జడ్జీల ఎంపికలో పారదర్శకత ఉంటుందా?
కొలీజియమ్ స్థానంలో వచ్చిన జాతీయ న్యాయమూర్తుల ఎంపిక కమిషన్ వల్ల రాజకీయ జోక్యం పెరుగుతుందనీ, జడ్జీల స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందనీ ఒక వాదన వినిపిస్తోంది. ఈ సందేహాలకు కాలం సమాధానం చెబుతుంది కానీ, న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత లోపించకూడదు.
న్యాయమూర్తులే న్యాయమూర్తులను ఎంపిక చేసుకునే విధానం మీద చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. ఈ పద్ధతి మీద కొంత మంది అసంతృప్తిని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. 1993లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసు, ఆ తరువాత స్పెషల్ రెఫరెన్స్ 1 యా్క్ట్ 1998ల ద్వారా కొలీజియమ్ పద్ధతికి ఆధిక్యత లభించింది. ఈ పద్ధతే చాలా బాగుందన్న న్యాయమూర్తు లూ ఉన్నారు. ఇది అత్యంత గోప్యంగా, న్యాయమూర్తుల ఇష్టాఇష్టాల ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అనే న్యాయ మూర్తులూ ఉన్నారు.
తొలుత న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యం ఉండేది. ఆ తరువాత న్యాయమూర్తుల ఆధిక్యత ఏర్పడింది. ఇప్పుడు జాతీయ జ్యుడిషియల్ ఎం పిక కమిషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుని భారత పార్ల మెంట్ గత ఏడాది ఆగస్టులో ఆమోదించింది. దీనితో పాటు ప్రవేశపెట్టిన 121వ రాజ్యాంగ సవరణ బిల్లును కూ డా భారత పార్లమెంట్ ఆమోదించింది.
ఈ సవరణకు 29 రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాలు ఆమోదముద్ర తెలుపాల్సి ఉంటుంది. కాగా 16 రాష్ట్రాలు ఈ సవరణను రాష్ట్రపతికి పంపించడం, ఆయన దానికి ఆమోదముద్ర వేయడంతో బిల్లు శాసనంగా మారింది. ఈ శాసనం ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపం మారుతుం దన్న వాదన కూడా ఉంది. ఈ విషయం గురించి ఇప్పటికే దాఖలైన పిటిషన్లకు స్వీకరించదగిన పరిపక్వత రాలేదన డంతో అవి మూలన పడ్డాయి. ఇప్పుడు వాటిని మళ్లీ దాఖ లు చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకొని మధ్యంతర ఉత్తర్వులు చేస్తాయా, నోటీసులు జారీ చేసి మిన్నకుంటాయా? వేచి చూడాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే ఈ బిల్లు(ఇప్పుడు చట్టం)లోని ము ఖ్యాంశాలు ఏమిటి? ఈ కమిషన్లో ఎవరు సభ్యులుగా ఉంటారనే సందేహాలు సహజంగానే వస్తాయి. ఈ చట్టం లోని పూర్వపరాలను పరిశీలిద్దాం. భారత ప్రధాన న్యాయ మూర్తిని, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను ఎంపిక చేయడానికి అవలంభించాల్సిన పద్ధతిని ఈ చట్టం ఏర్పరుస్తుంది.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏవైనా ఖాళీలు ఏర్పడిన ప్పుడు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ దృష్టికి తీసుకువస్తుంది. ఈ ఖాళీలను ఆ చట్టం అమలు లోకి వచ్చిన 30 రోజుల్లో కమిషన్కు కేంద్రం తెలుపాల్సి ఉంది. ఎవరైనా న్యాయమూర్తి పదవీ కాలం ముగుస్తున్న ప్పుడు దానిని ఆరు నెలలు ముందుగా కమిషన్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరైనా న్యాయమూర్తి మర ణం వల్ల, రాజీనామా వల్ల ఖాళీ ఏర్పడినా దానిని 30 రోజుల్లో కమిషన్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అందరిలోనూ సీనియర్ అయిన న్యాయమూర్తినే కమిషన్ నియమించాల ని సిఫారసు చేస్తుంది. అయితే కమిషన్ అతని యోగ్యతను పరిశీలిస్తుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపికలో అభ్యర్థుల సామర్థ్యం, అర్హత, ఇతర విషయాలను పరిగణ లోనికి తీసుకొని కమిషన్ నియామకం చేస్తుంది. ఇందు కోసం నిబంధనలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే న్యాయమూర్తి విషయంలో ప్రధానంగా సీనియర్నే ఎంపి క చేస్తారు. వారి సామర్థ్యం, అర్హతలను కమిషన్ పరిగణ నలోకి తీసుకుంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేసి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రా యం కోసం పంపిస్తారు. తన అభిప్రాయం కమిషన్కు తెలియజేసే ముందు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తి సంప్రదించాల్సి ఉంటుంది. తన సిఫార్సులను పంపించే ముందు కమిషన్ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ అభిప్రాయం కూడా పరిగణ నలోకి తీసుకుంటుంది.
ఈ కమిషన్కు భారత ప్రధాన న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. ఆయనతోపాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, మరో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు, కేంద్ర న్యాయశాఖామంత్రి సభ్యులుగా ఉంటారు. వీరిలో ఏ ఇద్దరు సభ్యులైనా న్యాయమూర్తి నియామకాన్ని వ్యతిరేకిస్తే ఆ వ్యక్తిని న్యాయమూర్తిగా నియమించే అవకాశం లేదు. ఈ కమిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలను కూడా చేపడుతుంది. ఇందుకు అవలంభించే పద్ధతిని కమిషన్ ఏర్పాటు చేస్తుంది.
ఈ కమిషన్ సిఫార్సు చేసిన వ్యక్తులను భారత రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సును పునఃపరిశీలన చేయమని రాష్ట్రపతి కమిషన్కు పంపిం చవచ్చు. అలా పంపించినప్పుడు కమిషన్ సర్వసమ్మతితో తిరిగి సిఫార్సు చేసినప్పుడు రాష్ట్రపతి ఆ విధంగా నియామకం చేయాల్సి ఉంటుంది.
ఈ కమిషన్ వల్ల రాజకీయ జోక్యం పెరుగుతుం దన్న వాదన ఉంది. న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం సన్నగిల్లుతుందన్న వాదన కూడా ఉంది. ఈ సందేహాలకు కాలం సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఇద్దరు సభ్యులు ఒప్పుకోకుండా ఏ సిఫార్సు లైనా తిరస్కరించే అవకాశం ఉంది. అయితే ఈ చట్టంలో కూడా పారదర్శకత కనిపించ డంలేదు. ఎవరిని న్యాయమూర్తులుగా నియమి స్తున్నారు అన్న విషయం ప్రజలకు తెలియనప్పుడు ఎవరిని ఎంపిక చేసినా ఒక్కటే.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆర్.ఎన్. సోథీ అభిప్రాయం ప్రకారం ఈ న్యాయమూర్తులకు కూడా రాతపరీక్ష, మౌఖిక పరీక్షలు ఉండాలా? వీటి సంగతి ఏమో కానీ ఎవరిని నియమిస్తున్నారు? ఎందుకు తిరస్కరిం చారు? అనే విషయాలు ప్రజలకు తెలియాలి. ఆ పారదర్శ కత ఉండాలి.
- అనురాగ్ జింబో ఫోన్ : 040-27610182