జీవిత కథ
‘‘అమ్మా జాగ్రత్త! ఈ వయసులో నిన్ను ఒంటరిగా పంపడం ఇష్టంలేదు. నాకూ రావాలనే వుంది కానీ ఈ నెలాఖరుకు రిటైర్ అవుతుండటంతో సెలవు పెట్టడం కుదరక నేను రాలేకపోతున్నాను. రాజమండ్రి స్టేషన్‌కు మావయ్య కొడుకు రామం వస్తానన్నాడు. జాగ్రత్తగా దిగు. వెళ్ళగానే ఫోనుచేయి.’’ గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో తల్లిని కూర్చోబెట్టి జాగ్రత్తలు చెప్పాడు శ్రీహర్ష.‘‘గోదావరికీ నాకూ ఉన్న అనుబంధం నీకు తెలిసిందే కదరా. పుష్కరాలలో గోదావరిలో స్నానం చేయందే నాకు తోచదని నీకు తెలుసుకదా. నాకేం ఫరవాలేదు. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్లు ...’’ తనయునికి ధైర్యం చెప్పింది గౌతమి.అమ్మ చేతిలో చేయివేసి ఆప్యాయంగా తడిమి రైలు దిగాడు శ్రీహర్ష.గౌతమీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా బయలుదేరి వేగం పుంజుకుంది.స్టేషన్లో శ్రీహర్ష కొనియిచ్చిన పుష్కరాల స్పెషల్ పత్రిక తీసి పేజీలు తిరగేసింది. గోదావరిలో కేరింతలు కొడుతున్న చిన్నపిల్లల ఫైలు ఫొటోలు చూస్తూంటే తన బాల్యం గుర్తుకువచ్చింది గౌతమికి.
ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం గోదావరి పుష్కరాల మొదటిరోజున పుట్టిన అమ్మాయికి గౌతమి అని పేరు పెట్టారు తల్లిదండ్రులు.గౌతమి బాల్యమంతా రాజమండ్రిలో గడిచింది.ముగ్గురు అబ్బాయిల తరువాత పుట్టిన అమ్మాయి కావడంతో గౌతమి గారాబంగా పెరిగింది.చిన్నతనంలో ఆడుకున్న ఆటలు... వామనగుంటలు... తొక్కుడుబిళ్ళ... సంక్రాంతికి ముగ్గులు పెట్టడం... గొబ్బెమ్మలు... గుర్తుకు వచ్చాయి గౌతమికి.‘ఈకాలం పిల్లలకు ఈ ఆటలేవీ తెలియవు. ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. అప్పటి బాల్యం స్వేచ్ఛావిహారం. బండెడు పుస్తకాల బరువు లేదు. హోంవర్కుల బెడద లేదు. ఆడుతూ పాడుతూ చదువులు. సుమతీ శతకం, వేమన శతకం అమ్మ వంట చేస్తూ వల్లెవేయించేది.’ బాల్య స్మృతులు తలచుకొని మురిసిపోయింది గౌతమి.టీసీ వచ్చి టికెట్ చెక్ చేశాడు.పై బెర్త్ మీద యువతి లైట్ ఆర్పి బెర్త్ ఎక్కి పడుకుంది.తన బెర్త్‌పై దుప్పటి పరుచుకుని నడుం వాల్చింది గౌతమి.కళ్ళు మూసుకుంటే చిన్నప్పుడు మొదటి పుష్కరస్నానం చేసిన ఘటన తలపుకొచ్చింది.అప్పటికి గౌతమి వయసు పన్నెండేళ్ళు.తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మ... మామ్మ... పెదనాన్నలు... మావయ్యలు... వాళ్ళ పిల్లలు... అందరూ కలిసి నలభైమంది కలిసికట్టుగా గోదావరి చేరుకున్నారు.పిల్లలు గోదావరిలో ఉత్సాహంగా ఉరకలేశారు. ఒరేయ్ కృష్ణా జాగ్రత్తరా... పెద్దోడా నీకసలే తొందర... నెమ్మదిగా దిగు... చిన్నా... నువ్వు పెద్దాడి చెయ్యి పట్టుకో... గౌతమీ, మగాళ్ళతో సమానంగా ఏమిటీ పరుగులు... అంటూ పెద్దలుహెచ్చరిస్తున్నా వినీ విననట్లు పిల్లలు గోదావరిలో ఈదులాటలు...అరగంటపైగా నదిలో జలకాలాడి బయటకు వస్తే చెప్పలేని ఆనందం...‘‘మంచి మొగుడు రావాలని గోదావరమ్మకు మొక్కుకో’’ తల్లి సలహా.స్నానాలయ్యాక ఇంటికి చేరి అమ్మకు వంటపనిలో సహాయం చేయడం... బంధుమిత్రులతో కలిసి విందుభోజనం. ‘పుష్కరాల పన్నెండు రోజులూ రోజూ ఇంటికి వచ్చిన బంధువులతో కలిసి వెళ్ళి స్నానం చేసి వచ్చిన రోజులు మరచిపోదామన్నా మరపురావు. గోదావరితో అనుబంధం అప్పుడే బలపడింది.’ అనుకుంటూ చలిగా అనిపిస్తే రగ్గు తీసి కప్పుకుంది గౌతమి.
పడుకుందామ నుకున్నా నిద్ర రావడంలేదు. మనసు నిండా ఆలోచనలు.రెండోసారి పుష్కరాలు గుర్తుకు తెచ్చుకుంది గౌతమి.పుష్కరానికీ పుష్కరానికీ మధ్య ఆ పన్నెండేళ్ళలో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశమంతా సంబరాలు జరుగుతున్న రోజున ఇంట్లో స్వీట్లు చేసి అందరికీ పంచింది తల్లి. ఇంటిపైన జెండా ఎగరేశాడు తండ్రి.ఆ పుష్కరాలకి వయసు తెచ్చిన అందాలతో భాసిల్లింది గౌతమి. వివాహమైంది. భర్త రాఘవరావు అమలాపురంలో స్కూల్ టీచర్. గౌతమి ఇంటిపేరు మారింది.మొదటిసారి పుష్కరాలకి తల్లిదండ్రులు తోడుంటే రెండోసారి పుష్కరాలకు అత్తమామలు, భర్తతో కలిసి గోదావరికి వెళ్ళింది గౌతమి.భర్త, అత్తమామలు, ఆడపడుచులు... మరుదులు... పెద్దత్తగారు... పిల్లలు అందరూ కలిసి గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు.అటు తిరిగితే భర్త... ఇటు తిరిగితే అత్తమామలు... మధ్యలో ఒదిగి ఉండవలసిన జీవితం.తన వైవాహిక జీవితాన్ని తలచుకుంటూ బెర్తుపై లేచి కూర్చుంది గౌతమి.అత్తారింటికి వెళ్ళడానికి ముందు ఉమ్మడి కుటుంబంలో సర్దుకుపోయే మనస్తత్వం అలవరచుకోమని తల్లి నూరిపోసింది.భయంభయంగా అమలాపురంలోని అత్తారింట్లో అడుగుపెట్టింది గౌతమి. మొదటిరోజే పెద్దకోడలికి వంటగది అప్పజెప్పింది అత్తగారు.ఆ ఇంట్లో ఆవిడదే పెత్తనమని గ్రహించింది కోడలు. మామగారు నోరులేని మనిషి. ఆ రోజుల్లో అత్తగారి ఆంక్షల వలయంలో పగలంతా వంటగదికే అంకితమయ్యేది గౌతమి.నాలుగువందల గజాల స్థలంలో పది కొబ్బరిచెట్ల మధ్య పెంకుటిల్లు...రోజూ తెల్లవారుజామున లేచి ఇంటిచుట్టూ తుడిచి... నీళ్ళు జల్లి... ముగ్గులేసేది. కాస్త పొద్దెక్కగానే వంటింట్లో చేరి అందరికీ కాఫీలు... ఫలహారాలు... కట్టెలపొయ్యి మీద వంటలు... వంట పూర్తయ్యేసరికి పొగకికళ్ళుఉబ్బిపోయేవి.మధ్యాహ్నం భోజనాల తరువాత... రోట్లో ఇడ్లీ పప్పు... పచ్చళ్ళు రుబ్బడం... తిరగలిలో పప్పులు... బియ్యంనూక విసరడం... ఏదో ఒక పని ఎదురుచూసేది.ఇంటికి వచ్చే పోయే చుట్టాలతో ఇల్లు కళకళలాడుతుండేది.పని పని పని... పగలంతా క్షణం తీరిక లేని పని.పగలంతా ఎంత అలసినా... రాత్రి భర్త చేరువలో సేదతీరేది.రాఘవరావు నెమ్మదస్తుడు. అతని మంచితనం ఆమెకు వరమయింది.‘‘పచ్చని పసిమిఛాయ... కలువ రేకుల్లాంటి కళ్ళు... చంద్రబింబం లాంటి మోము... అన్నిటికీ మించి నీ ఓర్పు, మంచితనం... అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం... నాకోసం దివిపై వెలసిన దేవతవు’’ అని భర్త పొగుడుతుంటే సిగ్గుల మొగ్గయ్యేది భార్య.భర్త అనురాగ బలంతో భార్య అలసట మాయమయ్యేది.భర్త తలపుకు రాగానే కళ్ళు చెమ్మగిల్లాయి గౌతమికి.కళ్ళు తుడుచుకుని మంచినీళ్ళు తాగి బెర్త్‌పై మేనువాల్చింది. ‘నిద్ర రావడంలేదు... ఎందుకో గతం పదే పదే గుర్తుకువస్తోంది.’ అనుకుంటూ అంతలోనే లేచి కూర్చుంది.
మూడోసారి పుష్కరాలకు వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలు తోడయ్యారు.అబ్బాయి శ్రీహర్ష. అమ్మాయి శ్రీలత.భర్త, అత్తగారు, పిల్లలు... మరుదులు, తోటికోడళ్ళతో కలిసి రాజమండ్రి చేరుకుంది గౌతమి.ఈమధ్య కాలంలో మావగారు గుండెపోటుతో మరణించారు.స్నానం చేస్తూ అత్తగారు కన్నీరు కార్చారు. ఆమె చేయి పట్టుకుని స్నానం చేయించి గట్టు మీదకు తీసుకొచ్చింది. రాఘవరావు తండ్రికి పిండప్రదానం చేశాడు.పిల్లలు గోదావరిలో దిగి జలకాలాడుతుంటే బాల్యం గుర్తుకువచ్చి,‘అప్పటి అమ్మ స్థానంలో ఇప్పుడు నేను... నా స్థానంలో నా పిల్లలు...’ అనుకుంటూ జీవితచక్రంలో జరిగిన మార్పుల్ని తలచుకుని గోదావరి గట్టుపై నిలబడి నవ్వుకున్న ఘటన తలపుకొచ్చి పెదవులపై చిరుదరహాసం మెరిసింది.పుష్కరాల నుండి తిరిగి వచ్చిన రెండేళ్ళకి ఉమ్మడికుటుంబం విచ్ఛిన్నమయింది. పెద్దమరిది ట్రాన్స్ఫర్ చేయించుకుని ఏలూరులో మకాం పెట్టాడు.చిన్నమరిది తునికి మకాం మార్చాడు.బంధుమిత్రుల రాకపోకలు తగ్గిపోయాయి. అత్తగారు అనారోగ్యంతో కుదేలయింది.‘‘పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. కాకినాడ విద్యాలయాలకు పెట్టింది పేరు. అక్కడిపిఠాపురం రాజావారి హైస్కూల్లో చదువు బాగుంటుందంటున్నారు. కాకినాడ మారిపోదాం...’’ ప్రతిపాదించింది గౌతమి.రాఘవరావు సమ్మతించాడు.కాకినాడ ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నించి, ఆరు నెలల్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.కాకినాడకు మకాం మారింది.అమలాపురంలో ఇల్లు అమ్మేసి తన వాటా డబ్బుతో కాకినాడలో ఇల్లు కొందామని తల్లితో చెప్పాడు రాఘవరావు.అమలాపురంలో ఇల్లు అమ్మడానికి అత్తగారు మొదట ఒప్పుకోలేదు.