చిద్రమౌతున్న బాల్యానికి బంగారు భరోసా  | Special Story About Child Labour For Childrens Day In Nalgonda | Sakshi
Sakshi News home page

చిద్రమౌతున్న బాల్యానికి బంగారు భరోసా 

Published Sun, Nov 10 2019 10:08 AM | Last Updated on Sun, Nov 10 2019 10:08 AM

Special Story About Child Labour For Childrens Day In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలోని బాలల పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్‌ ముస్కాన్, స్మైల్‌ పేరున ఆరు మాసాలకోసారి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బాలకార్మికులను గుర్తిస్తుంది. అయినా ఎక్కడో ఒక చోట బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సులో ఖార్ఖానాల్లో, ఇటుకబట్లీల్లో, ఇతర ప్రైవేట్‌ వ్యాపార సంస్థల్లో మగ్గిపోతున్నారు.

బాలల పరిరక్షణ కోసం బాలల న్యాయ చట్టం, ఉచిత నిర్బంధ విద్యా హక్కు, ఇలా ఎన్నో చట్టాలను చేసింది. ఆడపిల్లలపై అకృత్యాలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలను ఎదిరించడం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు ఈ నెల 7న ప్రారంభం కాగా.. 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి.  బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. 

ఎన్నో ప్రత్యేక చట్టాలు.. 
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలోని బాలల పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్‌ ముస్కాన్, స్మైల్‌ పేరున ఆరు మాసాలకోసారి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బాలకార్మికులను గుర్తిస్తుంది. అయినా ఎక్కడో ఒక చోట బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సులో బాలకార్మికులుగా ఉంటూ తమ జీవితాన్ని కోల్పోతున్నారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ విభాగం ఏర్పాటు చేసింది. బాల్య వివాహాలతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తుంది. అయితే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం 2016లో ప్రత్యేక చట్టాన్ని చేసింది. అదే విధంగా 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టం, 2015లో బాలల న్యాయ చట్టం, 2009లో ఉచిత నిర్బంధ హక్కు చట్టాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

1098 టోల్‌ ఫ్రీ నంబర్‌..
చిన్నపిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారి సమాచారాన్ని అందించేందుకు 1098కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. బాల కార్మికులతో పాటు అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడినా ఈ నంబర్‌కు సమచారం అందిస్తే వెంటనే వారు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. 

ఆరు మాసాలకోసారి బాలకార్మికుల గుర్తింపు.. 
ఆరు మాసాలకోసారి బాలకార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ల పేర పోలీస్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఏ ఆధారం లేనివారికి ఆ వయస్సును బట్టి సంబంధిత పాఠశాలల్లో చేర్పించి వారి సంరక్షణ బాధ్యతను చూసుకుంటారు. 

బాలకార్మికులు ఇలా.. 
జిల్లాలో బాల కార్మికులను 2018–19 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. కట్టంగూర్‌ మండలంలో అత్యధికంగా 79 మందిని గుర్తించగా.. చింతపల్లి, కనగల్, నాంపల్లి, తిప్పర్తి మండలాల్లో ఇద్దరు చొప్పున గుర్తించారు. నకిరేకల్‌ 62, మిర్యాలగూడ 59, మాడుగులపల్లి 58, నల్లగొండ 53, త్రిపురారం 23, కేతెపల్లి 16, తిరుమలగిరి సాగర్‌ 16, వేములపల్లి 12, గుర్రంపోడు 11, దేవరకొండ 10, నేరేడుగొమ్ము 9, మునుగోడు, పెద్దవూరలో 8మంది చొప్పున, అనుమల, శాలిగౌరారంలో ఏడుగురు చొప్పున, చండూరులో ఆరుగురు, చందంపేట, గుండ్రపల్లిలో ఐదుగురు చొప్పున, అడవిదేవులపల్లి, చిట్యాల, దామరచర్ల మండలాల్లో నలుగురు చొప్పున బాలకార్మికులను గుర్తించారు. 

అక్రమ రవాణా నిరోధక చట్టం..
అక్రమ రవాణా నిరోధానికి 1956లో ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో అక్రమ రవాణా బాధితులు ఎవరంటే ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా లైంగిక వ్యాపారాలకు తరలించబడిన వారు. బలవంతపు వెట్టి చాకిరీలో ఉన్నవారు, ఏ ఉద్దేశంతో అయినా సరే అమ్మివేయబడిన వారు, మంచి జీవనోపాధి ఇస్తామన్న మాటలు నమ్మి తెలియని ప్రాంతానికి తరలించబడినవారు. 

అక్రమ రవాణా బాధితులను కాపాడుతున్న సందర్భాల్లో...
ప్రత్యేక పోలీస్‌ అధికారి లేదా అక్రమ రవాణానిరోధక ఆఫీసర్‌ అక్రమ రవాణా జరగబోతున్నా, జరిగిన సందర్భాలను తెలుసుకోవడాకి వారెంట్‌ లేకుండా పరిశోధించవచ్చు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇద్దరు గౌరవపరమైన వ్యక్తుల నుంచి సమర్థత తీసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళ అయి ఉండాలి. అక్కడ కనిపించిన పిల్లలందరినీ బయటికి తీసుకురావాలి. అక్రమ రవాణా నుంచి కాపాడిన తర్వాత.. వయస్సు నిర్ధారణ, గాయాలను గుర్తించడం కోసం వైద్యం కోసం తరలించాలి.

న్యాయమూర్తి ముందు హాజరుపర్చాలి. మహిళా పోలీస్, సామాజిక కార్యకర్త చేత బాధితురాలిపై విచారణ జరిపించాలి. పూర్తి శ్రద్ధ, సంరక్షణ బాధితురాలికి కల్పించాలి. పిల్లలయితే సీడబ్ల్యూసీని ప్రవేశపెట్టాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, ఎస్పీ, డీఈఓ, డీఎంహెచ్‌ఓ, పీడీ డీఆర్‌డీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉమెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఒకరిని, స్వచ్ఛంద సంస్థ నుంచి ఒకరిని సభ్యులుగా తీసుకుంటారు. ఐసీడీఎస్‌ పీడీ కన్వీనర్‌గా ఈ కమిటీకి ఉంటారు. 

బేటీ బచావో, బేటీ పడావో ప్రయోజనాలు..
2015 జనవరి 22న కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అమ్మాయిలు ఉన్నత విద్యను పొందడానికి అవకాశం ఉంటుంది. తమకంటూ సొంత గుర్తింపును సృష్టించుకోవచ్చు.

ఈ పథకం వల్ల కలిగే పలు ప్రయోజనాలు..

  • బాలికల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. 
  • ఈ పథకం కింద బాలికలు ఉన్నత విద్యను పొందుతారు. 
  • బాలికల వివాహాం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. 
  • అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వివక్షత తగ్గనుంది. 
  • ఈ పథకం కింద బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయబడిన మొత్తం ఆదాయ పన్ను నిబంధన 80–సీ కింద మినహాయింపు ఉంటుంది. 
  • ఈ పథకానికి అర్హులైన వారు సుకన్యయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఇలా..
బేటీ బచావో బేటీ పడావో పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వయో పరిమితి 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది. 10 సంవత్సరాల వయస్సు గల ఏ అమ్మాయి అయినా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న బా లికలు కూడా ఈ పథకానికి అర్హులు.  ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి బాలల జనన ధ్రువీకరణ, చిరునామా, గుర్తింపు కార్డును జత చేయాల్సి ఉంటుం ది. దరఖాస్తులను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అందించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement