T. Chiranjeevulu
-
హెచ్ఎండీఏలో మళ్లీ జోనల్ వ్యవస్థ
సేవల వికేంద్రీకరణకు కమిషనర్ నిర్ణయం త్వరలో జోనల్ కార్యాలయాల తరలింపు {పజల చేరువలోకి సేవలు జోనల్ అధికారులకు పూర్తి స్థాయి అధికారాలు సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థలో సేవలను వికేంద్రీకరించడం ద్వారా శివారు ప్రాంత ప్రజలకు మరింత చేరువవ్వాలని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు భావిస్తున్నారు. దీనికోసం గతంలో రద్దు చేసిన జోనల్ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు, రెవెన్యూ వసూలుకు జోనల్ వ్యవస్థ ఉపకరిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. అక్కడ కీలక బాధ్యతలను నిర్వర్తించేందుకు డిప్యూటీ కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-1) స్థాయి అధికారులను జోనల్ ఆఫీసర్లుగా నియమించేందుకు కమిషనర్ కృతనిశ్చయానికి వచ్చారు. త్వరలో బోర్డు మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చించి ప్రభుత్వ అనుమతితో జోనల్ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కసరత్తు ప్రారంభించారు. ‘జోనల్ వ్యవస్థను పరిపుష్ఠం చేయడం... అధికారాలను వికేంద్రీకరించడం... సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచడం’ అనేత్రిసూత్ర విధానంతో హెచ్ఎండీఏకు పూర్వ వైభవం తీసుకురావాలని కమిషనర్ యోచిస్తున్నారు. శివారు ప్రజలు ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లను సద్వినియోగం చేసుకునేలా... హెచ్ఎండీఏ సేవలు వారికి చేరువలోకి తీసుకెళ్లేందుకు జోనల్ వ్యవస్థ అవసరాన్ని సర్కార్ దృష్టికి తీసుకె ళ్లాలని భావిస్తున్నారు. దీనికి తగినంత మంది సిబ్బందిని డెప్యూటేషన్‌పై నియమించేలా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జోనల్ కార్యాలయంలోని సీపీఓలకు పూర్తి స్థాయి అధికారాలిచ్చి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించాలని భావిస్తున్నారు. చేరువలోకి సేవలు భూ వినియోగ మార్పిడి, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతుల వంటివి మినహా... ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ దర ఖాస్తుల పరిష్కారం, భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులన్నీ ఇక నుంచి జోనల్ కార్యాలయాల్లోనే మంజూరు చేయాలని కమిషనర్ చిరంజీవులు భావిస్తున్నారు. తార్నాక కేంద్ర కార్యాలయంలో ఉన్న జోనల్ ఆఫీసులను వీలైనంత త్వరగా శంకర్పల్లి, మేడ్చెల్, ఘట్కేసర్, శంషాబాద్ ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. కేంద్ర కార్యాలయంలో అపరిష్కృతంగా ఉన్న ఫైళ్లన్నింటినీ జోనల్ కార్యాలయాలకు తరలించి... వారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. కమిషనర్ నిర్ణయం డిసెంబర్ లేదా జనవరి నుంచి అమల్లోకి రానుంది. శివారు ప్రాంత ప్రజలు వివిధ అనుమతుల కోసం తార్నాకలోని కేంద్ర కార్యాలయానికి రావడం కష్టతరంగా ఉన్న విషయాన్ని గమనించిన కమిషనర్ జోనల్ కార్యాలయాల్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ప్రత్యేకంగా జోనల్ ప్లానింగ్ కమిటీలను ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు జోనల్ కార్యాలయాల్లో ఫైళ్లు క్లియర్ చేయాలని చూస్తున్నారు. 18 మీటర్ల ఎత్తుపైబడిన బహుళ అంతస్థుల భవనాల దరఖాస్తులు, సింగిల్ విండో కేసులు, భూ వినియోగ మార్పిడికి సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం పంపాల్సిన దరఖాస్తులు మాత్రం తార్నాకలోని ప్లానింగ్ విభాగంలో సమర్పించాల్సి ఉంటుంది. ప్రత్యేక నిఘా ‘సుదూరం నుంచి నగరానికి వస్తున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జోనల్ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించాను. ప్రజలకు క్షేత్ర స్థాయిలోనే సేవలు అందించాలన్నది మా లక్ష్యం. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండాలి. ఎవరు అక్రమాలకు పాల్పడినా... వెంటనే తెలిసేలా ప్రజలతో మమేకమవుతూ ఆధునిక వ్యవస్థను ప్రవేశపెడుతున్నాం. ఈ నెలాఖరు నుంచి హెచ్ఎండీఏలో ‘ఆన్లైన్ అప్రూవల్స్’ను ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ దరఖాస్తులను కూడా ఆన్లైన్లో స్వీకరిస్తున్నాం. హెచ్ఎండీఏ జోనల్ కార్యాలయాలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కేంద్ర కార్యాలయం నుంచి నిత్యం పరిశీలిస్తాం. జోనల్ అధికారులకు పూర్తి స్థాయి అధికారలిస్తాం. నిర్దేశిత గడువులోగా పరిష్కారం కాకపోతే వారినే బాధ్యులను చేస్తాం. దీనివల్ల ప్రజలకు సత్వరం సేవలు అందడంతో పాటు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం జోనల్ కార్యాలయాలన్నీ తార్నాకలో ఉండటం వల్ల ఎవరు ఏపని చేస్తున్నారన్నది తెలియడం లేదు. సిబ్బందిలో జవాబుదారీతనం లేదు. పట్టుమని పది నిముషాలు కూడా సీట్లలో కూర్చోలేకపోతున్నారని తెలిసింది. ఇకపై అలాంటి వారి ఆటలు సాగవు. విధులు పక్కాగా నిర్వహించి ప్రజలకు సేవలు అందించాల్సిందే. - టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్ -
లెక్కల సార్ లేపగానే వెక్కివెక్కి ఏడ్చా
క్లాసులో ఎప్పుడూ ఫస్టే.. లెక్కల్లో నన్ను కొట్టేవాడే లేడు * తొంగర్లంటే చాలా భయం.. * నా బాల్యం హాయిగా గడిచింది * నాన్న మాటలే నాకు స్ఫూర్తి * బాలల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ * టి.చిరంజీవులు బాల్యస్మృతులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కలెక్టర్.. పాలనాపరంగా జిల్లాకు వెన్నెముక... జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు నడిపించాల్సిన రథసారథి... కలెక్టర్ స్థాయికి రావడమంటే చిన్నవిషయమేమీ కాదు.. ఎంతో శ్రమించాలి. చిన్ననాటినుంచే భవిష్యత్ లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ లక్ష్య సాధనకు ఎన్ని ఆటంకాలెదురైనా వెనుకడుగు వేయొద్దు... ఇలా అన్ని కష్టాలను ఎదుర్కొంటూ సామాన్య కుటుంబం నుంచి అసమాన్యుడిగా, కలెక్టర్‌గా ఎదిగిన టి.