గట్లపై విత్తు.. ‘శత్రు’ చిత్తు
చేలల్లో గట్ల వెంబడి కంది నాటితే వరికి హాని కల్గించే శత్రు పురుగులైన ఆకుముడత, కాండం తొలుచు పురుగులు, సుడిదోమను నివారించవచ్చు. రైతుకు మిత్రులైన సాలీడు, తూనీగ, అక్షింతల పురుగులు కంది మొక్కలపై నివాసం ఉంటాయి. ఇవి శత్రు పురుగులను నాశనం చేసి పంటను రక్షించేందుకు ఉపయోగపడతాయి. వరికి తీవ్ర నష్టం కలిగించే అగ్గితెగులు, పొడతెగులు, ఆకుముడత ఎండు తెగుళ్లకు కారణమైన సిద్ద బీజాలు (వ్యాధి కారకాలు) ఒక చోట నుంచి మరోచోటకు గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా కంది నిరోధిస్తుంది.
చేలగట్ల వెంట కంది నాటడం వల్ల ప్రధాన పంటకు అవసరమైన నీరు, ఎరువుల విషయంలో ఎటువంటి నష్టం ఉండదు. గాలి వానలకు ప్రధాన పంటను కాపాడే కవచంలా కంది మొక్కలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పొలం గట్లపై మొలిచే గడ్ది ద్వారా పంటకు నష్టం కల్గించే కీటకాల నివారణకు కూడా కింది మొక్కలు పనికొస్తాయి. దీంతో పాటు గట్లను పటిష్టంగా ఉంచి ఎలుకలు కన్నాలు పెట్టకుండా వీటి వే రు వ్యవస్థ నివారిస్తుంది.
కంది పంట పక్షి స్థావరాలకు ఆవాసంగా ఉండటం వల్ల పంటను పాడు చేసే క్రిములను పక్షులు తినేస్తాయి. దీని వల్ల పంటకు రక్షణ కలుగుతుంది. ఎకరం వరి చేలోని గట్లపై విత్తడానికి 100గ్రాముల కంది విత్తనం సరిపోతుంది. దీనిపై సుమారు 10 నుంచి 15కేజీల వరకు కంది దిగుబడి వస్తుంది. ఇది రైతు కుటుంబ అవసరాలకు సరిపోతుంది. అమ్ముకుంటే మార్కెట్ ధరను బట్టి ఎంతోకొంత ఆదాయం వస్తుంది. ప్రస్తుతం భూచేతన పథకంలో భాగంగా ఎంపికి చేసిన గ్రామాల్లో ఎకరానికి 100 గ్రాముల చొప్పున కంది విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందజేస్తున్నాం.
40 శాతం యూరియా ఆదా..
వరి చేలగట్ల వెంబడి కందిని సాగు చేయడం వల్ల 32నుంచి 40శాతం వరకు నత్రజని ఎరువును ఆదాచేయవచ్చు. కందిని ఏక పంటగా వేయడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. భూమిలో కంది వేరు బుడిపెలపై ‘రైజోబియం’అనే బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టిరియా గాలి నుంచి నత్రజనిని గ్రహించి భూమికి అందిస్తుంది. దీనివల్ల భూమిలో న త్రజని స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా భూ భౌతిక రసాయన స్థితిగతులు మెరుగుపడతాయి. తద్వారా నత్రజని (యూరియా) వినియోగం తగ్గించుకోవచ్చు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే 88866 13853 సంప్రదించవచ్చు.
అంతర పంటతోనూ లాభాలు..
కందిని తోటలు, ఇతర పంటల్లో అంతర పంటగా సాగుచేయడం ద్వారా అధిక ఆదాయం పొందవ చ్చు. 1:7 నిష్పత్తిలో కంది, వేరుశెనగ, పెసర, మినుము, సోయా, సాగు చేయవచ్చు.1:2 నిష్పత్తిలో కంది మొక్కజొన్న, జొన్న కూడా సాగు చేయవచ్చు. ఈ విధంగా అంతరపంటగా కంది వేస్తే భూసారం పెరుగుతుంది.