నాలుగు నెలలు పోరి తల్లిని ఒప్పించాడు రాఘవరావు. కాకినాడలో చిన్న ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు రాఘవరావు దంపతులు. ‘ఎప్పటి సంగతులో తలపుకొస్తే నిన్న గాక మొన్న జరిగినట్లనిపిస్తోంది’ అనుకుంది గౌతమి.నిద్ర ఎగిరిపోయింది.నాలుగోసారి పుష్కరాలకు వెళ్ళినప్పుడు... తలచుకుంటూ సర్దుకుకూర్చుంది గౌతమి.అత్తగారు కాలంచేశారు. పన్నెండేళ్ళ కాలంలో ఇంట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సౌకర్యాలు సమకూర్చాడు రాఘవరావు.గ్యాస్‌స్టవ్ వచ్చింది. ఫ్రిజ్ వంటింట్లో చేరింది. మిక్సీ కొనుక్కున్నారు.డాబా మీద మూడు గదులు కట్టి అద్దెకిచ్చారు.ట్యూషన్స్ చెపుతూ రాబడి పెంచుకున్నాడు రాఘవరావు.
గౌతమికి పనిభారం తగ్గింది. విశ్రాంతి సమయంలో రామాయణ, భారతాలు చదవడం మొదలుపెట్టింది.పెద్దలనుండి సలహాలు తీసుకునే స్థాయినుండి శ్రేయోభిలాషులకు సలహాలిచ్చే స్థాయికి ఎదిగింది గౌతమి.గోదావరి నదిలో స్నానంచేసి గట్టుమీద నిలుచున్న గౌతమి జీవితం సుఖదుఃఖాల మిళితం అనుకుంటూ గోదావరమ్మకు ప్రణమిల్లింది.‘నా చిన్నప్పుడు నలభైమందితో కలిసి ఆనందం ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతూ గోదావరిలో జలకాలాడాను. ఈరోజున కేవలం నలుగురం రాగలిగాం. రోజులెలా మారిపోయాయో...’ నిట్టూర్చింది గౌతమి.‘‘ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అర్థాంగీ’’ అడిగాడు భర్త నవ్వుతూ భుజంమీద చేయివేసి.‘‘పుష్కరానికీ పుష్కరానికీ మధ్య జీవితంలో వచ్చిన మార్పులు తలచుకుంటూంటే ఆశ్చర్యంగా వుంది. మనుషులు ఎలా మారినా గోదావరి మాత్రం అలాగే వయ్యారంగా పరుగులెడుతోంది.’’ అంది గౌతమి తడిబట్టలు పిండుతూ.‘‘మనిషి జీవితంలో మహా అయితే ఆరేడు పుష్కరాలు చూస్తాడు. ఓ పుష్కరం గడిచిందంటే పన్నెండేళ్ళ కాలం కరిగిపోయినట్లే. జరిగిపోయిన పుష్కరకాలంలో చేసిన తప్పులు సమీక్షించుకుని మరో పుష్కరంలో సాధించాల్సిన లక్ష్యాలు నిర్దేశించుకుని చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడగలిగితే మనిషి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ప్రణాళిక లేకుండా పరుగులు తీస్తే జారిపడడం ఖాయం’’ అన్నాడు రాఘవరావు.‘‘పుష్కరస్నానంతో పాపాలు పోతాయంటే... చేసిన తప్పులు సరిదిద్దుకుని మిగిలిన జీవితమైనా ధర్మబద్ధంగా జీవించమని హెచ్చరించడమే ఈ స్నానాల పరమార్థం కావచ్చు..’’ తన అభిప్రాయం వ్యక్తీకరించింది గౌతమి. పుష్కరఘాట్ వద్ద కొత్తగా ప్రతిష్టించిన గోదావరిమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు.భద్రాచలం వెడదామని పిల్లలు సరదాపడితే ‘‘అలాగే’’ అంటూ భద్రాచలం బయలుదేరారు.గతంగతః అనుకుంటూ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూంటే చిన్న కుదుపు.రైలు స్టేషన్లో ఆగినట్టుంది.బోగీలో లైట్లు వెలిగాయి.ఎదుటి బెర్తు మీద వ్యక్తి సామాను తీసుకుని దిగిపోతున్నాడు. ‘‘ఏవూరు?’’ అడిగింది గౌతమి. ‘‘విజయవాడ’’ అంటూ అతను గబగబా గుమ్మంవైపు వెళ్లిపోయాడు.సెల్లో టైము చూస్తే మూడయింది. తెల్లారడానికి ఇంకా మూడు గంటలు గడవాలి. ఏమిటో ఈరాత్రి నిద్రరావడం లేదు. మనసులో ఏదో దిగులు. లైటు ఆర్పింది గౌతమి.అరవై ఏళ్ళ వయసులో ఐదోసారి పుష్కరాలకు వెళ్ళినప్పటి సంఘటనలు మదిని తట్టాయి.
కిందటి పుష్కరాలకి, ఈ పుష్కరాలకి మధ్యకాలంలో తల్లిదండ్రులు స్వర్గస్తులయ్యారు. పెదనాన్న, పెద్దమ్మలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. అన్నయ్యలు మరణించారు.పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. అబ్బాయి, అమ్మాయిల పెళ్ళిళ్లు జరిగాయి.రాఘవరావు రిటైర్ అయ్యాడు.భార్యాభర్తలు స్వంతగూటిలో మిగిలారు.ఒకప్పుడు చేతినిండా పని... క్షణం తీరికలేని జీవితం...ఇప్పుడు కావలసినంత తీరుబడి... ఇద్దరికి వండుకోవడం... పుస్తకాలు చదవడం...స్నానం చేస్తూ పన్నెండేళ్ళ జీవిత గమనంలో వచ్చిన మార్పుల్ని తలచుకుంటూంటే అయినవాళ్ళు గుర్తుకొచ్చి దుఃఖం పొంగిపొరలి కన్నీటి వరద గోదావరిలో కలిసింది.స్నానం చేసి గట్టుమీద నిలుచున్న గౌతమికి గలగల పారుతున్న గోదావరి మాత్రమే నిత్య సత్యమని తోచింది.‘‘ఒకతరం జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు, పెదనాన్నలు... గురువులు... పెద్దలు... ఒక్కొక్కరిగా ఒరిగిపోతూ... కళ్ళముందే కాలగర్భంలో కలుస్తూంటే పదిరోజుల పరితాపంలో జీవితం భ్రమ అనే సత్యం బోధపడుతుంది. అంతలోనే మరోతరం... కూతుళ్ళు, కొడుకులు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, చిన్నారులు అనురాగం కురిపిస్తూ అలరిస్తూంటే జీవితం సత్యమనే భ్రమలో మునిగిపోతాం’’ అంది గౌతమి.భార్య బాధపడుతోందని తెలుసుకుని ఆమెని అనునయించాడు భర్త.‘‘కాలగమనం ఆగదు... పరుగెడుతూనే ఉంటుంది. తరాలు మారుతూనే ఉంటాయి. భావాలు, భావోద్వేగాలు, సుఖాలు, దుఃఖాలు, కోపాలు, రోషాల మధ్య కొట్టుమిట్టాడే మనిషి బంధాలు అనుబంధాలు పెనవేసుకుని జీవితంపై మమకారంతో బతుకుతాడు. జీవితం క్షణభంగురమని తెలిసీ చిరంజీవి కావాలనుకుంటాడు. వయసు పెరుగుతూంటే జీవితమే మనిషికి పాఠాలు నేర్పుతుంది గౌతమీ. మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాం. మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాం. మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చామన్న తృప్తితో శేషజీవితాన్ని భగవధ్యానంలో గడిపేద్దాం’’ తత్వబోధ చేశాడు రాఘవరావు.
ఆనాటి సన్నివేశం కళ్ళకు కట్టినట్లయింది గౌతమికి. నిడదవోలు వచ్చిందని పై బెర్తు మీద యువతి దిగి వెళ్ళిపోయింది.ఇంకో గంటలో రాజమండ్రిలో ఉంటాననుకుంటూ సర్దుకుకూర్చుంది గౌతమి.క్రితంసారి పుష్కరాలకు కొడుకు, కోడలు, మనుమలతో రాజమండ్రి వచ్చిననాటి సంగతి గుర్తుకు తెచ్చుకుంది.ఇరవైఏళ్ళ మనవరాలు నదిలో స్నానం చేసి వస్తుంటే తనే నడచి వస్తున్నట్లు ఫీలయింది గట్టుమీద నించున్న గౌతమి.మనవరాలు అచ్చు తన పోలికే.‘‘మా అమ్మాయిలో నాకు అమ్మ కనిపిస్తుంది’’ అన్నాడు శ్రీహర్ష.‘‘ఆరోజుల్లో అందరూ నన్ను అమ్మలా వున్నాననే వారు... ఇప్పుడు మనవరాలు నా పోలిక... జీన్స్ ప్రభావం... వారసత్వం వెన్నంటే వుంటుంది’’ గర్వంగా చూసింది గౌతమి.‘‘మనకి వయసయిపోతోంది. మళ్ళీ పుష్కరాలకి ఉంటామో... ఉండమో... పద... తనివితీరా స్నానం చేద్దాం’’ అన్న భర్త మాటలకు ఉలిక్కిపడింది గౌతమి.‘‘ఛ... అవేం మాటలండీ...’’ అంటూనే భర్త చేయిపట్టుకుని నదిలోకి దిగింది.తథాస్తు దేవతలుంటారు కాబోలు...అదే భర్తతో ఆఖరి పుష్కరస్నానం...ఆ పుష్కరాల నుండి వచ్చిన నాలుగేళ్లకి భర్త కాలంచేశాడు.భర్త చనిపోయాక కాకినాడలో ఇల్లు అమ్మేసి హైదరాబాదులో కొడుకు పంచన చేరింది గౌతమి. ఆనాటి సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటిగా గౌతమికి కనులముందు కదలాడాయి.
గోదావరి వంతెనపై రైలు నడుస్తున్న శబ్దం ఆమె కర్ణపుటాలకు తాకింది. ఆలోచనల్లోంచి తేరుకుని, కిటికీ తెర తొలగించి గోదావరమ్మకు నమస్కరించింది.‘నదిలో స్నానం చేస్తూంటే అమ్మ ఒడిలో ఉన్నంత హాయి’ అనుకుంది. నదీమతల్లితో పెనవేసుకున్న అనుబంధం మనసును తడిమింది.ఉదయభానుడు ఉత్సాహంగా తొంగిచూస్తున్నాడు.రాజమండ్రి స్టేషన్లో బండి ఆగుతూంటే... బ్యాగ్ తీసుకుని గుమ్మం దగ్గరకు చేరుకుంది గౌతమి.బోగీ దగ్గరే నించున్నాడు రామం.బ్యాగ్ అందుకుని చేయి అందించి గౌతమికి రైలు దిగడంలో సహాయం చేశాడు.‘‘ప్రయాణం బాగా జరిగిందా అత్తయ్యా... రాత్రి నిద్రపట్టిందా...’’ అడిగాడు రామం ముందుకు అడుగులేస్తూ.‘‘ఓ నిక్షేపంగా...’’ నవ్వుతూ బదులిచ్చింది గౌతమి.‘‘నడవగలవా... వీల్‌చైర్æమాట్లాడనా...’’ అడిగాడు మళ్ళీ.‘‘భగవంతుని దయవలన అనారోగ్యమేమీ లేదురా... నీ స్పీడు అందుకోలేకపోయినా నెమ్మదిగా నడవగల ఓపిక వుంది. అందరూ కులాసాయే కదా’’ అడిగింది గౌతమి. యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఆటోస్టాండ్ చేరారిద్దరూ.గౌతమిని సాదరంగా ఆహ్వానించింది సునీత, రామం భార్య.‘‘ఈరోజు విశ్రాంతి తీసుకో. రేపు తెల్లవారు జామునే గోదావరి స్నానానికి వెడదాం.’’ అన్నాడు రామం.‘‘ఈ గోదావరి పుష్కరాలు మహా పుష్కరాలుట. నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి ఇలాంటి మహత్తర పుష్కరాలొస్తాయట. మన జీవితకాలంలో రావడం మన అదృష్టం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పుష్కరస్నానం చేయాలని నా కోరిక’’ సునీత తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ చెప్పింది గౌతమి.‘‘అలాగే అత్తయ్యా... నేను తీసుకువెళ్ళి స్నానం చేయిస్తాగా. నాలుగురోజులు మా ఇంట్లో ఉంచమని చెపితే వినకుండా శ్రీహర్ష రేపు రాత్రికే రిజర్వేషన్ చేయించేశారు. నాలుగు రోజులు మా ఇంట్లో ఉండొచ్చు కదా...’’ అడిగాడు రామం.‘‘శ్రీహర్ష నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అతికష్టం మీద వాడిని ఒప్పించి బయలుదేరాను’’ అంటూ స్నానానికి లేచింది గౌతమి.
తెల్లవారుజామునే పుష్కరఘాట్ చేరుకున్నారు రామం, గౌతమి. గౌతమి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు రామం. గేటు మూసివుంది. ఘాట్‌లోకి ఎవరినీ వెళ్ళనీయడంలేదు. ముఖ్యమంత్రిగారి స్నానం, పూజలు అయ్యాక యాత్రికుల్ని పంపుతారని చెప్పుకుంటున్నారు.అక్కడున్న చిన్నగుంపు మధ్య నిలబడ్డారు రామం, గౌతమి. జనం నెమ్మదిగా చేరుతున్నారు. రెండు గంటల సమయం గడిచింది. జనం పోటెత్తారు. ముందుకీ వెనక్కీ కదలలేని పరిస్థితి. గౌతమికి అంతసేపు నిలబడ్డం వల్ల ప్రయాసగా ఉంది. రామం వెనక్కు వెళ్ళిపోదామన్నాడు. వెనక్కి తిరిగిచూస్తే వెళ్ళడం చాలా కష్టమనిపించి ఆగారు. ఇంతలో గేట్లు తెరుస్తున్నారని అరిచారు. అంతే. ఒక్కసారి తోపులాట మొదలైంది. ఎవరో వెనక్కు నెట్టారు. తోపులాటలో రామం, గౌతమి విడిపోయారు. వెనుకనుండి ముందుకు, ముందునుంచి వెనుకకు నెట్టబడిబ్యాలెన్స్ తప్పి కూలబడింది గౌతమి. ఎనభైనాలుగేళ్ళ వృద్ధురాలికి కళ్ళు తిరిగినట్లయి ఆయాసం మొదలైంది. పక్కవారిని గమనించే స్థితిలో ఎవరూ లేరు. ఉరుకులు... పరుగులు... గౌతమి మీద ఎవరిదో కాలు పడింది.‘అమ్మా’ అన్న ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది.గౌతమి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. వేదంలా ఘోషిస్తూ గోదావరి గంభీరంగా ప్రవహిస్తోంది.