‘చెర’బట్టిన రియల్టర్లు
పూసపాటిరేగ:
అది ప్రభుత్వ భూమా? చెరువా? శ్మశానమా? పదిమందికీ పనికివచ్చే స్థలమా? దేవాలయామా? అన్న వివేచన లేకుండా ఖాళీగా జాగా కనిపిస్తే చాలు కబ్జాకు తెగబడుతున్నారు కొందరు భూ బకాసురులు. ప్రభుత్వములు, పోరంబోకు భూములు, డి.పట్టా భూములను కబ్జా చేస్తున్న కొందరు రియల్టర్లు ఏకంగా చెరువును కూడా కబ్జాచేసేందుకు ప్రయతించారు. ఈ వ్యవహారం పూసపాటిరేగ మండలంలోని పతివాడ పంచాయతీలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. పతివాడ రెవెన్యూ పరిధిలో గల సర్వేనంబరు 37-2లో సుమారు 4 ఎకరాల చెరువు ఉంది. చెరువు పక్కన తమ అధీనంలో భూములను గతంలో గ్రామానికి చెందిన బ్రాహ్మణులు కొందరు రియల్టర్లకు విక్రయించారు. అ తరువాత కూడా రియల్టర్లు రెండుసార్లు క్రయవిక్రయాలు జరిపారు.
తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియల్టర్ తాను కొనుగోలు చేసిన భూములతో పాటు చెరువును కూడా కబ్జా చేసేందుకు యత్నించడం విశేషం. ఈ ఆక్రమణ పర్వానికి మండలంలోని కొల్లాయివలసకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరి అండదండలందించడం గమనార్హం. దీంతో ఆ రియల్టర్ జేసీబీ యంత్రాలు పెట్టి చెరువు గట్టును చదును చేశారు. అయితే రెవెన్యూ రికార్డులలో నేటికీ చెరువుగానే ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే చెరువు గట్టును తొలగిస్తున్నారు. రికార్డులలో అయితే ఇప్పటికీ చెరువుగానే ఉంది. దీనిపై గ్రామరెవెన్యూ అధికారి కామేశ్వరమ్మ వద్ద ప్రస్తావించగా రికార్డులలో చెరువుగానే ఉందని, ఎటువంటి అనుమతులు లేకుండా చెరువును ఆక్రమించడం నేరమని స్పష్టం చేశారు. జేసీబీతో జరుగుతున్న పనులను నిలిపివేయించినట్లు తెలియజేశారు. తహసీల్దార్ జనార్దనరావు వద్ద ప్రస్తావించగా చెరువును కప్పే అధికారం ఎవరికీ లేదని, రెవెన్యూ రికార్డులు తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.