శాంసంగ్ నెత్తిన మరో బాంబు
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కష్టాలు వీడడంలేదు శాంసంగ్ గెలాక్సీ నోట్7 పేలుళ్ల బాధలనుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల సంస్థను తాజాగా మరో వివాదం చుట్టుకుంది. శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు కూడా పేలుతున్న సంఘటనలు ఆందోళన రేపుతుండడంతో అమెరికాలో దాదాపు 30 లక్షల మెషీన్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది.
శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలినపుడు బాంబు పేలినంత పెద్ద శబ్దం వచ్చిందని బాధిత వినియోగదారులు ఒకరు వివరించారు. తీవ్రమైన వైబ్రేషన్ రావడం లేదా వాషింగ్ మెషిన్ పైన వుండే టాప్ భయంకరమైన శబ్దంతో పేలిపోవడమోజరుగుతోందంటూ వినియోగదారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ పేలుళ్ల సందర్భంగా దవడ, భుజాలు విరిగిపోవడం లాంటి తీవ్ర గాయాలైన దాదాపు 733 కేసులు నమోదు కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
2011లో విక్రయించిన 34 మోడళ్ల మొత్తం 2.8 మిలియన్ల వాషింగ్ మెషీన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మెషీన్లను కొనుగోలు చేసిన వారు ఫ్రీగా రిపేరు చేయించుకోవచ్చని, లేదా నగుదును మొత్తం తిరిగి తీసుకోవచ్చని తెలిపింది. లేదంటే మరో శాంసంగ్ మెషీనతో ఎక్సేంజ్ చేసుకుంటే స్పెషల్ రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. తమ విశ్వసనీయ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ క్షమాపణలు తెలిపింది. అయితే నార్త్ అమెరికా వెలుపల అమ్మిన మోడల్స్ లో ఈ ప్రభావం లేదని చెప్పింది. మరోవైపు అమెరికాకు చెందిన కన్జ్యూమర్ సేఫ్టీ ప్రొడక్షన్ అధికారులు (సీపీఎస్సీ) కూడా ఈ విషయంలో వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే రిపేర్ చేయించుకోవాలని లేదా సేఫ్టీ కిట్ వాడాలని సూచించింది.
కాగా శాంసంగ్ 2013లో ఆస్ట్రేలియాలో లక్షా యాభైవేల వాషింగ్ మెషిన్లను రీకాల్ చేసింది. అలాగే కొరియాకు చెందిన ఈ మొబైల్ మేకర్ తన తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లు సృష్టించిన వివాదంతో భారీ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే.