రీడ్ ఎలాంగ్ యాప్ తోడుంటే.. విజ్ఞానం మీ వెంటే
కడప ఎడ్యుకేషన్: వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేయకుండా వారిలో పఠనాసక్తి పెంపొందించడంతోపాటు చదవడం, నేర్చుకోవడలం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రీడ్ ఎలాంగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకు గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే యాప్ వినియోగంపై ఉపాధ్యాయులకు ఒక రోజు ఆన్లైన్ శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలో 3211 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 2.67 లక్షల మంది విద్యార్థులకు ఈ యాప్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
యాప్ ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి
గూగుల్ రీడ్ ఎలాంగ్ అప్లికేషన్ (హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆంధ్రటీచర్స్.ఇన్/2020/05/రీడ్– ఎలాంగ్– ప్రోగ్రాం.హెచ్‌టీఎంఎల్)ను ఆండ్రాయిడ్ ఫోన్లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో నిక్షిప్తమైన చిన్నచిన్న కథలు చదివి తెలుగు, ఆంగ్లపదాలు, వాక్యాలు నేర్చుకుంటే ఆ భాషల్లో సామర్థ్యం మెరుగుపడుతుంది.
తెలుగు, ఇంగ్లిష్‌పై పట్టు: గూగుల్ రీడ్ ఎలాంగ్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు సాధించవచ్చు. ఈ యాప్‌లో గూగుల్ అధునాతన స్పీచ్–టు– టెక్ట్స్ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీల ఆధారంగా స్నేహపూర్వకంగా అభ్యసనం కోసం దియా యానిమేటెడ్ అసిస్టెంట్ ఉంటుంది. విద్యార్థులు గట్టిగా చదివే సమయంలో దియా విని ప్రతిస్పందిస్తూ కొత్త, కఠిన పదాలను ఏ విధంగా ఉచ్చరించాలనే విషయంలో సహాయపడుతుంది. ఈ యాప్‌ను ఆఫ్‌లైన్, ఆన్లైన్ విధానాల్లో వినియోగించుకోవచ్చు.