ఎన్నిసార్లు చెప్పినా మారరా?
అనంతపురం కార్పొరేషన్ : ఇచ్చిన ఫార్మాట్లో ఏ మునిసిపాలిటీ నుంచి సమాచారం అందడం లేదు. అందరూ సీనియర్ అధికారులే ఉన్నా ఏం ప్రయోజనం.. ఎన్ని సార్లు చెప్పినా మారరా? అంటూ ఆర్డీఎంఏ మురళీకృష్ణ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం తన కార్యాలయంలో సఫాయి కర్మచారి, సామూహిక మరుగుదొడ్లు అంశంపై అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని నగర, పురపాలక సంఘాల కమిషనర్లు, ప్రజారోగ్య విభాగం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫాయి కర్మచారి వ్యవస్థలో పనిచేసిన వారు, వారిపై ఆధారపడిన వ్యక్తుల వివరాలు, సామూహిక మరుగుదొడ్లకు సంబంధించి సర్వే చేసి ఇచ్చిన ఫార్మాట్లో నివేదికలు పంపాలని ఇచ్చిన ఆదేశాలను ఏ మునిసిపాలిటీ కూడా అనుసరించలేదని మండిపడ్డారు.
ఫార్మాట్లో సూచించిన అంశాలపై నివేదిక ఇవ్వాలనే కనీస బాధ్యత లేకుంటే ఎలాగంటూ ఆగ్రహించారు. సఫాయి కర్మచారి వ్యవస్థ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందని తెలిపారు. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం సర్వే వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో అనంతపురం, కడప కార్పొరేషన్ కమిషనర్లు చంద్రమౌళీశ్వరెడ్డి, చల్లాఓబుళేసు, మునిసిపల్ కమిషనర్లు భాగ్యలక్ష్మి, వెంకటస్వామి, పగడాల కృష్ణమూర్తి, శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.