సాక్షి ,హైదరాబాద్: మంచి జరగాలని దేవునికి తలనీలాలు ఇచ్చుకోవడం చాలా మంది చేసేదే! అయితే, అదే గుండు వల్ల ఉన్న ఉద్యోగం పోవడం నిజంగా దురదృష్టమే. హైదరాబాద్ నగరంలో గుండు కోట్టించుకున్నందుకు ఓ యువకుడికి ఉద్యోగం పోయింది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ఉబర్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్నాడు. అనంతరం ఎప్పటిలానే ఫిబ్రవరి 27న ఉబర్ యాప్‌లో సెల్ఫీతో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో పలుమార్లు ప్రయత్నిస్తే అతడి ఖాతా పూర్తిగా బ్లాక్ కావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి.
కారణం ఏంటా అని చూస్తే గుండుతో విధుల్లో చేరేందుకు వచ్చిన శ్రీకాంత్ ముఖాన్ని ఉబర్ యాప్ గుర్తుపట్టకపోవడంతో ఉపాధికి దూరమయ్యాడు. అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్‌లతో 4.67 స్టార్ రేటింగ్‌తో ఉన్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశాడు. ‘ప్రస్తుతం నా ఖాతా బ్లాక్ అయింది. ఉబర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. నా కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. కానీ, నేను అంత భరించలేను. నెల తర్వాత మళ్లీ ఉబర్ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది’ అంటూ అతను వాపోయాడు.
యాప్ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలాయుద్దీన్ ఈ విషయంపై మాట్లాడుతూ డ్రైవింగే శ్రీకాంత్ కు జీవనాధారమని, అతడు కారు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్‌డౌన్ సమయంలో డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో ఉబర్ అల్గారిథమ్ డ్రైవర్ల ముఖాల్ని గుర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు రాకూడదని, ఉబర్ సంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.
( చదవండి: తాగి తందనాలు.. భార్య హోటల్‌లో పనిచేస్తుండటంతో )
Comments
Please login to add a commentAdd a comment