గొత్తికోయగూడెంలో మేకలను కాస్తున్న మడకం అనిత
సాక్షి, వరంగల్: చాలా మంది పిల్లలకి బాలల దినోత్సవం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ రోజే పాఠశాలల్లో ఆటలు, పాటలతో పాటు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. వీటన్నింటితో బడికి వెళ్లే పిల్లలు సంతోషంగా ఉంటారు. మరీ కుంటుంబ కష్లాల వల్లా చాలా మంది పిల్లలు వారి బాల్యాన్ని బలిచేసుకుంటున్నారు. వీరికి బాలల దినోత్సవం అంటూ ఒకటి ఉంటుందని బహుశ తెలియకపోవచ్చు. తెలిసిన బడికి పోవాల్సింది కానీ.. పనికీ వెళ్తున్నాం అని అనుకుంటూ వారి జీవితాలని సాగిస్తున్నారు.
కనీసం మనమైనా ఇటువంటి పిల్లలని గుర్తించి వారి బాల్యాన్ని బలి కాకుండా కాపాడగలమా ? పలక పట్టాల్సిన చేతులు పలుగు పట్టుకొని పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా సంరక్షించే శాఖలు సేవలు చేస్తున్నా బాలలు కార్మికులుగా మారే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఈ ఫొటోలో ఉన్న బాలుడి పేరు మడకం జోగయ్య, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన గొత్తికోయ ప్రాంతానికి చెందినవాడు. తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యవసాయ రైతు వద్దకు మిర్చి పంట వద్ద మకాం ఉంటారు. వీరితోపాటు ఈ బాలుడు వచ్చి తోట పనుల్లో నిమగ్నమవుతాడు. తోటకు తడికట్టడం, మందు చల్లడం, కూలీలకు నీళ్లు తీసుకురావడం వంటి పనులు చేస్తుంటాడు. చదువుకునేందుకు స్థోమత లేక తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ పనులు చేస్తున్నాడు. బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని తెలిసినా ఆ కుటుంబ పేదరిక పరిస్థితికి ఈ బాలుడితో పనిచేయించక తప్పడం లేదని ఆ రైతు వాపోయాడు. ఇలాంటి బాలలు ఎంతో మంది మన ఏజెన్సీ ప్రాంతం, రాష్ట్రం, దేశంలో కనిపించడం పరిపాటిగా మారింది.
ఏజెన్సీలో మారని తీరు..
ఏటూరునాగారం: ఏజెన్సీలో బాలురతో పనిచేయించడం, బాల్య వివాహాలు జరిగినా సంబంధిత మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అక్కడ పనిచేసే సిబ్బందికి అన్ని తెలిసినా కూడా బాల్య వివాహాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వివాహాలు చేసేవారు, వి వాహాలు చేసుకునే బాలికలు అక్కడుండే సిబ్బంది తెలిసినవారు కావడంతో వారి వివాహాన్ని అడ్డుకునే పరిస్థితులు లేకుండా పోయాయి.
చట్టాలపై అవగాహన, రక్షణ కల్పించేవారు లేక బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బడీడు పిల్లలు బడిలో చేరి డ్రాపౌట్లుగా మారడం, పశువుల కాపరిలా మారడం వంటి చర్యలు ఏజెన్సీలో అనునిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ చట్టాల పటిష్టతోపాటు బాలలకు కావాల్సిన సౌకర్యాల కల్పనను మరింత బలోపేతం చేస్తేనే బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు అదుపులోనికి వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. భారత మొదటి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
రూపొందించిన∙చట్టాలు ఇవే..
జీవించే హక్క: ఇది ఆరోగ్య ప్రమాణానికి సరైన జీవన స్థితికి గల హక్కు. దీని ప్రకారం పిల్లలు, అనా రోగ్యం, ఇతర ప్రమాదాల వల్ల మరణించకుం డా ఆరోగ్యంగా జీవించే హక్కును సంపాదించుకున్నారు. ప్రతి బిడ్డకు ఆహారం ఆరోగ్యం, విద్య అందించి వారి పరిపూర్ణ, శారీరక, మానసిక, సామాజిక వికాసానికి పునాది వేయాలి.
రక్షణ హక్కు : అన్ని రకాల బాధలు, అవమానాల, దాడుల నుంచి పిల్లలకు విముక్తి, స్వేచ్ఛ కల్పించుట, అత్యవసర పరిస్థితులలో సంఘర్షణలు, సంభవిస్తే ప్రత్యేక రక్షణను కల్పించాలి. దోపిడీ నుంచి రక్షణను కల్పించి వారి అభివృద్ధికి తగిన జాగ్రత్త తీసుకోవడం, భారత రాజ్యంగ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలు, ఫ్యాక్టరీలలో గాని, గనులలోగాని, ఇతర వ్యాపార సముదాయాల్లో పనులు చేయించడం నేరం.
పిల్లల ఉన్నతికి, వికాసానికి హక్కు: పిల్లలు ఆలంబన, వికాసం, సంరక్షణ, సాంఘిక భద్రత హక్కులతోపాటు విశ్రాంతికి, వినోదానికి సాంస్కతిక కార్యకలాపాలకు సంబంధించిన హక్కులు కూడా ఉన్నాయి. బడికి వెళ్లని 5–14 సంవత్సరాల పిల్లలకు (పశువులను మేపుతూ, పొలం పనులు చేసేవారు) నిర్భంద ఉచిత విద్యను ఆదేశించడం జరిగింది.
భాగం పంచుకునే హక్కు: బాలల అభిప్రాయాలపై గౌరవం, భావ ప్రకటన, స్వేచ్ఛ, సరైన సమాచారం పొందే హక్కు. పిల్లలు వారి మనస్సులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కులు వారి భావాలకు తగిన విలువను ఇవ్వాలి. భావప్రకటనకు స్వేచ్ఛకు కలిగించాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం 1933లో బాలల చట్టం చేసి చిన్న పిల్లలను శ్రమ దోపిడీ నుంచి రక్షించడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పింది. 1938లో బాలల ఉద్యోగ కల్పన చట్టం ఏర్పాటు కాగా కఠిన శ్రమకు లోనయ్యే పనుల్లో వారిని వినియోగించరాదని సూచనలు చేసింది.
కర్మాగారాల్లో పిల్లలతో పనిచే యించరాదని 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించారు. బాలలను రక్షించడానికి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, చైల్డ్ ఫౌండేషన్ వారు ఉచిత టెలిఫోన్ నంబర్‌ను రూపొందించారు. 1098కు బడిలో గానీ, బడిబయట గానీ, పిల్లలను బడికి పంపకుండా వేరే పనులు చేయించినా, ఇతరులతో ఇబ్బందులు, వేదింపులకు లోనైతే వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ఇబ్బందులకు గురైన బాలలకు రక్షణ కల్పించడం జరుగుతుంది. అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.
బాలలను రక్షించేందుకు ప్రత్యేక దృష్టి
జిల్లాలో బాలలను రక్షించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం. చిన్నారులపై అఘాయిత్యాలు, బాలలను కార్మికులుగా పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే వెళ్లి వారి ని విముక్తి చేయడం జరుగుతుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 954 మంది బాలబాలికలను రక్షించాం. ఎలాంటి ఇబ్బంది ఉన్నా 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
– చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి, భూపాలపల్లి జిల్లా
బాలలతో పనిచేయించడం నేరం..
వయస్సు నిండని బాలలతో పనులు చేయిం చడం చట్ట రీత్యా నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం 5–14 వయస్సు కలిగిన పిల్లలు బడిలో ఉండాలి. బడిబయట ఉంటే వెంటనే వారిని బడిలో చేర్పించాలి. 18 ఏళ్ల వయస్సు నిండని యువతికి వివాహం జరిపిస్తే బాల్య వివాహం కిందకు వస్తుంది.
– ఓంకార్, బాలల సంరక్షణ అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment