Reconnaissance
-
నిధులొచ్చినా.. నిద్రలేవలే
మండలాల్లో అంతర్గతరోడ్లు మంజూరై ఏడు నెలలు ఇంకా టెండర్లు కూడా పూర్తికాని దుస్థితి జిల్లాలో గ్రామీణాభివృద్ధి కోసం రూ.28.69 కోట్లు కేటాయింపు నిధుల లేమితోనే జాప్యమంటున్న అధికారులు పరిగి: గ్రామీణ ప్రజలు రోడ్ల నిర్మాణం కోసం ఎదురుచూపు తప్పడంలేదు. ఆర్భాటంగా ఏడు నెలల క్రితం ఏప్రిల్‌లో మంజూరు చేసినప్రభుత్వం ఆ తర్వాత పనుల ఊసెత్తడం లేదు. 2015-16 సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కింద తెలంగాణ ప్రభుత్వం మండలాల్లో అంతర్గత రోడ్లు మంజూరు చేసింది. గ్రామానికి గ్రామానికి మధ్య ఉండే అంతర్గత రోడ్లకు గ్రావెలింగ్ పనులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన 33 మండలాల్లో మొత్తం రూ.28.69 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది. పంచాయతీరాజ్ అధికారులకు వాటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిధులతో జిల్లాలో 933రోడ్లు, 1269.91 కిలోమీటర్ల మేర గ్రావెలింగ్ పనులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రోడ్లు మంజూరు చేసి ఏడు నెలలు దాటినా ఇప్పటికీ టెండర్లు పిలవడం లేదు. అదేమంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయనందునే టెండర్లు పిలవడం లేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నియోజకవర్గాల వారీగా.. జిల్లాలో తొమ్మిది గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన 33 మండలాల్లో రోడ్లు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా చెవెళ్ల నియోజకవర్గానికి రూ.నాలుగు కోట్లు, ఇబ్రహీంపట్నానికి రూ.మూడు కోట్లు, మహేశ్వరం రూ.నాలుగు కోట్లు, మేడ్చల్‌కు రూ.3.69 కోట్లు, పరిగి నియోజకవర్గానికి రూ.మూడు కోట్లు, కుత్బుల్లాపూర్‌కు రూ.కోటి, రాజేంద్రనగర్‌కు రూ.కోటి, తాండూరుకు రూ.ఐదు కోట్లు, వికారాబాద్‌కు రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరు చేశారు. మొత్తం జిల్లాలోని రోడ్లకు రూ.28.69 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవహారం కోర్టుకు చేరినందునే? అయితే ఈ గ్రామీణ అంతర్గత రోడ్లు ప్రారంభం కాకపోవటానికి నిధుల లేమి అని అధికారులు పేర్కొంటుండగా కారణం వేరే ఉందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు అయిన ఈ రోడ్లకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లినందునే ప్రభుత్వం ఈ రోడ్ల ఊసెత్తడం లేదని పేర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల పొట్ట నింపడానికే ఈ రోడ్లను మంజూరు చేశారని, వీటిని నిలిపి వేయాలని పేర్కొంటూ కోర్టులో వ్యాజ్యం వేసినందునే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఈ రోడ్లు ప్రార ంభించేందుకు ప్రభుత్వం వెనకాడుతుందని ఓ అధికారి తెలిపారు. -
తుపాకీ నీడలో జిల్లా
సంచలన హత్యలు చేష్టలుడిగిన నిఘా భయాందోళనలో ప్రజలు బాంబులు విసరడం..వేట కొడవళ్లతో ప్రత్యర్థులను చంపడం పాత పద్ధతి. నిమిషాల వ్యవధిలో పక్కనున్న వారు తేరుకునేలోపే పరారయ్యే ‘షూటర్స్’ జిల్లాపై గురిపెట్టారు. ఆధిపత్యపోరు..ఆస్తి వివాదాలు..వ్యాపార లావాదేవీలు..కుటుంబ కలహాల్లో ప్రత్యర్థులను హతమార్చేందుకు షూటర్స్‌ను రప్పించడం ఇప్పడు పరిపాటిగా మారింది. విజయవాడ సిటీ : రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాపై షూటర్స్ ‘తుపాకీ’ గురిపెట్టారు. ఇక్కడున్న వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన షార్ప్ షూటర్స్‌ను రంగంలోకి దించుతున్నారు. కాల్చడంలో ఆరితేరిన యువకులను రప్పిస్తున్నట్టు ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు పరిశీలిస్తే వెల్లడవుతోంది. గురి తప్పదు... నాటు పద్ధతిలో హత్యలు ఇప్పుడు సాధ్యపడవు. కొద్దిపాటి పొరపాటు జరిగినా నిందితులు ఇట్టే పట్టుపడతారు. ఇదే షూటర్స్ అయితే గురి తప్పదు. పైగా వీరు పట్టుబడడం కూడా కష్టమే. జిల్లాలోని నందిగామ పట్టణంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొగ్గవరపు శ్రీశైల వాసును హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుడు పాషా కాల్చి చంపినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. కొద్ది రోజులుగా నందిగామలోనే ఉంటున్న పాషా అదను చూసుకుని వాసును 0.32 రివాల్వర్‌తో కాల్చి