ఒకవైపు మున్సిపల్ ఎన్నికల హడావుడి. అధికారుల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలై ఉండగానే, మరోవైపు ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది.
ఎన్నికలకు తక్కువ గడువు ఉండడం, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యే అభ్యర్థులపైనే ఉండడంతో ఏకకాలంలో రెండు ఎన్నికలను సమన్వయం పరుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న పోలింగ్, ఏప్రిల్ 2న ఫలితాలు వెలువడతాయి. ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది.
దీంతో మార్చి, ఏప్రిల్, మే నెలలు పూర్తిగా రాజకీయ కోలాహలమే సాగనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం కోడ్‌ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. జిల్లాలో ఇప్పటికే 24,89,294మంది ఓటర్లు నమోదై ఉన్నారు.
వీరిలో 12,49,666 మంది పురుష ఓటర్లు, 12,39,562 మంది ఓటర్లున్నారు. అయితే, ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 9వ తేదీ దాకా ఓట్లు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. జిల్లాలోని 12 అసెంబ్లీ , 2 పా ర్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించి తమదే పై చేయిగా నిరూపించుకుంది. టీడీపీ మూడుచోట్ల, సీపీఎం, సీపీఐలు చేరోచోటా గెలిచాయి. అయితే, ఈ సారి జరిగే ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఎన్నికలు కావడంతో గెలవబోయేది తామేనన్న ధీమాతో తెలంగాణవాద పార్టీలున్నాయి. దీంతో ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలే జరగనున్నాయి. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీలన్నీ పోటీ పడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏయే రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో ఇంకా స్పష్టత లేకున్నా, ఒంటరిగా బరిలోకి దిగే పార్టీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తెలంగాణవాద ఓటుపైనే అందరి ఆశ
జిల్లాలో తొలిసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల ఫలితాలు రాబట్టి జెండా పాతేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇక, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలు పూర్తిగా తెలంగాణవాద ఓటుపైనే అశలు పెట్టుకున్నాయి. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజల్లో అయోమయం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ మా వల్లే వచ్చిందని నమ్మబలుకుతోంది. మొత్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.