క్యాబ్‌ ఆవాజ్‌: డ్రైవర్ల సమ్మె బాట | Cab Drivers Strike on This Month 19th Hyderabad | Sakshi
Sakshi News home page

క్యాబ్‌.. ఆవాజ్‌ డ్రైవర్ల సమ్మె బాట

Published Fri, Oct 18 2019 10:07 AM | Last Updated on Wed, Oct 23 2019 11:44 AM

Cab Drivers Strike on This Month 19th Hyderabad - Sakshi

నగరంలో క్యాబ్‌ సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీకార్మికులు సమ్మె చేస్తుండగా... క్యాబ్‌ డ్రైవర్లూ ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఈ మేరకుతెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ జేఏసీ నాయకులు గురువారం ప్రకటించారు. కిలోమీటర్‌కు రూ.22 చెల్లించాలని, డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే మొబైల్‌ యాప్‌లతో పాటు మీటర్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో సమ్మె అనివార్యమన్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న  ప్రస్తుత తరుణంలో  ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్లు సైతం సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 19నుంచి క్యాబ్‌ బంద్‌ చేపట్టనున్నట్లు  తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మెన్‌ షేక్‌ సలావుద్దీన్, కన్వీనర్‌ కె.ఈశ్వర్‌రావు, కో–చైర్మెన్‌ బి.వెంకటేశం తెలిపారు. దీంతో  19నుంచి ఉబెర్, ఓలా తదితర  క్యాబ్‌లతో పాటు, ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్‌ సేవలు కూడా నిలిచిపోనున్నాయి.   కిలోమీటర్‌కు  రూ.22 చొప్పున చెల్లించాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే   మొబైల్‌ యాప్‌లతో పాటు  మీటర్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని    తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ జేఏసీ  డిమాండ్‌ చేస్తోంది.

ప్రస్తుతం  క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు పెద్ద ఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో  డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చాలామంది  అప్పులపాలయ్యారు. ఫైనాన్షియర్ల వద్ద చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. డ్రైవర్ల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఈ  పరిస్థితులను మార్చేందుకు   ప్రతి డ్రైవర్‌కు కనీసం బిజినెస్‌ గ్యారెంటీ ఇవ్వాలని,  ఇందుకనుగుణంగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను  మార్చుకోవాలని  జేఏసీ చైర్మెన్‌  సలావుద్దీన్‌  డిమాండ్‌ చేశారు. ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించి  జీవో 61, 66లకు  అమలు చేయాలని కోరారు. మరోవైపు  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు.19వ తేదీ వరకు తమ డిమాండ్‌లపైన స్పష్టమైన హామీ  లభించకపోతే సమ్మెను నిరవధికంగా కొనసాగించనున్నట్లు  తెలిపారు. 

నిలిచిపోనున్న 50 వేల క్యాబ్‌లు
క్యాబ్‌ బంద్‌ కారణంగా నగరంలో  సుమారు 50 వేలకు పైగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ల సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేలకు పైగా క్యాబ్‌లకు కూడా బ్రేక్‌ పడనుంది. అలాగే  హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కారణంగా రాత్రి పూట సిటీ బస్సులు నిలిచిపోవడంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యాబ్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. కానీ క్యాబ్‌లు కూడా సమ్మెలో పాల్గొంటే ప్రజా రవాణాకు మరింత ఆటంకం కలగనుంది. క్యాబ్‌ డ్రైవర్‌ల సమ్మె వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement