recruitment scam
-
TCS Recruitment Scam: లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!
దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 16 మందిపై వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగించింది. కంపెనీతో వ్యాపారం సాగిస్తున్న ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారనే స్కామ్‌లో వీరి పాత్ర ఉన్నట్లు సంస్థ గుర్తించింది. జూన్ 23న ప్రారంభమైన విచారణ నివేదిక ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మొత్తం 19 మంది ఉద్యోగులు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం అయినట్లు టీసీఎస్ తెలిపింది. అయితే వీరిలో 16 మందిని తొలగించారు. మరో ముగ్గురిని సంస్థ రీసోర్స్ మేనేజ్మెంట్ విధుల నుంచి బదిలీ చేసింది. దాంతోపాటు ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌లో ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున డబ్బు ముట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారానే ఈ సమాచారం బయటకు వచ్చింది. కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొన్నేళ్లుగా సిబ్బంది నియామకాలకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు కమీషన్ల ద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించవచ్చని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కు లేఖలు అందాయి. దాంతో ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ..జూన్ 23న సమగ్ర విచారణకు కమిటీని నియమించింది. సదరు కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది. ఈ స్కాంతో కంపెనీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కుంభకోణంలో మేనేజర్ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ సంస్థ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. హెచ్ఆర్ అండ్ టాలెంట్ అక్విజేషన్, రిసోర్స్ అలోకేషన్ గ్రూప్ ద్వారా 55 దేశాల్లో దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, వర్క్‌ఫ్రంహోంకు స్వస్తి పలికినట్లు టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ గతంలో ఆఫర్ లెటర్లు ప్రకటించిన వారిని తప్పకుండా ఉద్యోగంలోకి తీసుకుంటుందని చెప్పింది. -
నల్ల డైరీలో కీలకాంశాలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ అక్రమ నియామకాలకు సంబంధించిన స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పురోగతి సాధించింది. సోదాల్లో భాగంగా నాటి విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన ఇంట్లో నలుపు రంగు డైరీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కామ్‌కు సంబంధించిన కీలక ఆధారాలు అందులో రాసి ఉన్నట్లు ఈడీ చెబుతోంది. దీంతో దర్యాప్తు సరైన మార్గంలో కొనసాగేందుకు వీలవుతుందని ఈడీ అధికారులు చెప్పారు. బెంగాల్ ఉన్నత విద్య, పాఠశాల విద్యా విభాగానికి సంబంధించిన ఆ డైరీలోని 40 పేజీల్లో చాలా వివరాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పార్థా, అర్పితాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ నుంచి నేరుగా కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు తీసుకొచ్చి పార్థాను ప్రశ్నించారు. దీంతోపాటు గతంలో పశ్చిమబెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాఛార్యకు ఈడీ సమన్లు జారీచేసింది. బుధవారం కోల్‌కతాలోని తమ ఆఫీస్‌కు వచ్చిన వాంగ్మూలం ఇవ్వాలని ఈడీ ఆదేశించింది. ఈడీ గతంలోనే మాణిక్ ఇంట్లో సోదాలుచేయడం తెల్సిందే. కాగా, పార్థాను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి లేఖ రాశారు. -
ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే: అర్పితా ముఖర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తు వేళ తన ఇంట్లోంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు అంతా నాటి బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీదేనని నిందితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీలో విచారణలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామక స్కామ్‌లో భాగంగా ఈడీ సోదాల్లో ఆర్పిత ఇంట్లో రూ.20 కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నట్లు ఈడీ ఉన్నతాధికారి వెల్లడించారు. అర్పిత, పార్థా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలుచేయగా, సంబంధిత డాక్యుమెంట్‌ను ఈడీ స్వాధీనంచేసుకుంది. గ్రూప్ సీ, గ్రూప్ డీ తరగతి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, తుది ఫలితాలు, అపాయిమెంట్ లెటర్స్ తదితర పత్రాలూ అర్పిత ఫ్లాట్‌లో దొరికాయి. వెస్ట్ మేదినీపూర్ ఓ స్కూల్ పేరిట మంత్రి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కాగా, అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరిన మంత్రి పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చికిత్స అనవసరమని భువనేశ్వర్ ఎయిమ్స్ ప్రకటించింది. కాగా, మంత్రి, అర్పితలను ఆగస్ట్ మూడో తేదీ దాకా ఈడీ కస్టడీలోకి అప్పజెప్తూ ఈడీ కోర్టు ఆదేశాలిచ్చింది. -
'పెరోల్ ఇవ్వమంటున్నారు.. మీరేమంటారు?'
న్యూఢిల్లీ: టీచర్ల నియామకాల్లో అవతవకలకు పాల్పడి ప్రస్తుతం పదేళ్ల కాలానికి జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా తన వైద్యం కోసం దాఖలు చేసుకున్న పెరోల్ బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. అయితే, ఇప్పటికే చౌతాలా పిటిషన్‌ను హర్యానా ప్రభుత్వం వ్యతిరేకించింది కూడా. 82 ఏళ్ల చౌతాలా తన కాళ్లకు పక్షవాతంవచ్చిందని, వైద్యం చేయించుకునేందుకు 60 రోజులపాటు పెరోల్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, దీనిపై హైకోర్టుకు వెళ్లండంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారు తిరిగి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోర్టుకు కౌంటర్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. -
పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా
భోపాల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ విధాన సభ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో భాగంగా చేపడుతున్న విచారణలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన గురువారం పోలీసుల వద్దకు వెళుతున్నారు. జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఈ కుంభకోణం చేసుకుంది. ఆ సమయంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జహంగిరాబాద్ పోలీసులు దిగ్విజయ్ సింగ్‌పై, నాటి స్పీకర్ శ్రీనివాస్ తివారీ, ఇతర వ్యక్తులపై విధాన సభకోసం జరిగిన రిక్రూట్ మెంట్లో మోసం, కుట్ర, నకిలీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు.