సాహితీ ‘చంద్రుడు’
కథకుడిగా, కవిగా, రచయితగా, అనువాదకుడిగా సాహిత్యరంగానికి నాలుగున్నర దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు ఐతా చంద్రయ్య. ఈయన రచనలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. సిద్దిపేట కీర్తిని సాహిత్య రంగంలో తనవంతుగా ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తున్న చంద్రయ్య ఇప్పటి వరకు 500కు పైగా రచనలు చేశారు. బహుముఖ పాత్రలు పోషిస్తూ వైవిధ్య భరితమైన రచనలు చేస్తున్నారు.
- నాలుగున్నర దశాబ్దాలుగా సాహితీలోకంలో చంద్రయ్య
- బహుముఖ రంగాల్లో అనుభవం
- ఇప్పటికి 500 పైగా రచనలు
సిద్దిపేట మండలం చింతమడక గ్రామానికి చెందిన లింగయ్య,లక్ష్మి దంపతులకు జన్మించిన చంద్రయ్య విద్యాభ్యాసం కోసం సిద్దిపేటకు బాల్యంలోనే రావాల్సి వచ్చింది. పట్టణానికి చెందిన ప్రముఖ కవి కోకిల వేముగంటి నర్సింహ్మాచారి స్ఫూర్తితో తన 20వ యేట కలం నుంచి జాలువారిన అక్షరాల సమాహారమే రోజులు మారాలి అనే నాటిక. అప్పట్లో ఈ నాటిక పలువురి మన్ననలను అందుకొంది. అలా మొదలైన చంద్రయ్య సాహిత్య ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ అవార్డులు, రివార్డులతో ముందుకు సాగింది. ఇప్పటి వరకు సుమారు 400 కథలతో పాటు పలు కవితా సంపుటాలు, అనువాద పుస్తకాలు, శతకాలు, రేడియో నాటికలు తదితర 500 రచనలు చేశారు.
ఆయన మేదస్సు నుంచి వెలువడిన 19 కథాసంపుటాలు, 14 కవితా కావ్యాలు, 9 నవలలు, 11 రేడియో నాటికలు, 18 హిందీ, ఇంగ్లీష్‌కు చెందిన రచనల అనువాదాలు ఐతా చంద్రయ్య కవితా ఆసక్తికి అద్దం పడతాయి. మరోవైపు చంద్రయ్య రాసిన స్వేచ్ఛా జీవులు కథాసంపుటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పరిశోధన అంశంగా గుర్తింపు పొందింది. ఆయన రాసిన నవలలు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థుల పరిశోధనకు ఎంతో దోహదపడుతున్నాయి. తన రచన ప్రస్థానాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక రివార్డులు , అవార్డులు పొందారు.
ఈయన పొందిన పురస్కారాలు
వేముగంటి సాహితి పురస్కారం, పొట్టిశ్రీరాములు ప్రతిభా పురస్కారం, సోమేశ్వర సాహితీ పురస్కారం, ఆంధ్రాసారస్వత సమితి పురస్కారం, విశాల సాహిత్య అకాడమీ జీవిత కాల పురస్కారం, అచ్యుత రామశాస్త్రి పురస్కారం, శాతవాహన విశ్వవిద్యాలయ పురస్కారంతో పాటు ఇటీవల తెలంగాణ వార్షికోత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సినారె, రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అనేక బహుమతుకు అందుకున్నారు.
సంతృప్తిగా ఉంది
మధ్యతరగతిలో జన్మించి సాహిత్య లోకానికి సేవ చేస్తున్నాననే సంతృప్తి ఉంది. సాహిత్యంలో ఎం.ఏ పూర్తిచేసి అటు పోస్టల్ శాఖా ఉద్యోగిగా పనిచేస్తూనే రచనలు, కవితలు, పుస్తకాలు రాశాను. ఈశేష జీవితాన్ని సాహిత్య రంగానికి అంకితం చేస్తా.
-ఐతా చంద్రయ్య