బొబ్బిలి: ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రెండు రాష్ట్రాలను పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర నాయకుడు కల్యాణ్‌రావు ఆరోపించారు. ఈ రెండూ ప్రజల ప్రభుత్వాలు కావన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటానికి విప్లవం అనివార్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ గురించి ఆలోచిస్తున్నారే గానీ, భూమిపై బతికే వారి గురించి ఆలోచించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు అవసరం లేకపోయినా పెట్టుబడిదారుల కోసమే ప్రభుత్వం లక్ష ఎకరాల భూమిని సేకరిస్తోందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం వెనుక కుట్ర దాగుందని, కొన్ని కంపెనీలతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను పెట్టుబడి దారులకు ధారాదత్తం చేయాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, ఇద్దరు సీఎంలు వేర్వేరు పార్టీలకు చెందినా, వారి పాలనా ముద్ర అంతా ఒక్కటేనన్నారు.