by reddy
-
మోసం.. బాబు నైజం
– శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కారు – శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్న నీటిని దిగువకు తీసుకపోయారు – సీమ ప్రజలు మేల్కొకపోతే తీవ్ర అన్యాయం – ముగిసిన బైరెడ్డి దీక్షలు కర్నూలు సిటీ: ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. అమరావతిని ఫ్రీజోన్ చేయాలని కోరుతూ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో బైరెడ్డి చేపట్టిన నిరహార దీక్షలను.. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారన్నారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా కర్నూలుకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా తుంగలోకి తొక్కారన్నారు. రాజధాని కోసం రైతులనుంచి దౌర్జన్యంగా భూములు లాక్కొని.. టీడీపీ నేతలకు దోచి పెట్టారని ధ్వజమెత్తారు. దోచుకున్న డబ్బు ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు ఉన్నారని, పదవులు, పైసలు శాశ్వతం కాదనే విషయాన్ని వారు గమనించుకోవాలన్నారు. సీమ ప్రజలపై చిన్న చూపు రాయలసీమ ప్రజలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చిన్నచూపని, అందుకే రాజధాని, ప్రముఖ విద్యా సంస్థలన్నీ కోస్తా ప్రాంతంలోనే నెలకొల్పుతున్నారని బైరెడ్డి విమర్శించారు. రాష్ట్రం విడిపోయి మూడేళ్లయినా నేటికీ రాజధాని సరిహద్దు ఎంత అనే దానిపై స్పష్టత రాలేదన్నారు. చట్ట ప్రకారం రాజధానిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలన్నారు. శ్రీశైలం డ్యాం డెడ్‌స్టోరేజీలో ఉన్నా దిగువకు నీరు తీసుకోయారని, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇకనైనా సీమ ప్రజలు మేల్కొకపోతే తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఫ్రీజోన్‌పై ప్రభుత్వం స్పందించకపోతే చలో అమరావతిపై త్వరలోనే ప్రకటన చేస్తామని బైరెడ్డి పేర్కొన్నారు.దీక్షల్లో ఆర్యూ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర, ఆర్పీఎస్ నాయకులు, విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ అదే తప్పు చేస్తున్నారు
- సీమకు జరుగుతున్న అన్యాయంపై బైరెడ్డి ధ్వజం - రాజధాని ఫ్రీజోన్ ప్రకటన చట్టబద్ధతకు డిమాండ్ - కృష్ణదేవరాయ సర్కిల్లో 48 గంటల దీక్ష ప్రారంభం కర్నూలు సిటీ: ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిన కారణంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని, ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలోని ఉద్యోగాలను రాయలసీమ వాసులకు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమ వాసులకు రాజధాని అమరావతిలో ఉద్యోగాలు రావాలంటే దాన్ని ఫ్రీజోన్ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఫ్రీజోన్‌గా చేసి జనాభా ప్రాతిపదికన 40 శాతం ఉద్యోగాలు సీమ వాసులకే ఇవ్వాలని కోరుతూ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో తలపెట్టిన 48 గంటల దీక్షలను ఆయన మంగళవారం ప్రారంభించారు. 2014 జూన్ 2వ తేది నుంచి అమరావతిలో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ రద్దు చేసి ఫ్రీజోన్ కింద సీమ వాసులకు సైతం అవకాశం కల్పించాలన్నారు. జనాభా ప్రాతిపాదికన రాజధానిలోని ఉద్యోగాల్లో వాటాలు నిర్ణయించాలన్నారు. శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నిత్యం అమరావతి జపం చేస్తున్నారని, సీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే రెయిన్ గన్లతో కరువును తరిమేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎగువన ఉన్న ప్రాంతం, కరువుతో అల్లాడుతున్న ప్రాంతం వాడుకున్న తరువాతే దిగువకు నీటినివ్వాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఆ పార్టీలోని ఒక్క నాయకుడు నోరుమెదకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం, రాయలసీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించకుంటే ఛలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రాయలసీయ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర, రవికుమార్, ఆర్పీఎస్ నాయకులు త్యాగరాజు, దళిత సంఘం నాయకులు బాల సుందరం, కడప, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఉత్తర్వులు వస్తే తప్ప నమ్మలేం
- అమరావతి ఫ్రీజోన్ ప్రకటనపై బైరెడ్డి కర్నూలు(సిటీ): రాష్ట్ర రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు ఫ్రీజోన్‌గా ప్రకటించడంపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌తో ఈనెల 18,19 తేదీల్లో ఆందోళనకు పిలుపునిచ్చామని, అయితే ఈ లోగా ఫ్రీజోన్‌గా ప్రకటించారన్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే వరకు నమ్మలేమన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలతో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని సీఎం ప్రకటించారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణాజలాల వాటాలో సీమ వాటా నిర్ణయించాలని కోరారు. తుంగభద్రపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తేనే రాయలసీమకు సమృద్దిగా నీరందుతుందన్నారు. అలాకాకుండా ముచ్చుమర్రి ఎత్తిపోతలను ప్రారంభించి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.