చంపాడు. గత నెల 24వ తేదీన ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన గంధం నాగ్వేరరావు,అతని కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యను కాల్చి చంపిన వారు ఢిల్లీకి చెందిన కిరాయి షూటర్లు. కొన్నేళ్ల కిందట పాతబస్తీలో వ్యాపారి కోటంరాజు లక్ష్మీనారాయణ అలియాస్ పంతులు కాల్చి వేతలో ఐఎస్ఐ ఉగ్రవాది అజంఘోరీ పాల్గొన్నాడు. నగరంలోని ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలపై కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన కేసుల్లోని నిందితులు కూడా కాల్పులు జరపడంలో సిద్ధహస్తులైన కిరాయి వ్యక్తులే కావడం విశేషం. కాగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తుపాకులు తక్కువ ధరకే దొరకడం నిందితులకు అవకాశంగా మారింది. వ్యకులతో నిమిత్తం లేకుండా రూ.15వేలు మొదలు రూ.25వేల వరకు ఇస్తే చాలు తుపాకులు, అవసరమైన తూటాలు ఇస్తారు. నిఘా నామమాత్రమే... జిల్లాలో నిఘా వ్యవస్థ నిద్రమత్తులో జోగుతుందనే ఆరోపణలకు ఈ ఘటనలే నిదర్శనం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ తరహా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కొంతమేర ప్రయత్నిస్తున్నా..జిల్లాలో మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు. శ్రీశైల వాసు హత్యలో పాల్గొన్న నిందితుడు వారం రోజుల పాటు నందిగామలోనే ఉన్నాడు. కుట్రదారునిగా అనుమానిస్తున్న హనుమంతరావు పాషాను తన స్నేహితునిగా పేర్కొంటూ రూమ్‌లోనే ఉంచుకున్నాడు. వాసు కదలికలను గమనిస్తూ అనుసరించి అదును చూసుకొని హతమార్చినట్టు లభ్యమైన ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది. గత నెలలో జరిగిన పెద అవుటపల్లి ట్రిపుల మర్డర్ కేసు షూటర్స్ మూడు రోజుల పాటు హనుమాన్ జంక్షన్‌లోని రాయల్ హంపీ హోటల్లో బస చేసినట్టు పోలీసులే చెబుతున్నారు. ఆ హోటల్‌ను ఓ కానిస్టేబుల్ లీజుపై నడుపుతుండటంతో పోలీసుల తనిఖీ లేదని తెలుస్తోంది. -
శవం కోసం ఎదురుచూపు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ :మండలంలోని దూస్‌గాం పంచాయతీ పరిధిలో గల నడిమితండాకు చెందిన లకావత్ బంతిలాల్ (40) సౌదీఅరేబియాలో మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. తండావాసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం... బంతిలాల్‌కు భార్య నీలాబాయి, కూతురు అనిత, కొడుకు అనిల్ ఉన్నారు. అనిల్‌కు కాళ్లు సరిగా లేకపోవడంతో నడవలేడు. కుటుంబ పోషణ, బతుకు దెరువు కోసం సుమారు 6 నెలల కిత్రం రూ.65 వేలు అప్పుచేసి బంతిలాల్ గల్ఫ్‌లోని సౌదీఅరేబియా దేశం వెళ్లాడు. అక్కడ దమ్మామ్ ప్రాంతంలోని ఒక కపిల్(షేక్) దగ్గర గొర్రెల కాపరిగా పనికి చేరాడు. ఆరునెలల్లో కపిల్ బం తిలాల్‌కు ఒక్కసారి కూడా జీతం డబ్బులు ఇవ్వలేదు. కేవలం తినడానికి ఆహారం, నీళ్లు మాత్రమే ఇచ్చేవాడు. ఎడారిలోనే ఉంటూ గొర్రెలను కాసేవాడు. ఇటీవల జీతం గురించి అడిగితే రంజాన్ పూర్తికాగానే ఇస్తానని యజమాని హామీ ఇచ్చినట్లు భార్యకు సమాచారం ఇచ్చాడు. అయితే ఈనెల 10వ తేదీన బంతిలాల్ చనిపోయినట్లు తోటి గొర్రెల కాప రి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో భార్యాపిల్ల లు దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయమై కపిల్‌కు ఫోన్‌చేయగా బంతిలాల్ అనారోగ్యంతో చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మృతిచెందినట్లు సమాధానం ఇచ్చాడు. సౌదీలో ఉంటున్న తండావాసు లు కొందరు కపిల్ వద్దకు వెళ్లి బంతిలాల్ మృతదేహాన్ని అప్పగించాలని అడుగగా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని కుటుం బసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బంతిలాల్ ఎలా చనిపోయాడో తెలియడం లేదని, ఎవరైనా చంపేశారా అని కుటుం బసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని తొందరగా రప్పించాలని కోరుతూ ఎంపీ మధుయాష్కీగౌడ్ ద్వారా, కలెక్టరేట్ ద్వారా సౌదీలోని ఇండియన్ ఎంబీసీకి, ఢిల్లీలోని ఎంబసీకి లెటర్‌ను ఫ్యాక్స్ చేయించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి బంతిలాల్ ఎలా మృతిచెందాడనే విషయంపై విచారణ జరిపించాలని కోరారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని తండావాసులు, కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.