recognise
-
గుండు కొట్టించాడు.. ఉన్న ఉద్యోగం ఊడింది
సాక్షి ,హైదరాబాద్: మంచి జరగాలని దేవునికి తలనీలాలు ఇచ్చుకోవడం చాలా మంది చేసేదే! అయితే, అదే గుండు వల్ల ఉన్న ఉద్యోగం పోవడం నిజంగా దురదృష్టమే. హైదరాబాద్ నగరంలో గుండు కోట్టించుకున్నందుకు ఓ యువకుడికి ఉద్యోగం పోయింది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ఉబర్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్నాడు. అనంతరం ఎప్పటిలానే ఫిబ్రవరి 27న ఉబర్ యాప్‌లో సెల్ఫీతో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో పలుమార్లు ప్రయత్నిస్తే అతడి ఖాతా పూర్తిగా బ్లాక్ కావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. కారణం ఏంటా అని చూస్తే గుండుతో విధుల్లో చేరేందుకు వచ్చిన శ్రీకాంత్ ముఖాన్ని ఉబర్ యాప్ గుర్తుపట్టకపోవడంతో ఉపాధికి దూరమయ్యాడు. అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్లతో 4.67 స్టార్ రేటింగ్‌తో ఉన్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశాడు. ‘ప్రస్తుతం నా ఖాతా బ్లాక్ అయింది. ఉబర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. నా కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. కానీ, నేను అంత భరించలేను. నెల తర్వాత మళ్లీ ఉబర్ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది’ అంటూ అతను వాపోయాడు. యాప్ ఆధారిత ట్రాన్స్పోర్ట్ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలాయుద్దీన్ ఈ విషయంపై మాట్లాడుతూ డ్రైవింగే శ్రీకాంత్ కు జీవనాధారమని, అతడు కారు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో ఉబర్ అల్గారిథమ్ డ్రైవర్ల ముఖాల్ని గుర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు రాకూడదని, ఉబర్ సంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ( చదవండి: తాగి తందనాలు.. భార్య హోటల్లో పనిచేస్తుండటంతో ) -
అనుమతుల్లేని బీఈడీ కళాశాలల్లో చేరొద్దు
‘శాతవాహన’ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి కమాన్‌చౌరస్తా : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని బీఈడీ కళాశాలలు పూర్తిస్థాయిలో అనుమతులు రాకున్నా వచ్చాయని ప్రచారం చేస్తున్నాయని, విద్యార్థులు ప్రవేశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2016–17 విద్యాసంవత్సరానికి కొన్ని కళాశాలలకు అనుమతుల ప్రక్రియ ఇంకా పరిశీలనలో ఉందని, వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా ప్రవేశాలు పొందాలని తెలిపారు. -
విద్యార్థుల త్యాగాలు మరిచిన ప్రభుత్వం
కరీంనగర్ : ప్రభుత్వం విద్యార్థుల త్యాగాలను మరిచి స్వార్థ రాజకీయాల ప్రభుత్వం వ్యవహరిస్తుందని రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు సూకురి అశోక్ మండిపడ్డారు. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు కెంసారం సాయికృష్ణ, లింగంపల్లి పవన్‌కల్యాణ్, ధీరజ్, శంకర్, అరుణ్‌కుమార్, కమలాకర్, శివ, సాయి, ప్రవీణ్, అమృత్‌సింగ్, అక్షయ్, అంజయ్య, సయ్యద్ ఇస్రఫ్, యూసుఫ్, పవన్ పాల్గొన్నారు. -
చర్చ: మళ్లీ భూకంపం!
-
పవన్ 'జనసేన'కు ఈసీ గుర్తింపు
-
పవన్ కల్యాణ్ జనసేనకు ఈసీ గుర్తింపు
న్యూఢిల్లీ: సినీ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది. గురువారం జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. జనసేన పార్టీ తరపున ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చింది. ఈ రెండు పార్టీల తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. పవన్ జనసేన కార్యవర్గాన్నిఇంతవరకు ప్రకటించలేదు. ఎన్నికల తర్వాత ఓ సినిమాలోనటించారు. వెంకటేశ్ 'గోపాల గోపాల' సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. -
తృతీయ ప్రకృతి!
సృష్టి గీసిన గీత ఒకటుంది. అందరూ ఆ గీతకు అటో, ఇటో ఉంటారన్నది...ఉండాలన్నది అధిక సంఖ్యాకుల్లో పాతుకుపోయిన భావన. అయితే ఆడ లేకపోతే మగ అన్నది ఈ భావన సారాంశం. అటూ ఇటూ కానివారున్నారని... దేహం ఒకలా, మనసు వేరేలా ఉండి ఆ తరహా పౌరులు సతమతమవుతున్నారని గుర్తించరు. అసలు వారిని మనుషులుగానే పరిగణించరు. అలాంటివారిని విపరీత మనస్తత్వం ఉన్నవారిగా, వికృత పోకడలకు పోతున్నవారిగా అవమానిస్తారు. శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. సర్వోన్నత న్యాయస్థానం మొట్టమొదటిసారి ఇలా వివక్షకు గురవుతున్నవారి మనోవేదనను గుర్తించింది. లింగ వర్గీకరణలో ఇంతవరకూ పరిగణిస్తున్న స్త్రీ, పురుష కేటగిరీలను మాత్రమే కాక ఇకపై హిజ్రాలను మూడో కేటగిరీకింద గుర్తించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు...అలాంటి పౌరులను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలుగా గుర్తించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమాజంలో వారెదుర్కొంటున్న అన్ని రకాల వివక్షనూ తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పత్రాల్లోనూ ఇంతవరకూ ఇలాంటివారంతా తమ అభీష్టానికి భిన్నంగా స్త్రీ అనో, పురుషుడనో మాత్రమే గుర్తింపుపొందుతున్నారు. అందువల్ల వారి వాస్తవ జనాభా ఎంతో, వారి అవసరాలేమిటో, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో ప్రభుత్వాలకు తెలియకుండా పోయింది. వాస్తవానికి సమాజంలోని భిన్నవర్గాల సమస్యలను గుర్తించి, వారి అభ్యున్నతికి, సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడం పాలకుల ధర్మం. వారి బాధ్యత. తాము గుర్తించడం మాట అటుంచి, హిజ్రాలనుంచి వచ్చిన వినతులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందువల్లే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం అవసరమైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేకవిధాల విశిష్టమైనది. మన రాజ్యాంగం ఎవరినీ వారి పుట్టుక ఆధారంగా వివక్షకు గురిచేయకూడదని చెబుతున్నది. కానీ, జన్యుపరమైన లోపాలతో జన్మించే ఈ మాదిరి పౌరులు అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఆ వర్గాలవారికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కులేమీ ఉండటంలేదు. అందువల్లే వారు బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలో, జైళ్లలో...ఆఖరికి రక్షక భటుల చేతుల్లో లైంగిక దాడులకు గురవుతున్నారని సుప్రీంకోర్టు సరిగానే గుర్తించింది. అల్పసంఖ్యాకులే అయినా వారూ మనుషులేనని, అందరికీ ఉండే మానవహక్కులు వారికీ వర్తిస్తాయని స్పష్టంచేసింది. జన్యుపరమైన లోపాల కారణంగా శారీరక సౌష్టవాన్నిబట్టి పురుషులుగానే కనబడ్డా వారు మానసికంగా వారు ఆ కేటగిరీలో చేరరని...అలాగే స్త్రీల మాదిరిగా కనబడ్డా వారికి ఆ శరీర ధర్మాలేవీ ఉండవని చెబుతూనే అలాగని దీన్ని కేవలం వైద్యపరమైన సమస్యగా మాత్రమే పరిగణించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. వీరిలో కొందరు శస్త్ర చికిత్స అనంతరం పురుషులుగానో, స్త్రీలగానో మారినప్పుడు వారు కోరిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని తెలిపింది. మన దేశంలో పరిమిత ప్రయోజనాలకోసం హిజ్రాలను గుర్తించే పని చాన్నాళ్లక్రితమే మొదలైంది. 2005లో పాస్‌పోర్టు దరఖాస్తుల్లో అలాంటివారిని ‘ఈ’ కేటగిరీగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా ఈసారి ఇలాంటివారిని ‘ఇతరులు’ అనే కేటగిరీలో పెట్టింది. జనాభా లెక్కల్లోనూ విడిగా సూచించారు. ఈ చర్యల తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం తనపరంగా చేయాల్సిన విధానపరమైన చర్యలను ప్రారంభించాల్సింది. కానీ, తొమ్మిదేళ్లయినా ఎలాంటి చలనమూ లేకపోయింది. తమిళనాడువంటి రాష్ట్రాలు హిజ్రాలకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయడం, ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, రేషన్ కార్డుల మంజూరులాంటి చర్యలు తీసుకున్నాయి. కానీ, ఇవి మాత్రమే సరిపోవు. మొత్తంగా ఆ వర్గానికి సంబంధించిన పౌరుల కోసం సమగ్రమైన విధానం, కార్యాచరణ అవసరం. ముఖ్యంగా వైద్యపరమైన సౌకర్యాలు, ఇళ్ల మంజూరు... విద్యారంగంలోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లువంటివన్నీ ఉంటేనే అలాంటివారు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. ఆత్మగౌరవంతో బతుకుతారు. సామాజిక పురోగమనంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు బిచ్చమెత్తుకునేవారిగా, వ్యభిచారులుగా బతుకులు వెళ్లదీయాల్సివస్తోంది. హిజ్రాల్లో అత్యధికులకు హెచ్ఐవీ, ఎయిడ్స్‌వంటి సాంక్రమిక వ్యాధుల బారిన పడటం ఈ దుస్థితివల్లే. మన పొరుగునున్న, మనతో పోలిస్తే అన్నివిధాలా చిన్న దేశాలైన నేపాల్, పాకిస్థాన్వంటివి హిజ్రాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వారికోసం చాలా ఏళ్లక్రితమే చట్టాలు చేశాయి. సమానత్వ సాధనలోనూ, మానవహక్కులపరంగానూ సుప్రీంకోర్టు తీర్పు కీలకమైనదే. అయితే, ఈ విషయంలో ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుత తీర్పు భిన్నమైన లైంగిక భావనలుండేవారందరికీ రక్షణనివ్వదు. ఇది కేవలం హిజ్రాలకు మాత్రమే పరిమితమని...స్వలింగ సంపర్కులకు, ద్విలింగ సంపర్కులకు వర్తించదని ధర్మాసనం తెలి పింది. నిరుడు డిసెంబర్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను కొట్టేసేందుకు సుప్రీంకోర్టులోని మరో బెంచ్ నిరాకరించింది. ఈ విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది శాసనవ్యవస్థేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పులు రెండింటినీ గమనిస్తే ఈ విషయంలో విస్తృత అవగాహన, విశాల దృక్పథం మరింత అవసరమని అర్ధమవుతుంది. అందుకు సంబంధించిన బీజాలు ప్రస్తుత తీర్పులో ఉండటం హర్షించదగ్గ విషయం. -
ఎమ్మార్పీఎస్ పోరాటం వల్లే దళితులకు గుర్తింపు
మహేశ్వరం, న్యూస్‌లైన్: గత కొన్నేళ్లుగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటం, ఉద్యమాల కారణంగానే రాష్ట్రంలో దళితులకు గుర్తింపు లభించిందని, తమ వల్లే పలువురు దళితులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కాగలిగారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనవరి నెల మొదటి వారంలో తాను కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన మహేశ్వరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... జనవరిలో తాను పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఏబీసీడీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం వర్గీకరణ బిల్లుపై ఉద్యమిస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగానే ప్రతి మాదిగలో చైతన్యం వచ్చిందని అన్నారు. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు అందె రాంబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వనం నర్సింహా మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు ఎన్వై. ఆశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు వత్తుల రఘుపతి, జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ, మాదిగ విద్యార్థి పెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొండ్రు ప్రవీణ్‌మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జి కొంగరి నర్సింహా మాదిగ, మండల అధ్యక్షుడు బక్కని రవి మాదిగ, నాయకులు లక్ష్మణ్, ప్రశాంత్ మాదిగ, స్వామి మాదిగ, వికలాంగులు, ఉద్యోగులు, యువసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.