- సంచలన హత్యలు
- చేష్టలుడిగిన నిఘా
- భయాందోళనలో ప్రజలు
బాంబులు విసరడం..వేట కొడవళ్లతో ప్రత్యర్థులను చంపడం పాత పద్ధతి. నిమిషాల వ్యవధిలో పక్కనున్న వారు తేరుకునేలోపే పరారయ్యే ‘షూటర్స్’ జిల్లాపై గురిపెట్టారు. ఆధిపత్యపోరు..ఆస్తి వివాదాలు..వ్యాపార లావాదేవీలు..కుటుంబ కలహాల్లో ప్రత్యర్థులను హతమార్చేందుకు షూటర్స్‌ను రప్పించడం ఇప్పడు పరిపాటిగా మారింది.
విజయవాడ సిటీ : రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాపై షూటర్స్ ‘తుపాకీ’ గురిపెట్టారు. ఇక్కడున్న వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన షార్ప్ షూటర్స్‌ను రంగంలోకి దించుతున్నారు. కాల్చడంలో ఆరితేరిన యువకులను రప్పిస్తున్నట్టు ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు పరిశీలిస్తే వెల్లడవుతోంది.
గురి తప్పదు...
నాటు పద్ధతిలో హత్యలు ఇప్పుడు సాధ్యపడవు. కొద్దిపాటి పొరపాటు జరిగినా నిందితులు ఇట్టే పట్టుపడతారు. ఇదే షూటర్స్ అయితే గురి తప్పదు. పైగా వీరు పట్టుబడడం కూడా కష్టమే. జిల్లాలోని నందిగామ పట్టణంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొగ్గవరపు శ్రీశైల వాసును హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుడు పాషా కాల్చి చంపినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. కొద్ది రోజులుగా నందిగామలోనే ఉంటున్న పాషా అదను చూసుకుని వాసును 0.32 రివాల్వర్‌తో కాల్చి చంపాడు.
గత నెల 24వ తేదీన ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన గంధం నాగ్వేరరావు,అతని కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యను కాల్చి చంపిన వారు ఢిల్లీకి చెందిన కిరాయి షూటర్లు. కొన్నేళ్ల కిందట పాతబస్తీలో వ్యాపారి కోటంరాజు లక్ష్మీనారాయణ అలియాస్ పంతులు కాల్చి వేతలో ఐఎస్‌ఐ ఉగ్రవాది అజంఘోరీ పాల్గొన్నాడు. నగరంలోని ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలపై కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన కేసుల్లోని నిందితులు కూడా కాల్పులు జరపడంలో సిద్ధహస్తులైన కిరాయి వ్యక్తులే కావడం విశేషం. కాగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తుపాకులు తక్కువ ధరకే దొరకడం నిందితులకు అవకాశంగా మారింది. వ్యకులతో నిమిత్తం లేకుండా రూ.15వేలు మొదలు రూ.25వేల వరకు ఇస్తే చాలు తుపాకులు, అవసరమైన తూటాలు ఇస్తారు.
నిఘా నామమాత్రమే...
జిల్లాలో నిఘా వ్యవస్థ నిద్రమత్తులో జోగుతుందనే ఆరోపణలకు ఈ ఘటనలే నిదర్శనం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ తరహా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కొంతమేర ప్రయత్నిస్తున్నా..జిల్లాలో మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు. శ్రీశైల వాసు హత్యలో పాల్గొన్న నిందితుడు వారం రోజుల పాటు నందిగామలోనే ఉన్నాడు. కుట్రదారునిగా అనుమానిస్తున్న హనుమంతరావు పాషాను తన స్నేహితునిగా పేర్కొంటూ రూమ్‌లోనే ఉంచుకున్నాడు. వాసు కదలికలను గమనిస్తూ అనుసరించి అదును చూసుకొని హతమార్చినట్టు లభ్యమైన ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది. గత నెలలో జరిగిన పెద అవుటపల్లి ట్రిపుల మర్డర్ కేసు షూటర్స్ మూడు రోజుల పాటు హనుమాన్ జంక్షన్‌లోని రాయల్ హంపీ హోటల్‌లో బస చేసినట్టు పోలీసులే చెబుతున్నారు. ఆ హోటల్‌ను ఓ కానిస్టేబుల్ లీజుపై నడుపుతుండటంతో పోలీసుల తనిఖీ లేదని తెలుస్తోంది.