'పెరోల్ ఇవ్వమంటున్నారు.. మీరేమంటారు?'
న్యూఢిల్లీ: టీచర్ల నియామకాల్లో అవతవకలకు పాల్పడి ప్రస్తుతం పదేళ్ల కాలానికి జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా తన వైద్యం కోసం దాఖలు చేసుకున్న పెరోల్ బెయిల్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.
అయితే, ఇప్పటికే చౌతాలా పిటిషన్ను హర్యానా ప్రభుత్వం వ్యతిరేకించింది కూడా. 82 ఏళ్ల చౌతాలా తన కాళ్లకు పక్షవాతంవచ్చిందని, వైద్యం చేయించుకునేందుకు 60 రోజులపాటు పెరోల్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, దీనిపై హైకోర్టుకు వెళ్లండంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారు తిరిగి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోర్టుకు కౌంటర్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది.