మోగనున్ననగారా
రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి పాలన కారణంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సంబంధిత ఫైల్‌పై సంతకం చేయడంతో ప్రభుత్వం శనివారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. అయితే ఈ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో లేవంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపింది. పూర్తిస్థాయి జాబితాను ఆదివారం సమర్పించే అవకాశం ఉంది. దీంతో సోమవారం నాడే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాత గవర్నర్ చేసిన తొలి సంతకం ఇదే కావడం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రిజర్వేషన్ల ప్రకటనతో ముగిసింది. ఆదివారం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లనుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలపై సోమవారం హైకోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారును సవాల్‌గా తీసుకుని పూర్తి చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ కావడంతో పురపాలక శాఖ అధికారులు తీసుకువచ్చిన ఫైలుపై రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సంతకం చేశారు. 158 మున్సిపాలిటీలకు, 19 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రం యూనిట్‌గా బీసీలకు 33.33%, ఎస్సీలకు 12.35%, ఎస్టీలకు 1.84% రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 162 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఉంటే.. మూడు మున్సిపాలిటీలు పాల్వంచ, మణుగూరు, మందమర్రి మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉండగా (వీటికి ఎన్నికలు జరగవు.. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదు), అనపర్తి నగర పంచాయతీపై కోర్టు స్టే ఉండడంతో.. ఈ నాలుగింటిని మినహాయించి 158 మున్సిపాలిటీల చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ప్రకటించారు. 19 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ల రిజర్వేషన్లు ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే మొదటి దశలో 146 మున్సిపాలిటీలకు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు కేసులు, పునర్విభజన జరగని కారణంగా 12 మున్సిపాలిటీలకు, 8 కార్పొరేషన్లకు ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. జీహెచ్‌ఎంసీ గడువు డిసెంబర్ వరకు ఉంది. 2010 సెప్టెంబర్ 29వ తేదీ నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఇవన్నీ ప్రత్యేకాధికారుల పాలనలోనే మగ్గుతున్నాయి. గతనెల 3వ తేదీన నాలుగు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై స్టే కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచినా ఫలితం లేకుండా పోరుుంది.
ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు
నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు. ఈ పది కార్పొరేషన్లలోని 513 డివిజన్లకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే 146 మున్సిపాలిటీల్లోని 3,990 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఖమ్మం, ఒంగోలు, కర్నూలు, తిరుపతి, గుంటూరు, వరంగల్, గ్రేటర్ విశాఖపట్నం, కాకినాడ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగడం లేదు.
మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల వారీగా చైర్‌పర్సన్ పోస్టుల రిజర్వేషన్ వివరాలు
ఎస్టీ మహిళ: మహబూబాబాద్, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా)
ఎస్టీ జనరల్: దేవరకొండ, అచ్చంపేట
ఎస్సీ మహిళ: సూళ్లూరుపేట, ఏలేశ్వరం, మధిర, గుత్తి, అద్దంకి, ముమ్మడివరం, ఆళ్లగడ్డ, తాడేపల్లి, తిరువూరు, నాయుడుపేట
ఎస్సీ జనరల్: లీజనగర్, మడకశిర, పరకాల, ఇబ్రహీంపట్నం, గూడూరు (కర్నూలు జిల్లా), హుస్నాబాద్, భూపాల్‌పల్లి, పెద్ద అంబర్‌పేట, కొల్లాపూర్, జమ్మికుంట
బీసీ మహిళ: అందోల్ - జోగిపేట, నెల్లిమర్ల, యలమంచిలి, ఇల్లెందు, ఇచ్ఛాపురం, బాపట్ల, నర్సీపట్నం, చేగుంట, జంగారెడ్డిగూడెం, పాలకొండ, పొన్నూరు, దుబ్బాక, చిలకలూరిపేట, సత్తుపల్లి, నారాయణ్‌పేట, ఆముదాలవలస, వెంకటగిరి, కదిరి, రాజాం, పుంగనూర్, వేములవాడ, బనగానపల్లి, కోదాడ, సిరిసిల్ల, ఎమ్మిగనూర్, నందికొట్కూర్
బీసీ జనరల్: నందిగామ, పుత్తూరు, హుజూర్‌నగర్, రాయదుర్గ్, కల్యాణ్‌దుర్గం, మదనపల్లి, నాగర్‌కర్నూల్, ఉయ్యూరు, పెద్దపల్లి, గజ్వేల్ - ప్రజ్ఞాపూర్, చీమకుర్తి, జడ్చర్ల, మైదుకూరు, గిద్దలూరు, పామిడి, గొల్లప్రోలు, పుట్టపర్తి, కనిగిరి, మేడ్చల్, ఎర్రగుంట్ల, షాద్‌నగర్, హుజూరాబాద్, కల్వకుర్తి, నర్సంపేట, ఆత్మకూరు (కర్నూలు జిల్లా), బద్వేల్, బడంగ్‌పేట్.
జనరల్ మహిళ: సాలూరు, కొత్తగూడెం, పలమనేరు, జమ్మలమడుగు, ఆర్మూర్, సూర్యాపేట, కామారెడ్డి, ఆదోని, మాచర్ల, నూజివీడు, డోన్, కాగజ్‌నగర్, గుంతకల్లు, జగిత్యాల, పులివెందుల, కావలి, రాజంపేట, తాడిపత్రి, పిడుగురాళ్ల, కందుకూరు, మెట్‌పల్లి, తాండూరు, నల్లగొండ, మిర్యాలగూడ, నంద్యాల, బెల్లంపల్లి, మార్కాపూర్, భైంసా, హిందూపురం, నగరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వినుకొండ, జహీరాబాద్, గద్వాల, మంచిర్యాల, ఆదిలాబాద్, భువనగిరి, రాయచోటి, సదాశివపేట, జనగామ
అన్ రిజర్వ్‌డ్: రేపల్లె, మెదక్, కొవ్వూరు, తుని, నిడదవోలు, శ్రీకాళహస్తి, పలాస-కాశీబుగ్గ, నర్సాపూర్, పెడన, విజయనగరం, గూడూరు (నెల్లూరు జిల్లా) , పెద్దాపురం, మచిలీపట్నం, మాదన్నపేట, తణుకు, చీరాల, భీమవరం, పాలకొల్లు, రామచంద్రాపురం, తెనాలి, సామర్లకోట, పిఠాపురం, తాడేపల్లిగూడెం, జగ్గయ్యపేట, శ్రీకాకుళం, మంగళగిరి, అమలాపురం, సిద్ధిపేట, బొబ్బిలి, పార్వతీపురం, వికారాబాద్, నిర్మల్, బోధన్, ప్రొద్దుటూరు, సత్తెనపల్లి, గుడివాడ, కోరుట్ల, నర్సరావుపేట, ధర్మవరం, వనపర్తి
సాధారణ ఎన్నికలతో
సంబంధం లేదు : భన్వర్‌లాల్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సాధారణ ఎన్నికలతో సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినంత మాత్రాన స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని ఏమీ లేదని అన్నారు. స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని తెలిపారు.