Nafees Zakaria
-
భారత్‌కు ఆ హక్కు లేదు: పాకిస్తాన్
ఇస్లామాబాద్: భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ‘వాతావరణం’ మరింత దెబ్బతింటుందని పాకిస్తాన్ పేర్కొంది. తమ సైనికుల తలలను పాకిస్తాన్ సైన్యమే నరికిందంటూ భారత్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన విమర్శలపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా ‘రేడియో పాకిస్తాన్’తో మాట్లాడుతూ, భారత సైనికుల తలలు నరికిన ఘటనంటూ ఏదీ జరగలేదని తాము ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు. తమపై చేస్తున్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ముందు పెట్టే హక్కును భారత్ ఎప్పుడో కోల్పోయిందని, యూఎన్‌కు భారత్ ఎప్పడూ కట్టుబడి ఉండలేదని ఆరోపించారు. యూఎన్ మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్‌నకు భారత్ ఎన్నడూ సహకరించలేదన్నారు. కశ్మీర్లో జరుగుతున్న దురాగతాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు భారత్ ప్రతిసారి ‘పాకిస్తాన్ కార్డ్’ను వాడుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
మోదీ రెడ్‌లైన్ దాటారు: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌లో చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతిస్తామన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనలపై పాక్ నాయకత్వం మండిపడుతోంది. తమ దేశానికి సంబంధించిన బలూచిస్తాన్‌పై మాట్లాడి నరేంద్రమోదీ 'రెడ్‌లైన్' దాటారని పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం మండిపడ్డారు. బలూచిస్తాన్ గురించి మాట్లాడటం ద్వారా ఐక్యరాజ్యసమితి(యూఎన్) నియమావళిని మోదీ ఉల్లంఘించారన్నారు. ఈ నేపథ్యంలో రానున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తామని జకారియా స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం, మానవహక్కుల సంస్థలు కశ్మీర్ విషయంలో స్పందించి, భారత బలగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సైతం పీఓకే, బలూచ్ ప్రజలకు మద్దతిస్తామని ప్రకటించి పాక్ విషయంలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే.