కడుపులోని బిడ్డ.. కళ్ల ముందు!
ఒక బిడ్డకు జన్మనివ్వడం ద్వారా స్త్రీ అనుభవించే మాతృత్వపు మధురిమను మాటల్లో వర్ణించలేం. కడుపులో బిడ్డ కదిలినప్పుడల్లా ఆనందపడిపోతూ, ఎప్పుడెప్పుడు బుజ్జి ప్రాణాన్ని ఒళ్లో పెట్టుకొని లాలిద్దామా అంటూ తల్లి నవమాసాలూ అపురూపంగా మోస్తుంది. మరి.. కడుపులో ఉండగానే బిడ్డను కళ్లారా చూసుకునే అవకాశం వస్తే? సూపర్ కదూ! అలాగే, గుండెజబ్బుతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి స్కానింగ్‌లు, పరీక్షలు చేశాక ఎక్స్‌రే ఫిల్మ్‌లు పట్టుకొని చూస్తూ.. వైద్యులు అతడి గుండెకు చిల్లు పడింది చూడమంటూ అతడి గుండెను లైవ్‌లో కళ్లముందు చూపెడితే? లైవ్ హోలోగ్రామ్ (3డీ రూపాన్ని) పాయింటర్‌తో టచ్ చేస్తూ అటూ ఇటూ తిప్పిచూపిస్తూ వివరిస్తే? ఇది కూడా సూపర్ కదూ! అందుకే వీటిని నిజం చేసే టెక్నాలజీని ఇజ్రాయెల్‌కు చెందిన రియల్ వ్యూ కంపెనీతో కలసి ఫిలిప్స్ కంపెనీ ఇప్పుడు అభివృద్ధి పరుస్తోంది.
ఈ టెక్నాలజీతో కడుపులోని బిడ్డను 3డీ హోలోగ్రామ్ రూపంలో కళ్లముందు కనిపించేలా చేయడమే కాదు.. ఆ బిడ్డను అటూఇటూ తిప్పుతూ అన్ని వైపులా చూపిం చొచ్చు కూడా! ఇదెలా సాధ్యమంటే.. ఫిలిప్స్ పరిశోధకులు తయారుచేసిన ఇంటర్వెన్షనల్ ఎక్స్-రే, కార్డియాక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ల ద్వారా శరీరంలోని అవయవాలను 3డీ చిత్రాలుగా మలుస్తారు. రియల్వ్యూ సిస్టమ్ ద్వారా ఆ 3డీ చిత్రాలను హోలోగ్రాఫిక్ రూపంలో లైవ్‌లో ప్రదర్శిస్తారు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు సైతం అవయవాలను లైవ్‌లో నిశితంగా పరిశీలించేందుకూ దీంతో వీలుంది.