సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్న తరుణంలోనే ‘పుర’ పోరుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది.
దీంతో జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. చైర్మన్‌పీఠం కోసం ఆయా పార్టీల నేతలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించి ఏప్రిల్ రెండున ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది.
షెడ్యూల్ ఇలా....
ఈ నెల 10 నుంచి నామినేషన్ల అభ్యర్థుల నుంచి స్వీకరిస్తారు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 15వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 18వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలల్లోపు నామినేషన్ల ఉప సంహరించుకునేందుకు గడువు. అదేరోజు సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 30వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏవైనా అవాంతరాల వల్ల ఎన్నికలు నిలిచిపోయిన చోట వచ్చేనెల ఒకటో తేదీన తిరిగి ఎన్నిక జరుగుతుంది. మరుసటి రోజు అంటే 2వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నెల 10వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటి స్తారు.
మహిళా ఓటర్లే అధికం....
ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం 4,00,013 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం విశేషం. పురుష ఓటర్లు 1,99,554 ఉండగా... మహిళా ఓటర్లు 2,00,456 ఉన్నారు. మరో 3 ఓట్లు ఇతరులవి. మొత్తంగా 902 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు, దేవరకొండ నగర పంచాయతీలో అధికంగా అతివలే ఓటర్లుగా నమోదయ్యారు. సూర్యాపేటలో 946, కోదాడలో 261, దేవరకొండలో 728 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు జాబితా తెలుపుతోంది. మిగిలిన మున్సిపాలిటీల్లో పురుష ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఉండే అవకాశం మెరుగ్గా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఈసారి అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కలెక్టర్ టి. చిరంజీవులు ప్రత్యేక దృష్టి సారించి కళాశాలల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది విజయవంతం కావడంతో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
పెరగనున్న పోలింగ్ కేంద్రాలు...
నాలుగు లక్షల పైచిలుకు ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మొత్తం 358 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాలిటీలో 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్‌ను కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా మున్సిపాలిటీల్లో దూరం, ఇతర అవసరాల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచొచ్చు లేదా తగ్గించుకునే వెసులుబాటు ఉంది. అన్ని మున్సిపాలిటీలకు ఇదే నియమం వర్తిస్తుంది. ఈ విషయమై త్వరలో స్పష్టత రానుంది.
ఈవీఎం ద్వారానే ఓటు..
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చే స్తోంది. అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటుహక్కును ఈవీఎంల ద్వారానే వినియోగించుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ పద్ధతి ఎన్నిక లేదు. ఈ మేరకు ఈవీఎంలను సిద్ధం చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి. చిరంజీవులు ఆదేశించారు. అలానే ఎన్నికల తీరును పరిశీలించేందుకు ప్రతి మున్సిపాలిటీలో మూడు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి బృందంలో తహసీల్దార్ స్థాయి అధికారి, పోలీసు, వీడియోగ్రాఫర్ ఉంటారు.