జిల్లాలో ప్రక్రియ సోమవారం అధికారికంగా ప్రారంభం కానుంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలకు ఆయా మున్సిపల్ కమిషనర్లు (ఎన్నికల అధికారులు) ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇందుకోసం ముందురోజు ఆదివారం అయినప్పటికీ ఆయా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాంగోపాల్‌కు ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణకు మున్సిపాలిటీల్లో చేసిన ఏర్పాట్లపై నివేదిక ఇచ్చారు. నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, ఆయా వార్డుల ఓటర్ల జాబితా అందజేయనున్నారు.
నేటి నుంచి నామినేషన్ల పర్వం
చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు వార్డులకు, డివిజన్లకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల సిబ్బందితో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సమాచారం ఇచ్చేందుకు మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలలోపే ఎన్నికల అధికారి అయిన కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సంబంధించి ఓటర్ల ఫొటో జాబితాను నోటీస్‌బోర్డులో ప్రదర్శిస్తారు. మార్చి 14వ తేదీ వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 19న ఉపసంహరణ, 21న తుదిజాబితా ప్రకటిస్తారు.
50 డివిజన్లు, 169 వార్డులకు ఎన్నికలు
చిత్తూరు కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పుత్తూరు మున్సిపాలిటీలో 24, నగరిలో 27 , మదనపల్లెలో 35, శ్రీకాళహస్తిలో 35, పుంగనూరులో 24, పలమనేరులో 24 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. తమ అభ్యర్థులతో మొదటి రోజు నుంచే నామినేషన్లు వేయించి ప్రచారం ఉద్ధృతం చేయాలని భావిస్తున్నాయి. మొత్తం మీద సోమవారం నుంచి చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి కనబడనుంది.