దీపావళికల్లా డాట్సన్ 800 సీసీ
పరిశీలనలో ఎలక్ట్రిక్ కారు ‘ద లీఫ్’ కూడా...
- 2020 నాటికి 5 శాతం వాటా లక్ష్యం
- నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ నిస్సాన్... దేశంలో 800 సీసీ కారును దీపావళి నాటికి ఆవిష్కరించనుంది. డాట్సన్ బ్రాండ్‌లో ‘రెడీ గో’ పేరుతో రానున్న ఈ మోడల్ ధర వేరియంట్‌ను బట్టి రూ.3-5 లక్షల మధ్య ఉండొచ్చు. చైనె ్న సమీపంలో రెనో నిస్సాన్‌ల సంయుక్త ప్లాంటులో ఈ ఎంట్రీ లెవెల్ మోడల్ రెడీ అవుతోందని, చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంటోందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా సోమవారం వెల్లడించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఇటీవల క్విడ్ పేరుతో 800 సీసీ కారును రెనో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. నిస్సాన్ అనుబంధ బ్రాండ్ అయిన డాట్సన్ విక్రయిస్తున్న మోడళ్లు డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ రెండూ కూడా 1,198 సీసీ సామర్థ్యం గలవి. 2014-15లో భారత్‌లో నిస్సాన్ విక్రయించిన 50 వేల యూనిట్లలో డాట్సన్ మోడళ్ల వాటా సుమారు 18 వేల యూనిట్లుంది.
లీఫ్‌కు సిద్ధమే కానీ..
ఎలక్ట్రిక్ కారు ‘ద లీఫ్’ మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు అరుణ్ మల్హోత్రా తెలియజేశారు. ఇక్కడి గచ్చిబౌలిలో వైబ్రాంట్ నిస్సాన్ షోరూంను ప్రారంభించిన అనంతరం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ఆయన ఈ విషయాలు చెప్పారు. ద లీఫ్ విడుదలకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించటం లేదని ఆయన తెలియజేశారు. ‘చార్జింగ్ కేం ద్రాలు విరివిగా ఏర్పాటు కావాలి. అందుకు తగ్గ మౌలిక వసతులు ఉండాలి. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలి’ అని అన్నారు. ఇక కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కూడా రానుందని చెప్పారాయన. 2020 నాటికి మార్కెట్ వాటా 5 శాతం లక్ష్యంగా చేసుకున్నామని, షోరూంల సంఖ్యను మూడేళ్లలో 300 లకు విస్తరిస్తామని ఆయన వివరించారు.