రెబెక్కాకు కలసి వచ్చే కాలం వచ్చింది
కలసివచ్చే కాలం వస్తే నడచి వచ్చే కొడుకు పుడతాడంటారు. అయితే న్యూజిలాండ్‌కు చెందిన రెబెక్కా ఓల్డమ్కు నడిచి వచ్చే కొడుకు పుట్టకపోయినా.. తాను షాక్‌కు గురయ్యేలా.. కొడుకు పుట్టేశాడు. విషయం ఏంటంటే.. 25 ఏళ్ల రెబెక్కా కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. మూడుసార్లు స్కాన్లు, రెండుసార్లు రక్త పరీక్షలు, ఆరుసార్లు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసిన తర్వాత ఆ నొప్పికి కడుపులోని ఓవరీస్ కారణమని వైద్యులు తేల్చారు. ఓవరీస్ తొలగిస్తే ఇక పిల్లలు పుట్టరని తెలిసినా నొప్పి భరించలేకపోతున్న రెబెక్కా వాటిని తొలగించాలనే నిర్ణయానికి వచ్చి ఆపరేషన్‌కు సిద్ధమైంది. శస్త్రచికిత్స మొదలుపెట్టిన వైద్యులు రెబెక్కా కడుపులో పూర్తిగా ఎదిగిన, ఆరోగ్యవంతమైన మగ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు.
సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అనుకోని పుత్రోదయంతో రెబెక్కా, ఆమె భర్త జేమ్స్ టిపేన్ పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీరికి 20 నెలల హేలే ఉన్నాడు. దీనిపై ఆస్పత్రి ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రతి ఆరు వందల మంది గర్భిణుల్లో ఒకరికి తాము గర్భం ధరించామనే విషయం తెలియదన్నారు. ఇది సాధారణంగా పనిచేసే మహిళల్లో, మెనోపాజ్‌కు చేరువలో ఉన్న వాళ్లలో జరుగుతుందన్నారు. కొంతమంది గర్భవతులుగా ఉన్నా బ్లీడింగ్ జరుగుతూనే ఉంటుందన్నారు. రెబెక్కా కేసు కూడా ఇలాంటి కోవలోదేనని తేల్చేసి తమ తప్పును కప్పిపుచ్చేసున్నారు.