ఎర్రచందనం కేసుల్లో కనీసం ఐదేళ్ల శిక్ష
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం, గంధం (చందనం), రోజ్‌వుడ్ చెట్ల నరికివేత, స్మగ్లింగ్ కేసుల్లో నిందితులకు కనీసం ఐదేళ్లు శిక్ష పడేలా చట్టాన్ని సవరించాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అడవి ఉమ్మడి జాబితాలో ఉన్నందున అటవీ చట్టాల సవరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎర్రచందనం, రోజ్ఉడ్, గంధం చెట్ల నరికివేత, స్మగ్లింగ్ కేసుల్లో ప్రస్తుతం ఉన్న శిక్షా కాలం (మూడు నెలల నుంచి ఏడాది) పదేళ్లకు పెంచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన కేంద్రం చట్ట సవరణ చేసుకుని తమకు పంపాలని సూచించింది. దీంతో ఈ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి పరిశీలన నిమిత్తం అటవీశాఖ సమర్పించింది.
ఎర్రచందనం స్మగ్లర్ శరవణన్ అరెస్ట్
గుడిపాల: చెన్నైకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ శరవణన్(35)ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. గుడిపాల సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలోని మద్రాస్ క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం రాత్రి పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో టీఎన్-04-ఎక్స్-2727 నంబర్ గల వ్యాన్‌లో 11 ఎర్రచందనం దుంగలు గుర్తించారు. పోలీసులను చూసి డ్రైవర్ చంద్ర పారిపోగా.. వాహనంలోనే ఉన్న శరవణన్‌ను అదుపులోకి తీసుకున్నారు.