మోదీ రెడ్‌లైన్ దాటారు: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌లో చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతిస్తామన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనలపై పాక్ నాయకత్వం మండిపడుతోంది. తమ దేశానికి సంబంధించిన బలూచిస్తాన్‌పై మాట్లాడి నరేంద్రమోదీ 'రెడ్‌లైన్' దాటారని పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం మండిపడ్డారు. బలూచిస్తాన్ గురించి మాట్లాడటం ద్వారా ఐక్యరాజ్యసమితి(యూఎన్) నియమావళిని మోదీ ఉల్లంఘించారన్నారు.
ఈ నేపథ్యంలో రానున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తామని జకారియా స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం, మానవహక్కుల సంస్థలు కశ్మీర్ విషయంలో స్పందించి, భారత బలగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సైతం పీఓకే, బలూచ్ ప్రజలకు మద్దతిస్తామని ప్రకటించి పాక్ విషయంలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే.