లెక్కల సార్ లేపగానే వెక్కివెక్కి ఏడ్చా
క్లాసులో ఎప్పుడూ ఫస్టే.. లెక్కల్లో నన్ను కొట్టేవాడే లేడు
* తొంగర్లంటే చాలా భయం..
* నా బాల్యం హాయిగా గడిచింది
* నాన్న మాటలే నాకు స్ఫూర్తి
* బాలల దినోత్సవం సందర్భంగా కలెక్టర్
* టి.చిరంజీవులు బాల్యస్మృతులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కలెక్టర్.. పాలనాపరంగా జిల్లాకు వెన్నెముక... జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు నడిపించాల్సిన రథసారథి... కలెక్టర్ స్థాయికి రావడమంటే చిన్నవిషయమేమీ కాదు.. ఎంతో శ్రమించాలి. చిన్ననాటినుంచే భవిష్యత్ లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ లక్ష్య సాధనకు ఎన్ని ఆటంకాలెదురైనా వెనుకడుగు వేయొద్దు... ఇలా అన్ని కష్టాలను ఎదుర్కొంటూ సామాన్య కుటుంబం నుంచి అసమాన్యుడిగా, కలెక్టర్‌గా ఎదిగిన టి.చిరంజీవులు బాల్యం ఎలా గడిచింది.. ఆయన చదువు ఎలా సాగింది..
ఆయన బాల్యంలో మధురస్మృతులు, మరిచిపోలేని ఘటనలు ఏమైనా ఉన్నాయా..? ఆయనకు మొట్టికాయలంటే భయమా... లెక్కల సార్ లేపగానే ఎందుకు భోరున ఏడ్చేశారు? పాఠశాలలో బ్యాగు పెట్టి వెళ్లిపోయి ఆయన ఏం చేసేవారు? ఆయన బడికి వెళ్లేటప్పుడు ప్రతిరోజూ పుస్తకాలు ఎందుకు తడిచేవి? ఆయనకు ప్రాణస్నేహితులెవరైనా ఉన్నారా..? ఇప్పుడు వారేం చేస్తున్నారు?... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ బాలల దినోత్సవ ప్రత్యేకం... చిన్నారులందరికీ స్ఫూర్తిదాయకమైన ఆయన బాల్యం గురించి కలెక్టర్ చిరంజీవులు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే...!
‘నా బాల్యమంతా చాలా సరదాగా గడిచింది. మరీ ముఖ్యంగా ఏడోతరగతి వరకు చాలాహాయిగా, హుషారుగా అయిపోయింది. నేను చదివింది మా ఊర్లోనే. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతె ప్రాథమికోన్నత పాఠశాలలో చదివాను. చిన్నప్పుడు గోటీలాట, కర్రాబిళ్ల ఆడేవాళ్లం. మేం చదువుకున్నప్పుడు ఎన్‌సీసీలు, ఎన్‌ఎస్‌ఎస్‌లాంటివి లేవు. అప్పట్లోనే ఫుట్‌బాల్ కూడా ఆడుకునే వాళ్లం. స్కూల్ దగ్గరలోనే చెరువుండేది.
మా ఊరికి రెండు పక్కలా వాగులే. వర్షం వచ్చిందంటే ఊర్లోకి రాకపోకల్లేవు. అందుకే మా పాఠశాలకు టీచర్లు సరిగా వచ్చేవాళ్లు కాదు. టీచర్లు రాలేదా.. అంతే సంగతులు.. స్కూల్లో బ్యాగులు పెట్టడం... చెరువుకు ఈతకు వెళ్లడమే. మళ్లీ మధ్యాహ్నం ఉప్మా తినేందుకు స్కూలుకు వచ్చి మళ్లీ ఈతకే. అదో మధురమైన అనుభూతి. ఏడో తరగతి తర్వాత వేల్పులలోని హైస్కూల్‌కు వెళ్లాను. అదే నా జీవితంలో టర్నింగ్‌పాయింట్. అక్కడే జీవితమంటే ఏంటో తెలిసింది.
రోజూ 3.5 కిలోమీటర్లు నడకే..
వేల్పుల హైస్కూల్ చాలా క్రమశిక్షణగా ఉండేది. ఏడోతరగతి వరకు సరదాగా చదువుకున్న నేను ఎనిమిది నుంచి జీవితం అంటే ఏంటో నేర్చుకున్నాను. మా ఊరి నుంచి వేల్పుల 3.5కిలోమీటర్లు. ప్రతిరోజూ స్కూల్‌కు అందరు పిల్లలతో కలిసి నడిచి వెళ్లి వచ్చేవాడిని. మా రెండు ఊర్ల మధ్యలో వాగు ఉండేది. వాగు ఉంటే నాకేంటి.. ఈత ఫుల్లు కదా... రోజూ హాయిగా ఈతకొడుతూ వెళ్లేవాడిని. పుస్తకాలు తడిచిపోయేవి.
ఒక్కోసారి వాగులో కొట్టుకుపోయేవాడిని. అయినా ఈత వచ్చు కాబట్టి ఎక్కడో దగ్గర ఒడ్డుకు చేరేవాడిని. స్కూల్లో చాలా క్రమశిక్షణ ఉండేది. నా మనస్సు చదువులపైకి మళ్లేందుకు వేల్పుల హైస్కూలే వేదిక అయింది. ఎనిమిదో తరగతి నుంచి సిన్సియర్‌గా చదివా. క్లాసులో ఎప్పుడూ నేనే ఫస్ట్ ర్యాంకర్‌ని... నో బడీ కుడ్ బీట్ మీ.
నాన్నే స్ఫూర్తి..
మొదటినుంచీ నాన్న నాకు అందుబాటులో ఉండేవారు కాదు. ఆయన ముంబైలో ఉండేవారు. అప్పుడప్పుడూ వచ్చినప్పుడు మాత్రం నన్ను గైడ్ చేస్తుండే వారు. ‘పుట్టినోళ్లు మామూలుగా చావొద్దు. ఏదో ఒకటి సాధించాలి. మామూలు మనిషిగా అస్సలు ఉండొద్దు. ఇంజినీరో, డాక్టరో, నాయకుడివో, కలెక్టరో కావాలి...’ అని ఆయన చెప్పిన మాటలే నాలో స్ఫూర్తిని రగిలించాయి.
నా రూటే సెపరేటు..
ఎనిమిదో తరగతిలో మ్యాథ్స్ సబ్జెక్టులో రెండు విభాగాలుండేవి. 1. కంపోజిట్ మ్యాథ్స్, 2. జనరల్ మ్యాథ్స్. మా పాఠశాలలో అందరూ జనరల్ మ్యాథ్స్ తీసుకుంటే నేనొక్కడినే కంపోజిట్ తీసుకున్నాను. కంపోజిటే చదవాలని నా కోరిక. అప్పుడు రఘునాథరావు అనే లెక్కల సార్ ఉండేవాడు. ఆయన పిల్లలను బాగా మొట్టికాయలు (తొంగర్లు) వేసేవాడు. ఆయన తొంగర్లు వేశాడంటే నెత్తి బూరలా పొంగేది. సగంమంది ఆయన భయానికే బడి మానేశారు.
నేను మొదటి రోజు స్కూల్‌కి వెళ్లాను. అంతకుముందే తొంగర్ల గురించి నాకు తెలుసు. క్లాస్‌లోకి సార్ రాగానే నన్ను లేపాడు. ఇంకేముంది... వెంటనే భోరున ఏడ్చేశా. ఎందుకు ఏడుస్తున్నావని సార్ అడిగారు... మీరు తొం గర్లు పొడుస్తానంటే వెళ్లిపోతాను సార్.. అని చెప్పి వెక్కివెక్కి ఏడ్చాను. అప్పుడు ఆయన నన్ను సముదాయించి చదువుకుంటే నేనెందుకు పొడుస్తానురా అని కూర్చోబెట్టారు. ఖతం... అప్పటి నుంచి ఒక్కసారి కూడా సార్‌తో తొంగర్లు తినలేదు.
మ్యాథ్స్‌లో నన్ను మించినోడు లేడు..
కంపోజిట్ మ్యాథ్స్ అయినా నేనే టాప్. లెక్కల్లో నన్ను మించినోడు లేడు. ఆ సెంటర్‌లోనే ఫస్ట్ ర్యాంక్ నాది. అంటే 10-15 పాఠశాలల్లో కూడా నేనే ఫస్ట్. ఒకసారి గంగారాం అనే మా ప్రధానోపాధ్యాయుడు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆయన వెళ్లిపోతున్నారనిఒక్కోవిద్యార్థి 50పైసల చొప్పు న 50మందిమి 25 రూపాయలు వసూలు చేసి ఆయనకు గిఫ్ట్ ఇచ్చాం. అప్పుడు ఆయన ఆ 25 రూపాయలు మాకు తిరిగిచ్చేశారు. అయితే, మ్యాథ్స్‌లో ఫస్ట్ వచ్చిన వారికి 15, సెకండ్ వచ్చినవారికి 10 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంకేముంది.. 50పైసలిచ్చా... మ్యాథ్స్‌లో ఫస్ట్ వచ్చి 15 రూపాయలు సంపాదించా.
ఐ యామ్ ఏ షై స్టూడెంట్..
స్కూల్లో నేను చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవాడిని. నన్ను షై స్టూడెంట్ అనేవారు. ఎవరితో కలిసేవాడిని కాదు. చదువు మీదనే ఎక్కువ దృష్టి పెట్టేవాడిని. నా బాల్యమిత్రుల్లో చాలా మంది టీచర్లయ్యారు. కలెక్టర్ అయింది నేనొక్కడినే... నా బాల్యమిత్రుల్లో నాకు దగ్గరగా ముగ్గురు మిత్రులుండేవారు. వారిలో ఒకరు ప్రస్తుత వరంగల్ ఏఎస్పీ జాన్‌వెస్లీ. మేమిద్దరం బెంచ్‌మేట్స్ కూడా.
మరో ఫ్రెండ్ గంగాధర్.. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కెమికల్ ల్యాబ్‌లో పనిచేస్తున్నారు. ఇంకో మిత్రుడు భూమేశ్. అతను టీచర్. ఇప్పటికీ బాల్యమిత్రులు, మాఊరివాళ్లు కలుస్తూనే ఉంటారు. అప్పటి నుంచీ ఊర్లో రెండు గదుల ఇల్లే ఉంది. అమ్మ అక్కడ ఉంటుంది. ఊరికి వెళ్లినప్పుడల్లా బాల్యం గుర్తుకు వస్తుంది.