సాక్షి, హైదరాబాద్: నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రముఖుల భద్రతపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. ఈనెల 30న జరగనున్న మునిసిపల్ ఎన్నికల బందోబస్తు, సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేం దుకు ఆయన గురువారం కమిషనర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి మావోయిస్టుల ముప్పు పొంచి ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సిబ్బం దికి సూచించారు. ఎన్నికల ప్రచారంతో పాటు పర్యవేక్షణకు వచ్చే వీఐపీలకు పూర్తి స్థాయి భద్రత కల్పిం చాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులతో పాటు పార్టీల ప్రభావం ఉంటుందని, ఈ సందర్భంగా చోటుచేసుకునే అల్లర్లు, ఘర్షణల నిరోధంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచిం చారు.
ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో అసాంఘిక శక్తుల కదలికపై కన్నేసి ఉంచాలన్నారు. ఈ సందర్భం గా పలు జిల్లా ఎస్పీలు తమకు అదనంగా సిబ్బంది అవసరం ఉందనే విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మునిసిపల్ ఎన్నికల కోసం కేటాయిం చిన 28 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు శనివారం నుంచి ఆయా జిల్లాలకు వస్తాయని, అవసరాన్ని బట్టి మరింత ఫోర్స్ కేటాయిస్తామని డీజీపీ వారికి తెలి పారు. గత ఎన్నికల్లో నమోదైన కేసుల్ని కొలిక్కి తెచ్చి పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో వాటి తీరుతెన్నుల్ని బట్టి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు, నిఘా, గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు.