ఏటీఎంలు ఎందుకు పని చేయడంలేదంటే
కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం(ఆటో మేటిక్ టెల్లార్ మెషీన్)లతో పెద్ద చిక్కొచ్చిపడింది. పాత నోట్లను జారీ చేయడానికి అనుగుణంగా ఆయా ఏటీఎంల సాఫ్ట్ వేర్ ను ఆయా కంపెనీలు తయారు చేశాయి. దీంతో కొత్త రూ.2 వేల నోటును పాత ఏటీఎంలు ప్రజలకు అందించలేవు.
ఏటీఎంలను పునరుద్దరించేందుకు మరో పదిరోజుల సమయం పడుతుందని ఎస్ బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య ఓ ప్రకటనలో తెలిపారు. మరి కొత్త నోట్లను ఏటీఎంల ద్వారా ప్రజలకు అందించాలంటే ఏటీఎంలలో కొద్దిపాటి మార్పులు చేయాల్సివుంది. అవేంటో ఓ సారి చూద్దాం.
- ఏటీఎంలను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. ఏటీఎంలలోని సాఫ్ట్ వేర్ ను రూ.2వేల నోటును ఇవ్వగలిగే విధంగా మార్చాల్సివుంది.
- ఏటీఎం కార్డుపై వినియోగదారుల నగదు లావాదేవీలను రోజుకు రూ.2వేలకు పరిమితం చేసేవిధంగా చర్యలు చేపట్టాల్సివుంది.
- కొత్త నోట్లలోని భద్రతకు సంబంధిని ఫీచర్ల వివరాలను కూడా ఏటీఎంల సాఫ్ట్ వేర్లలో చేర్చాలి.
- వంద, యాభై రూపాయల నోట్లను కూడా ఏటీఎంలలో నింపాల్సివుండటంతో అందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.