డివిజన్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్‌డే
- ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు
- ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ
- నేటినుంచి అమలు
కలెక్టరేట్/చిలుకూరు : డివిజన్, మండల స్థాయిలోనూ సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ సమక్షంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు దీనిని చేపడతారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ రెండు రోజుల క్రితం జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే గ్రీవెన్స్‌డే నిర్వహించేవారు.
అక్కడికి వచ్చిన వినతులను తిరిగి మండల స్థాయి అధికారులకు విచారణ కోసం పంపించేవారు. కాగా ప్రతి వారం బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక వ్యయప్రయాసాలు పడాల్సివస్తోంది. అదీగాక ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తుండడంతో అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ నూతనంగా డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
అన్ని శాఖల అధికారులు హాజరు తప్పని సరి
ఇక ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు డివిజన్, మండల స్థాయి అధికారులందరూ హాజరవుతారు. అక్కడ బాధితుల నుంచి వినతులు స్వీకరించి రశీదులు కూడా ఇస్తారు. ప్రతి వారం వచ్చిన సమస్యలను ఓ ప్రత్యేకమైన రికార్డులో నమోదు చేస్తారు. సాధ్యమైనంత వరకు వాటిని వెంటనే పరిష్కరిస్తారు. ఇక్కడ పరిష్కారం కానివాటిని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తారు. ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ప్రజావాణి వెబ్సైట్లో నమోదు చేస్తారు.
పర్యవేక్షణ ఇలా..
ప్రతి ఫిర్యాదుపై సమగ్ర పరిశీలన జరిపి పరిష్కారం కోసం మండల, డివిజన్ స్థాయి అధికారులు చేపట్టిన చర్యల మానిటరింగ్ కోసం అధికారులను నియమించారు. దేవరకొండ, నల్లగొండ, భువనగిరి రెవెన్యూ డివిజన్లలో వైద్య ఆరోగ్యం, డ్వామా, ట్రాన్స్‌కో, ఐబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విభాగాలను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. జిల్లా పరిషత్, సూర్యాపేట, మిర్యాలగూడ డివిజన్లలో సాంఘిక సంక్షేమం, మైనార్టీ, ఆర్వీఎం, డీఆర్డీఏ, ఆడిట్ విభాగాలను ఏజేసీ, అదే విధంగా జిల్లా విద్యాశాఖ, మాడా, ఆర్అండ్బీ, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, జిల్లా పంచాయతీ విభాగాలను జెడ్పీ సీఈఓ పర్యవేక్షిస్తారు.
అలాగే ఐసీడీఎస్, పశుసంవర్ధక, వికలాంగుల సంక్షేమం, జిల్లా పరిశ్రమలు, ఏఎంఆర్ పులిచింతల, జిల్లా ప్రణాళికా విభాగాలను వ్యవసాయశాఖ జేడీ పర్యవేక్షిస్తారు. ఉద్యానవనశాఖ, ఏపీఎంఐపీ, పట్టు పరిశ్రమ, ఆత్మ, కార్మిక శాఖ, భూగర్భజలశాఖ, సహకార శాఖలు ముఖ్య ప్రణాళిక అధికారి పర్యవేక్షిస్తారు. మార్కెటింగ్, మున్సిపాలిటీలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పర్యవేక్షిస్తారు.
అధికారులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్
ప్రతి సోమవారం డివిజన్, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఆదివారం కోరారు. మండలస్థాయిలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, తాగునీరు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, ఏఓలు పాల్గొనాలని ఆదేశించారు.
అదే విధంగా డివిజన్‌స్థాయిలో ఆర్డీఓలు డివిజన్ అధికారులను భాగస్వాములను చేసి గ్రీవెన్స్‌డే నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర పరిశీలన జరిపి పరిష్కారం కోసం మండల, డివిజన్ స్థాయి అధికారులు చేపట్టిన చర్యల మానిటరింగ్ కోసం ఉన్నతాధికారులను శాఖలవారీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై చేపట్టిన చర్యలను ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు.