నేడు, రేపు మెట్రో రెడ్‌లైన్‌కు అంతరాయం
- మెయింటెనెన్స్, మరమ్మతు పనుల కారణంగానే
- 9, 10 తేదీల్లో 18 నిమిషాలకొక రైలు
సాక్షి, న్యూఢిల్లీ: వారాంతం రోజుల్లో చేపట్టనున్న మెయింటెనెన్స్, మరమ్మతు పనుల కారణంగా తీస్‌హజారీ - ఇందర్‌లోక్ స్టేషన్ల మధ్య మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ శని, ఆది వారాల్లో రెడ్ లైన్ (లైన్ 1)పై ఉన్న ఈ రెండు స్ట్టేషన్ల మధ్య రైళ్లు సింగిల్ లైన్‌పై నడుస్తాయి. దీంతో మధ్యలో ఉన్న మూడు స్టేషన్లు -పుల్బంగష్, ప్రతాప్‌నగర్, శాస్త్రీ నగర్ స్టేషన్లలో కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయి.
మరమ్మతు పనుల కారణంగా 9వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు, పదో తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దాదాపు 18 నిమిషాలకొక రైలు నడుస్తుందని మెట్రో ప్రతినిధి తెలిపారు. పుల్బంగష్, ప్రతాప్‌నగర్ మెట్రో స్టేషన్ల మధ్య కొనసాగుతున్న మెయిం టెనెన్స్ పనుల కారణంగా వారాంతం రైలు సేవలు ప్రభావితం కానున్నట్లు ఆయన చెప్పారు. ‘సాధారణంగా మెయింటెనెన్స్, మరమ్మతు పనులను తాము రాత్రి పూట చేపడుతుంటాం. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. అయితే కొన్ని సార్లు రైళ్లు నడిచే వేళల్లో కూడా మెయింటెనెన్స్ పనులు చేపట్టాల్సి వస్తుంది. అప్పుడు తాము ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే వేళల్లో పనులు చేపడతాం’ అని మెట్రో ప్రతినిధి తెలిపారు.