మళ్లీ అదే తప్పు చేస్తున్నారు
మళ్లీ అదే తప్పు చేస్తున్నారు
Published Tue, Jan 24 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
- సీమకు జరుగుతున్న అన్యాయంపై బైరెడ్డి ధ్వజం
- రాజధాని ఫ్రీజోన్ ప్రకటన చట్టబద్ధతకు డిమాండ్
- కృష్ణదేవరాయ సర్కిల్లో 48 గంటల దీక్ష ప్రారంభం
కర్నూలు సిటీ: ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిన కారణంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని, ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలోని ఉద్యోగాలను రాయలసీమ వాసులకు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమ వాసులకు రాజధాని అమరావతిలో ఉద్యోగాలు రావాలంటే దాన్ని ఫ్రీజోన్ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
అమరావతిని ఫ్రీజోన్‌గా చేసి జనాభా ప్రాతిపదికన 40 శాతం ఉద్యోగాలు సీమ వాసులకే ఇవ్వాలని కోరుతూ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో తలపెట్టిన 48 గంటల దీక్షలను ఆయన మంగళవారం ప్రారంభించారు. 2014 జూన్ 2వ తేది నుంచి అమరావతిలో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ రద్దు చేసి ఫ్రీజోన్ కింద సీమ వాసులకు సైతం అవకాశం కల్పించాలన్నారు. జనాభా ప్రాతిపాదికన రాజధానిలోని ఉద్యోగాల్లో వాటాలు నిర్ణయించాలన్నారు. శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నిత్యం అమరావతి జపం చేస్తున్నారని, సీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే రెయిన్ గన్‌లతో కరువును తరిమేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
ఎగువన ఉన్న ప్రాంతం, కరువుతో అల్లాడుతున్న ప్రాంతం వాడుకున్న తరువాతే దిగువకు నీటినివ్వాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఆ పార్టీలోని ఒక్క నాయకుడు నోరుమెదకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం, రాయలసీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించకుంటే ఛలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రాయలసీయ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర, రవికుమార్, ఆర్పీఎస్ నాయకులు త్యాగరాజు, దళిత సంఘం నాయకులు బాల సుందరం, కడప, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement