వాషింగ్టన్: పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు పాక్ నుంచి బలోచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బలోచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్(బీఎన్‌సీ) తెలిపింది. ఈ ఘటనకు కారకులైన దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని సూచించింది. భారత్ వెంటనే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకోవాలని కోరింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై వెంటనే యుద్ధాన్ని ప్రకటించాలని బీఎన్‌సీ అధ్యక్షుడు వహీద్ బలోచ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమాయకులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. భారత్‌లో బలోచ్ నేత ఖాన్ కలాత్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలనీ, బలోచిస్తాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాక్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో పోరాడేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment