హెచ్‌ఎండీఏలో మళ్లీ జోనల్ వ్యవస్థ
సేవల వికేంద్రీకరణకు కమిషనర్ నిర్ణయం
త్వరలో జోనల్ కార్యాలయాల తరలింపు
{పజల చేరువలోకి సేవలు
జోనల్ అధికారులకు పూర్తి స్థాయి అధికారాలు
సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థలో సేవలను వికేంద్రీకరించడం ద్వారా శివారు ప్రాంత ప్రజలకు మరింత చేరువవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు భావిస్తున్నారు. దీనికోసం గతంలో రద్దు చేసిన జోనల్ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు, రెవెన్యూ వసూలుకు జోనల్ వ్యవస్థ ఉపకరిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. అక్కడ కీలక బాధ్యతలను నిర్వర్తించేందుకు డిప్యూటీ కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-1) స్థాయి అధికారులను జోనల్ ఆఫీసర్లుగా నియమించేందుకు కమిషనర్ కృతనిశ్చయానికి వచ్చారు. త్వరలో బోర్డు మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చించి ప్రభుత్వ అనుమతితో జోనల్ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కసరత్తు ప్రారంభించారు. ‘జోనల్ వ్యవస్థను పరిపుష్ఠం చేయడం... అధికారాలను వికేంద్రీకరించడం... సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచడం’ అనేత్రిసూత్ర విధానంతో హెచ్‌ఎండీఏకు పూర్వ వైభవం తీసుకురావాలని కమిషనర్ యోచిస్తున్నారు. శివారు ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్‌లను సద్వినియోగం చేసుకునేలా... హెచ్‌ఎండీఏ సేవలు వారికి చేరువలోకి తీసుకెళ్లేందుకు జోనల్ వ్యవస్థ అవసరాన్ని సర్కార్ దృష్టికి తీసుకె ళ్లాలని భావిస్తున్నారు.
దీనికి తగినంత మంది సిబ్బందిని డెప్యూటేషన్‌పై నియమించేలా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జోనల్ కార్యాలయంలోని సీపీఓలకు పూర్తి స్థాయి అధికారాలిచ్చి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించాలని భావిస్తున్నారు.
చేరువలోకి సేవలు
భూ వినియోగ మార్పిడి, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతుల వంటివి మినహా... ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ దర ఖాస్తుల పరిష్కారం, భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులన్నీ ఇక నుంచి జోనల్ కార్యాలయాల్లోనే మంజూరు చేయాలని కమిషనర్ చిరంజీవులు భావిస్తున్నారు. తార్నాక కేంద్ర కార్యాలయంలో ఉన్న జోనల్ ఆఫీసులను వీలైనంత త్వరగా శంకర్‌పల్లి, మేడ్చెల్, ఘట్‌కేసర్, శంషాబాద్ ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. కేంద్ర కార్యాలయంలో అపరిష్కృతంగా ఉన్న ఫైళ్లన్నింటినీ జోనల్ కార్యాలయాలకు తరలించి... వారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. కమిషనర్ నిర్ణయం డిసెంబర్ లేదా జనవరి నుంచి అమల్లోకి రానుంది. శివారు ప్రాంత ప్రజలు వివిధ అనుమతుల కోసం తార్నాకలోని కేంద్ర కార్యాలయానికి రావడం కష్టతరంగా ఉన్న విషయాన్ని గమనించిన కమిషనర్ జోనల్ కార్యాలయాల్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ప్రత్యేకంగా జోనల్ ప్లానింగ్ కమిటీలను ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు జోనల్ కార్యాలయాల్లో ఫైళ్లు క్లియర్ చేయాలని చూస్తున్నారు. 18 మీటర్ల ఎత్తుపైబడిన బహుళ అంతస్థుల భవనాల దరఖాస్తులు, సింగిల్ విండో కేసులు, భూ వినియోగ మార్పిడికి సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం పంపాల్సిన దరఖాస్తులు మాత్రం తార్నాకలోని ప్లానింగ్ విభాగంలో సమర్పించాల్సి ఉంటుంది.
ప్రత్యేక నిఘా
‘సుదూరం నుంచి నగరానికి వస్తున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జోనల్ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించాను. ప్రజలకు క్షేత్ర స్థాయిలోనే సేవలు అందించాలన్నది మా లక్ష్యం. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండాలి. ఎవరు అక్రమాలకు పాల్పడినా... వెంటనే తెలిసేలా ప్రజలతో మమేకమవుతూ ఆధునిక వ్యవస్థను ప్రవేశపెడుతున్నాం. ఈ నెలాఖరు నుంచి హెచ్‌ఎండీఏలో ‘ఆన్‌లైన్ అప్రూవల్స్’ను ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నాం. హెచ్‌ఎండీఏ జోనల్ కార్యాలయాలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కేంద్ర కార్యాలయం నుంచి నిత్యం పరిశీలిస్తాం. జోనల్ అధికారులకు పూర్తి స్థాయి అధికారలిస్తాం. నిర్దేశిత గడువులోగా పరిష్కారం కాకపోతే వారినే బాధ్యులను చేస్తాం. దీనివల్ల ప్రజలకు సత్వరం సేవలు అందడంతో పాటు హెచ్‌ఎండీఏకు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం జోనల్ కార్యాలయాలన్నీ తార్నాకలో ఉండటం వల్ల ఎవరు ఏపని చేస్తున్నారన్నది తెలియడం లేదు. సిబ్బందిలో జవాబుదారీతనం లేదు. పట్టుమని పది నిముషాలు కూడా సీట్లలో కూర్చోలేకపోతున్నారని తెలిసింది. ఇకపై అలాంటి వారి ఆటలు సాగవు. విధులు పక్కాగా నిర్వహించి ప్రజలకు సేవలు అందించాల్సిందే.
- టి.చిరంజీవులు,
హెచ్‌ఎండీఏ కమిషనర్