గ్రేటర్లో 5 కొత్త మున్సిపాలిటీలు
పురపాలికలుగా జల్‌పల్లి, జిల్లేలగూడ, మీర్‌పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో ఐదు కొత్త మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్, ఘట్‌కేసర్ మండలాల పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు విలీన ప్రక్రియ ద్వారా ఐదు కొత్త మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకున్నాయి. సరూర్‌నగర్ మండలంలోని జిల్లేలగూడ, మీర్‌పేట్ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా లభించింది. ఇదే మండల పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల విలీనంతో జల్‌పల్లి మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఘట్‌కేసర్ మండల పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి.
ఈ 11 గ్రామ పంచాయతీల హోదాను రద్దు (డీనోటిఫై) చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేయగా వాటి విలీనంతో ఐదు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆ వెంటనే మరో ఉత్తర్వు జారీ చేసింది. కొత్తపేట్, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలతోపాటు బాలాపూర్ గ్రామ పంచాయతీలోని సర్వే నం. 142, 253ల విలీనంతో జల్‌పల్లి మున్సిపాలిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బోడుప్పల్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. మీర్‌పేట్, జిల్లేలగూడ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి మున్సిపాలిటీ హోదా కల్పించింది. మేడిపల్లి, పర్వతపూర్ గ్రామ పంచాయతీల విలీనంతో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీగా అవతరించింది. మున్సిపల్ ఎన్నికల నిబంధనల మేరకు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన నాటి నుంచి రెండేళ్లలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతో కలిపి మొత్తం 68 నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉండగా తాజాగా ఐదు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఈ సంఖ్య 73కు పెరిగింది.