ఇంత బరితెగింపా?!
- గెడ్డలు, పంట కాలువలు ఏదీ వదలని రియల్టర్లు
- వెంకన్నపాలెంలో రూ.2 కోట్ల విలువైన స్వామిగెడ్డ ఆక్రమణ
- గెడ్డను కుదించి, లేఔట్‌కు రోడ్డు, కల్వర్లు వేస్తున్న వైనం
- పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు
చోడవరం: రియల్టర్ల దందాకు అడ్డూఆపూలేకుండా పోతోంది. వందల ఎకరాలకు సాగునీరందించే పంట కాలువలను, కొండగెడ్డలను సైతం ఆక్రమించుకొని లేఔట్లు, రోడ్లు వేసేస్తున్నారు. సాగునీటి వనరులను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో తేలడంతో రియలస్టేట్ వ్యాపారుల ఆక్రమణలకు రైతులు బలైపోతున్నారు.
వెంకన్నపాలెంలో నాలిచెరువుకు నీరందించే స్వామి కొండగెడ్డ పూర్తిగా ఆక్రమణకు గురైంది. సర్వేనెంబరు 432లో 40 అడుగులు వెడల్పు ఉండాల్సిన స్వామి గెడ్డ ఇప్పుడు 5నుంచి 10 అడుగులు మాత్రమే ఉంది. ఈ చెరువు కింద సుమారు 200 ఎకరాల సాగుభూమి ఉంది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నా ఎగువన ఉన్న స్వామి గెడ్డ నుంచి చెరువులోకి నీరు పూర్తిగా రావడం లేదు. దీనితో ఈ ఖరీఫ్, వచ్చే రబీకి చెరువు ఆకయట్టు భూములను సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
రూ.2 కోట్ల విలువైన కొండగెడ్డ ఆక్రమణ
ఈ గెడ్డకు ఆనుకొని పక్కనే వేసిన లేఔట్లో రియల్ వ్యాపారులు ఈ గెడ్డ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు రూ.2 కోట్లు విలువచేసే 2 ఎకరాలకు పైబడి గెడ్డను ఆగ్రమించుకొని లే ఔట్‌కు వేళ్లేందుకు 20 అడుగుల రోడ్డు వేస్తున్నారు. గెడ్డలో నీరు పోయేందుకు కేవలం 4 అడుగుల వెడల్పులో కాాలువను వదిలి అటూఇటూ పెద్ద కల్వర్టును కట్టేశారు. దీనిపై రోడ్డు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా మెయిన్‌రోడ్డు పక్కనే జరుగుతున్నా ఏ అధికారి పట్టించుకోకవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రోడ్డుపై వృథాగా గెడ్డ నీరు : సోమ, మంగళవారాల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఎగువ కొండపై నుంచి గెడ్డలోకి భారీగా నీరు ప్రవహించింది. అయితే గెడ్డ ఆక్రమణకు గురికావడంతో ఎగువనీరు అనకాపల్లి-చోడవరం మెయిన్ రోడ్డును ముంచెత్తి ప్రవహించింది. కొండనీరంతా రోడ్డుపై వృధాగా పోవడంతో చెరువులో నీటి మట్టం పెరగలేదు.
నాట్లకు కూడా ఇబ్బంది
నాలి చెరువుకు నీరందక మా పొలాలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. కొండగెడ్డ ఆక్రమణకు గురవడంతో కొండనీరు చెరువులోకి రావడం లేదు. చెరువు కింద నాకు 80 సెంట్లు భూమి ఉంది. నీరులేక ఈ ఏడాది నాట్లుకు కూడా ఇబ్బంది పడ్డాం.
-మొల్లి సత్తిబాబు, ఆయుకట్టు రైతు, వెంకన్నపాలెం.
గతంలో ఈ పరిస్థితి లేదు
నా సొంత భూమితో పాటు ఎకరాన్నర కౌలుకు చేస్తున్నాను. వరి, చెరకు వేశాను. నాలి చెరువులో గతంలో ఎప్పుడూ నీరుండేది. ఇప్పుడు స్వామి గెడ్డ ఆక్రమణకు గురవ్వడం, రియల్ఎస్టేట్ వారు రోడ్డు వేయడంతో గెడ్డ కుదించుకుపోయింది. ఎగువ నీరు చెరువులోకి రావడం లేదు.
-పిల్లల దేముళ్లు, రైతు, వెంకన్నపాలెం.
గెడ్డనీరు చెరువులోకి రాలేదు
లేఔటుదారులు గెడ్డను ఆక్రమించి రోడ్డు వేస్తున్నారు, గెడ్డ మధ్యలో తూము కూడా క ట్టేశారు. గెడ్డ నీరు పూర్తిగా చెరువులోకి రాకుండా పొంగిపోయి రోడ్డుపై వృధాగా పోతోంది. గెడ్డ ఆక్రమణలు తొలగించి పూడికలు తీయాలి.
-మురుకుటి పైడిరాజు,
ఆయకట్టు రైతు, వెంకన్నపాలెం