చిరంజీవులు బాల్యం ఎలా గడిచింది.. ఆయన చదువు ఎలా సాగింది.. ఆయన బాల్యంలో మధురస్మృతులు, మరిచిపోలేని ఘటనలు ఏమైనా ఉన్నాయా..? ఆయనకు మొట్టికాయలంటే భయమా... లెక్కల సార్ లేపగానే ఎందుకు భోరున ఏడ్చేశారు? పాఠశాలలో బ్యాగు పెట్టి వెళ్లిపోయి ఆయన ఏం చేసేవారు? ఆయన బడికి వెళ్లేటప్పుడు ప్రతిరోజూ పుస్తకాలు ఎందుకు తడిచేవి? ఆయనకు ప్రాణస్నేహితులెవరైనా ఉన్నారా..? ఇప్పుడు వారేం చేస్తున్నారు?... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ బాలల దినోత్సవ ప్రత్యేకం... చిన్నారులందరికీ స్ఫూర్తిదాయకమైన ఆయన బాల్యం గురించి కలెక్టర్ చిరంజీవులు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే...! ‘నా బాల్యమంతా చాలా సరదాగా గడిచింది. మరీ ముఖ్యంగా ఏడోతరగతి వరకు చాలాహాయిగా, హుషారుగా అయిపోయింది. నేను చదివింది మా ఊర్లోనే. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతె ప్రాథమికోన్నత పాఠశాలలో చదివాను. చిన్నప్పుడు గోటీలాట, కర్రాబిళ్ల ఆడేవాళ్లం. మేం చదువుకున్నప్పుడు ఎన్‌సీసీలు, ఎన్ఎస్ఎస్లాంటివి లేవు. అప్పట్లోనే ఫుట్‌బాల్ కూడా ఆడుకునే వాళ్లం. స్కూల్ దగ్గరలోనే చెరువుండేది. మా ఊరికి రెండు పక్కలా వాగులే. వర్షం వచ్చిందంటే ఊర్లోకి రాకపోకల్లేవు. అందుకే మా పాఠశాలకు టీచర్లు సరిగా వచ్చేవాళ్లు కాదు. టీచర్లు రాలేదా.. అంతే సంగతులు.. స్కూల్లో బ్యాగులు పెట్టడం... చెరువుకు ఈతకు వెళ్లడమే. మళ్లీ మధ్యాహ్నం ఉప్మా తినేందుకు స్కూలుకు వచ్చి మళ్లీ ఈతకే. అదో మధురమైన అనుభూతి. ఏడో తరగతి తర్వాత వేల్పులలోని హైస్కూల్‌కు వెళ్లాను. అదే నా జీవితంలో టర్నింగ్‌పాయింట్. అక్కడే జీవితమంటే ఏంటో తెలిసింది. రోజూ 3.5 కిలోమీటర్లు నడకే.. వేల్పుల హైస్కూల్ చాలా క్రమశిక్షణగా ఉండేది. ఏడోతరగతి వరకు సరదాగా చదువుకున్న నేను ఎనిమిది నుంచి జీవితం అంటే ఏంటో నేర్చుకున్నాను. మా ఊరి నుంచి వేల్పుల 3.5కిలోమీటర్లు. ప్రతిరోజూ స్కూల్‌కు అందరు పిల్లలతో కలిసి నడిచి వెళ్లి వచ్చేవాడిని. మా రెండు ఊర్ల మధ్యలో వాగు ఉండేది. వాగు ఉంటే నాకేంటి.. ఈత ఫుల్లు కదా... రోజూ హాయిగా ఈతకొడుతూ వెళ్లేవాడిని. పుస్తకాలు తడిచిపోయేవి. ఒక్కోసారి వాగులో కొట్టుకుపోయేవాడిని. అయినా ఈత వచ్చు కాబట్టి ఎక్కడో దగ్గర ఒడ్డుకు చేరేవాడిని. స్కూల్లో చాలా క్రమశిక్షణ ఉండేది. నా మనస్సు చదువులపైకి మళ్లేందుకు వేల్పుల హైస్కూలే వేదిక అయింది. ఎనిమిదో తరగతి నుంచి సిన్సియర్‌గా చదివా. క్లాసులో ఎప్పుడూ నేనే ఫస్ట్ ర్యాంకర్‌ని... నో బడీ కుడ్ బీట్ మీ. నాన్నే స్ఫూర్తి.. మొదటినుంచీ నాన్న నాకు అందుబాటులో ఉండేవారు కాదు. ఆయన ముంబైలో ఉండేవారు. అప్పుడప్పుడూ వచ్చినప్పుడు మాత్రం నన్ను గైడ్ చేస్తుండే వారు. ‘పుట్టినోళ్లు మామూలుగా చావొద్దు. ఏదో ఒకటి సాధించాలి. మామూలు మనిషిగా అస్సలు ఉండొద్దు. ఇంజినీరో, డాక్టరో, నాయకుడివో, కలెక్టరో కావాలి...’ అని ఆయన చెప్పిన మాటలే నాలో స్ఫూర్తిని రగిలించాయి. నా రూటే సెపరేటు.. ఎనిమిదో తరగతిలో మ్యాథ్స్ సబ్జెక్టులో రెండు విభాగాలుండేవి. 1. కంపోజిట్ మ్యాథ్స్, 2. జనరల్ మ్యాథ్స్. మా పాఠశాలలో అందరూ జనరల్ మ్యాథ్స్ తీసుకుంటే నేనొక్కడినే కంపోజిట్ తీసుకున్నాను. కంపోజిటే చదవాలని నా కోరిక. అప్పుడు రఘునాథరావు అనే లెక్కల సార్ ఉండేవాడు. ఆయన పిల్లలను బాగా మొట్టికాయలు (తొంగర్లు) వేసేవాడు. ఆయన తొంగర్లు వేశాడంటే నెత్తి బూరలా పొంగేది. సగంమంది ఆయన భయానికే బడి మానేశారు. నేను మొదటి రోజు స్కూల్‌కి వెళ్లాను. అంతకుముందే తొంగర్ల గురించి నాకు తెలుసు. క్లాస్‌లోకి సార్ రాగానే నన్ను లేపాడు. ఇంకేముంది... వెంటనే భోరున ఏడ్చేశా. ఎందుకు ఏడుస్తున్నావని సార్ అడిగారు... మీరు తొం గర్లు పొడుస్తానంటే వెళ్లిపోతాను సార్.. అని చెప్పి వెక్కివెక్కి ఏడ్చాను. అప్పుడు ఆయన నన్ను సముదాయించి చదువుకుంటే నేనెందుకు పొడుస్తానురా అని కూర్చోబెట్టారు. ఖతం... అప్పటి నుంచి ఒక్కసారి కూడా సార్‌తో తొంగర్లు తినలేదు. మ్యాథ్స్‌లో నన్ను మించినోడు లేడు.. కంపోజిట్ మ్యాథ్స్ అయినా నేనే టాప్. లెక్కల్లో నన్ను మించినోడు లేడు. ఆ సెంటర్లోనే ఫస్ట్ ర్యాంక్ నాది. అంటే 10-15 పాఠశాలల్లో కూడా నేనే ఫస్ట్. ఒకసారి గంగారాం అనే మా ప్రధానోపాధ్యాయుడు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన వెళ్లిపోతున్నారనిఒక్కోవిద్యార్థి 50పైసల చొప్పు న 50మందిమి 25 రూపాయలు వసూలు చేసి ఆయనకు గిఫ్ట్ ఇచ్చాం. అప్పుడు ఆయన ఆ 25 రూపాయలు మాకు తిరిగిచ్చేశారు. అయితే, మ్యాథ్స్‌లో ఫస్ట్ వచ్చిన వారికి 15, సెకండ్ వచ్చినవారికి 10 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంకేముంది.. 50పైసలిచ్చా... మ్యాథ్స్‌లో ఫస్ట్ వచ్చి 15 రూపాయలు సంపాదించా. ఐ యామ్ ఏ షై స్టూడెంట్.. స్కూల్లో నేను చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని. నన్ను షై స్టూడెంట్ అనేవారు. ఎవరితో కలిసేవాడిని కాదు. చదువు మీదనే ఎక్కువ దృష్టి పెట్టేవాడిని. నా బాల్యమిత్రుల్లో చాలా మంది టీచర్లయ్యారు. కలెక్టర్ అయింది నేనొక్కడినే... నా బాల్యమిత్రుల్లో నాకు దగ్గరగా ముగ్గురు మిత్రులుండేవారు. వారిలో ఒకరు ప్రస్తుత వరంగల్ ఏఎస్పీ జాన్‌వెస్లీ. మేమిద్దరం బెంచ్‌మేట్స్ కూడా. మరో ఫ్రెండ్ గంగాధర్.. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కెమికల్ ల్యాబ్‌లో పనిచేస్తున్నారు. ఇంకో మిత్రుడు భూమేశ్. అతను టీచర్. ఇప్పటికీ బాల్యమిత్రులు, మాఊరివాళ్లు కలుస్తూనే ఉంటారు. అప్పటి నుంచీ ఊర్లో రెండు గదుల ఇల్లే ఉంది. అమ్మ అక్కడ ఉంటుంది. ఊరికి వెళ్లినప్పుడల్లా బాల్యం గుర్తుకు వస్తుంది. -
'నల్గొండ జిల్లాలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి'
నల్గొండ జిల్లాలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ చిరంజీవులు వెల్లడించారు. మంగళవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. 4.19 కోట్లు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. 6560 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్ఉల వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం 7 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగునున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్యలను నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు విలేకర్ల సమావేశంలో విశదీకరించారు. -
పురభేరి..
సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్న తరుణంలోనే ‘పుర’ పోరుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. దీంతో జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. చైర్మన్‌పీఠం కోసం ఆయా పార్టీల నేతలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించి ఏప్రిల్ రెండున ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ఇలా.... ఈ నెల 10 నుంచి నామినేషన్ల అభ్యర్థుల నుంచి స్వీకరిస్తారు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 15వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 18వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలల్లోపు నామినేషన్ల ఉప సంహరించుకునేందుకు గడువు. అదేరోజు సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 30వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏవైనా అవాంతరాల వల్ల ఎన్నికలు నిలిచిపోయిన చోట వచ్చేనెల ఒకటో తేదీన తిరిగి ఎన్నిక జరుగుతుంది. మరుసటి రోజు అంటే 2వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నెల 10వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటి స్తారు. మహిళా ఓటర్లే అధికం.... ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం 4,00,013 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం విశేషం. పురుష ఓటర్లు 1,99,554 ఉండగా... మహిళా ఓటర్లు 2,00,456 ఉన్నారు. మరో 3 ఓట్లు ఇతరులవి. మొత్తంగా 902 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు, దేవరకొండ నగర పంచాయతీలో అధికంగా అతివలే ఓటర్లుగా నమోదయ్యారు. సూర్యాపేటలో 946, కోదాడలో 261, దేవరకొండలో 728 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు జాబితా తెలుపుతోంది. మిగిలిన మున్సిపాలిటీల్లో పురుష ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఉండే అవకాశం మెరుగ్గా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఈసారి అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కలెక్టర్ టి. చిరంజీవులు ప్రత్యేక దృష్టి సారించి కళాశాలల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది విజయవంతం కావడంతో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరగనున్న పోలింగ్ కేంద్రాలు... నాలుగు లక్షల పైచిలుకు ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మొత్తం 358 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాలిటీలో 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్‌ను కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా మున్సిపాలిటీల్లో దూరం, ఇతర అవసరాల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచొచ్చు లేదా తగ్గించుకునే వెసులుబాటు ఉంది. అన్ని మున్సిపాలిటీలకు ఇదే నియమం వర్తిస్తుంది. ఈ విషయమై త్వరలో స్పష్టత రానుంది. ఈవీఎం ద్వారానే ఓటు.. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చే స్తోంది. అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటుహక్కును ఈవీఎంల ద్వారానే వినియోగించుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ పద్ధతి ఎన్నిక లేదు. ఈ మేరకు ఈవీఎంలను సిద్ధం చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి. చిరంజీవులు ఆదేశించారు. అలానే ఎన్నికల తీరును పరిశీలించేందుకు ప్రతి మున్సిపాలిటీలో మూడు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి బృందంలో తహసీల్దార్ స్థాయి అధికారి, పోలీసు, వీడియోగ్రాఫర్ ఉంటారు. -
సైకిల్.. సవారీ
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కనగల్, నిడమనూరు, హాలియా, పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాల గుండా 65 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. సాగర్ వరకు ఎస్పీ ప్రభాకర్‌రావు స్వయంగా సైకిల్ తొక్కారు. - సాక్షి, నల్లగొండ/న్యూస్‌లైన్, హాలియా సాక్షి, నల్లగొండ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న ఉద్దేశంతో ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. నాగార్జునసాగర్ వరకు సైకిల్ ర్యాలీ సాగింది. బడికి వెళ్లాల్సిన వయస్సులో చిన్నారులు వెట్టిచాకిరీ చేయడం సమాజానికి మంచిది కాదని ఎస్పీ అన్నారు. చట్టాలెన్ని వచ్చినా ప్రజల్లో చైతన్యం లేకపోవడం కారణంగానే చిన్నారులు కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భావిభారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించి దేశ ప్రగతిలో పాలు పంచుకునేలా చేయాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సీఐలు మనోహర్‌రెడ్డి, డి. లక్ష్మణ్, రవి పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే సైకిల్‌యాత్ర : ఎస్పీ హాలియా: బాలకార్మిక వ్యవస్థ నిర్మూల నపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే పోలీస్ శాఖ పక్షాన నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ వరకు సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపా రు. ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ప్రకారం చిన్నారులను పనికి పంపినా,పనిలో పెట్టుకున్నా చట్టరీత్యా నేరస్తులవుతారని హెచ్చరించారు. ముఖ్యంగా మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లో బడిఈడు పిల్లలను పత్తి,బత్తాయి తోటల్లో కూలీలుగా పంపుతున్నారని పేర్కొన్నారు. వారిలో చైతన్యం కలిగించేందుకే తమ వంతు కృషిగా బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించాలని కోరారు. సమావేశంలో మిర్యాలగూడెం డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, హాలియా, మిర్యాలగూడెం, హుజూన్నగర్ సీఐలు ఆనందరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బల్వంతయ్య తదితరులు ఉన్నారు.