realters
-
దర్జాగా కబ్జా!
నాగర్కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో వెలసిన అక్రమ వెంచర్లపై అధికారుల నజర్ లేకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు పట్టా భూములతో పాటు అందినంత ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడా లేనివిధంగా రియల్టర్లు సిండికేట్గా మారి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. సిండికేట్ దగ్గరకు రావాలంటేనే అధికారులే ఆందోళన చెందే స్థాయికి ఎదగడంతో జిల్లా సమీపంలోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతమై ప్రభుత్వ భూములు కుచించుకుపోతున్నాయి.రోజురోజుకు అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నా వాటిని నిలువరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రియల్టర్లుగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పలు పార్టీల నాయకుల చెలామణిలో ఉంటూ ఎప్పటికప్పుడు పుకార్లను షికార్లుగా మలుచుకుని ధరలు అమాంతం పెంచుకుంటూ లాభపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వెంచర్లు జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాలైన ఎండబెట్ల, దేశియిటిక్యాల, ఉయ్యలవాడ, మంతటి, గగ్గలపల్లి, నల్లవల్లి రోడ్డు వెంబడి ప్రధాన రహదారుల ఇరువైపులా పంట పొలాలను రియల్టర్లు కొనుగోలు చేసుకుని రియల్ దందాకు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఒకప్పుడు వర్షపు నీటితో కళకళలాడిన చెరువు శిఖం భూములు, కుంటల భూముల్లోనూ రియల్టర్లు ప్లాట్లుగా మలిచి అందినకాడికి దండుకుంటున్నారు.ఫుల్ ట్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ శిఖం భూముల్లో మట్టిని పోసి ప్లాట్లుగా మార్చేశారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా పంట భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే.. పంటలతో కళకళలాడిన పంట పొలాలు సైతం ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది.అంతేకాక ఆయా భూముల్లో పబ్లిక్ అవసరాల కోసం 10 శాతం భూమి కేటాయించాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు పొందకుండా ప్లాట్లను ఏర్పాటు చేస్తుండటంతో భవిష్యత్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అక్రమ వెంచర్ల రియల్టర్లపై అధికారులు నజర్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
‘చెర’బట్టిన రియల్టర్లు
పూసపాటిరేగ: అది ప్రభుత్వ భూమా? చెరువా? శ్మశానమా? పదిమందికీ పనికివచ్చే స్థలమా? దేవాలయామా? అన్న వివేచన లేకుండా ఖాళీగా జాగా కనిపిస్తే చాలు కబ్జాకు తెగబడుతున్నారు కొందరు భూ బకాసురులు. ప్రభుత్వములు, పోరంబోకు భూములు, డి.పట్టా భూములను కబ్జా చేస్తున్న కొందరు రియల్టర్లు ఏకంగా చెరువును కూడా కబ్జాచేసేందుకు ప్రయతించారు. ఈ వ్యవహారం పూసపాటిరేగ మండలంలోని పతివాడ పంచాయతీలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. పతివాడ రెవెన్యూ పరిధిలో గల సర్వేనంబరు 37-2లో సుమారు 4 ఎకరాల చెరువు ఉంది. చెరువు పక్కన తమ అధీనంలో భూములను గతంలో గ్రామానికి చెందిన బ్రాహ్మణులు కొందరు రియల్టర్లకు విక్రయించారు. అ తరువాత కూడా రియల్టర్లు రెండుసార్లు క్రయవిక్రయాలు జరిపారు. తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియల్టర్ తాను కొనుగోలు చేసిన భూములతో పాటు చెరువును కూడా కబ్జా చేసేందుకు యత్నించడం విశేషం. ఈ ఆక్రమణ పర్వానికి మండలంలోని కొల్లాయివలసకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరి అండదండలందించడం గమనార్హం. దీంతో ఆ రియల్టర్ జేసీబీ యంత్రాలు పెట్టి చెరువు గట్టును చదును చేశారు. అయితే రెవెన్యూ రికార్డులలో నేటికీ చెరువుగానే ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే చెరువు గట్టును తొలగిస్తున్నారు. రికార్డులలో అయితే ఇప్పటికీ చెరువుగానే ఉంది. దీనిపై గ్రామరెవెన్యూ అధికారి కామేశ్వరమ్మ వద్ద ప్రస్తావించగా రికార్డులలో చెరువుగానే ఉందని, ఎటువంటి అనుమతులు లేకుండా చెరువును ఆక్రమించడం నేరమని స్పష్టం చేశారు. జేసీబీతో జరుగుతున్న పనులను నిలిపివేయించినట్లు తెలియజేశారు. తహసీల్దార్ జనార్దనరావు వద్ద ప్రస్తావించగా చెరువును కప్పే అధికారం ఎవరికీ లేదని, రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రాజధాని ప్రాంతంలో అసైన్డ్మాయలో త్రిముఖ వ్యూహం
-
'పెట్టుబడిదారుల కోసమే వేలాది ఎకరాల భూ సేకరణ'
బొబ్బిలి: ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రెండు రాష్ట్రాలను పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర నాయకుడు కల్యాణ్రావు ఆరోపించారు. ఈ రెండూ ప్రజల ప్రభుత్వాలు కావన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటానికి విప్లవం అనివార్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ గురించి ఆలోచిస్తున్నారే గానీ, భూమిపై బతికే వారి గురించి ఆలోచించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు అవసరం లేకపోయినా పెట్టుబడిదారుల కోసమే ప్రభుత్వం లక్ష ఎకరాల భూమిని సేకరిస్తోందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం వెనుక కుట్ర దాగుందని, కొన్ని కంపెనీలతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను పెట్టుబడి దారులకు ధారాదత్తం చేయాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, ఇద్దరు సీఎంలు వేర్వేరు పార్టీలకు చెందినా, వారి పాలనా ముద్ర అంతా ఒక్కటేనన్నారు.