రుణమాఫీ వర్తించదు
ములుగు: రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాక అయోమయం చెందుతున్న రైతులకు బ్యాంకర్లు విడుగులాంటి వార్త చెవిన వేశారు. కేవలం పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడంతో రైతులంతా బ్యాంకర్లతో వాగ్వాదానికి దిగారు. బుధవారం ములుగు మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బుధవారం ములుగు గ్రామ పంచాయతీ వద్ద స్థానిక భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ వందన, నెట్ వర్క్-1 జనరల్ మేనేజర్ కన్సల్తో కలిసి రుణాలు తీసుకున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్సల్ మాట్లాడుతూ, పంట రుణాలు తీసుకున్న రైతులు రెన్యువల్ చేసుకుంటేనే రుణ మాఫీ వర్తిస్తోందని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందారు. మాఫీ వర్తించదంటూ అధికారి చేసిన వ్యాఖ్యపై మండిపడ్డారు. రెన్యువల్ చేసిన తర్వాత రుణాలు ఎలా మాఫీ అవుతాయంటూ బ్యాంక్ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను చుట్టుముట్టి నిరసనకు దిగారు.
ఇంతలో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు అంజిరెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని గొడవకు దారితీసిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంటుండగా, రైతులు రుణాలు ఎందుకు రెన్యువల్ చేస్తారంటూ వారు బ్యాంకు జీఎంను ప్రశ్నించారు. రైతులు పంట రుణాలు రెన్యువల్ చేయబోరంటూ బ్యాంకు అధికారితో స్పష్టం చేశారు. దీంతో బ్యాంకు అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు.
రికవరీ క్యాంపును అడ్డుకున్న గ్రామస్తులు
కౌడిపల్లి: రికవరీ క్యాంపుల ద్వారావ్యవసాయ రుణాలను వసూలు చేసేందుకు మండలంలోని వెల్మకన్న గ్రామానికి వెళ్లిన బ్యాంక్ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. స్థానిక ఎస్బీఐ అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ బాబు, బిజినెస్ కరస్పాండెంట్ విఠల్, ఆంజనేయులు బుధవారం వెల్మకన్నల్లో గ్రామస్తులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రికవరీ చేపట్టాలని భావించారు.
అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు బ్యాంకర్లు సమావేశం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఓవైపు రుణమాఫీ చేస్తుండగా, రికవరీ పేరుతో గ్రామాల్లోకి ఎందుకువచ్చారంటూ అధికారులను నిలదీశారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుదిరిగి వెళ్లారు.