అదే సమయంలో అటుగా వేగంతో వచ్చిన ట్రైన్ అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.