free zone
-
ఉత్తమాంధ్రగా నిలుపుతామంటే...
ఉత్తరాంధ్ర అన్ని రంగాలలోనూ వెనకబడి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రభుత్వరంగ సంస్థలు, రోడ్డు, రైలు, విమాన, నౌకా రవాణా వ్యవస్థలతో అనుసంధానమైన ప్రాంతం అయినప్పటికీ వెనుకబాటుతనం మాత్రం జనాన్ని వీడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు, పరిశ్రమలకు స్థానం కల్పించిన నేల ఇది. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార రంగాలకు ఆయువు పట్టుగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతున్న ప్రాంతం. సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లిన విజయనగరం, పోరాటాల నేల శ్రీకాకుళం, ఆదివాసీ మన్యం తన సిగలో పెట్టుకున్న విశాఖ... ఈ మూడు జిల్లాల సమాహారమే ఉత్తరాంధ్ర ప్రాంతం. 2019లో ముఖ్యమ్రంతి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో దార్శనికతతో విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించారు. ఇది మూడు ప్రాంతాల అభివృద్ధికీ ఉప యుక్తంగా నిలుస్తున్న అంశం. రాష్ట్ర సమగ్ర వికాసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి నినాదంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం కొద్దిమంది వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు. అమరావతి నుంచి అరస వల్లి వరకు రైతుల పాదయాత్ర పేరుతో పెట్టుబడిదారులు ఉత్తరాంధ్రపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటి చర్య. ఒకవైపు పెట్టుబడి దారులను ప్రోత్సహిస్తూ, యాత్రను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి ఎల్లో పత్రికలూ, ఛానళ్లూ అదే సమయంలో ఉత్తరాంధ్రపై విషపు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తన పత్రికా ప్రయాణాన్ని ప్రారంభించి నేడు అతిపెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించిన ‘ఈనాడు’ రాతలు మహారోత పుట్టిస్తున్నాయి. కేవలం కొందరి కరపత్రంగా ఇది మారిపోయి ఇష్టారాజ్యంగా వారికి నచ్చినట్లు వండి వడ్డిస్తూ ఉత్రరాంధ్రపై విషం కక్కుతున్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పత్రికలు, సమాచార మాధ్యమాలే అప్రజాస్వామిక విధానాలను అవలంబించడం బహుశోచనీయం. ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు, మనో భావాలు, అభివృద్ధి, వికాసం వంటివి ఈ పచ్చపత్రికలు, టీవీ చానళ్లకు, వాటిని నడిపిస్తున్న వారికి పట్టవు. కొందరికి దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రజల ఓట్లు, తద్వారా పదవులు పొందడానికి విశాఖ నగరం కావాలి. ఈ ప్రాంతం, ప్రజలు అభివృద్ధి చెందుతామంటే మాత్రం వీరు ఓర్వలేక పోతున్నారు. నేడు సాంకేతిక విప్లవం పుణ్యాన వీళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడే ప్రతీ వ్యక్తినీ, వ్యవస్థనూ ఉత్తరాంధ్ర ప్రజలు ఊరికే వదలరు. ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం ఆరంభం అయితే దానిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. పోరాటాల పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచి ఉద్యమ స్ఫూర్తినీ, విజయనగరం నుంచి సాంస్కృతిక వారసత్వాన్నీ, విశాఖ నుంచి విజయగీతికనూ అందుకుని ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపి ‘ఉత్తమ ఆంధ్ర’గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలంతా వెన్నంటి నిలుస్తారు. కేవలం 29 గ్రామాల ప్రజల కోసం 26 జిల్లాలతో కూడిన రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టాలంటే ప్రజలు సహించరు. పరిపాలనా రాజధానిగా విశాఖ కాకుండా అడ్డుకునే ప్రతీ వ్యవస్థకూ, పార్టీకీ ఎదురొడ్డి నిలుస్తూ... అసాంఘిక శక్తులను, విద్వేషాలు రగిలించే వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. రాష్ట్ర సమగ్ర వికాసం లక్ష్యంగా, అభివృద్ధి మంత్రంగా... ప్రజలంతా ముందడుగు వేస్తారు. తూర్పు తీరం నవ చరిత్రకు నాందీ వాచకంగా నిలుస్తుంది! - డాక్టర్ టి. షారోన్ రాజు విభాగాధిపతి, విద్యావిభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం -
మళ్లీ అదే తప్పు చేస్తున్నారు
- సీమకు జరుగుతున్న అన్యాయంపై బైరెడ్డి ధ్వజం - రాజధాని ఫ్రీజోన్ ప్రకటన చట్టబద్ధతకు డిమాండ్ - కృష్ణదేవరాయ సర్కిల్లో 48 గంటల దీక్ష ప్రారంభం కర్నూలు సిటీ: ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిన కారణంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని, ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలోని ఉద్యోగాలను రాయలసీమ వాసులకు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమ వాసులకు రాజధాని అమరావతిలో ఉద్యోగాలు రావాలంటే దాన్ని ఫ్రీజోన్ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఫ్రీజోన్‌గా చేసి జనాభా ప్రాతిపదికన 40 శాతం ఉద్యోగాలు సీమ వాసులకే ఇవ్వాలని కోరుతూ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో తలపెట్టిన 48 గంటల దీక్షలను ఆయన మంగళవారం ప్రారంభించారు. 2014 జూన్ 2వ తేది నుంచి అమరావతిలో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ రద్దు చేసి ఫ్రీజోన్ కింద సీమ వాసులకు సైతం అవకాశం కల్పించాలన్నారు. జనాభా ప్రాతిపాదికన రాజధానిలోని ఉద్యోగాల్లో వాటాలు నిర్ణయించాలన్నారు. శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నిత్యం అమరావతి జపం చేస్తున్నారని, సీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే రెయిన్ గన్లతో కరువును తరిమేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎగువన ఉన్న ప్రాంతం, కరువుతో అల్లాడుతున్న ప్రాంతం వాడుకున్న తరువాతే దిగువకు నీటినివ్వాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఆ పార్టీలోని ఒక్క నాయకుడు నోరుమెదకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం, రాయలసీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించకుంటే ఛలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రాయలసీయ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర, రవికుమార్, ఆర్పీఎస్ నాయకులు త్యాగరాజు, దళిత సంఘం నాయకులు బాల సుందరం, కడప, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఉత్తర్వులు వస్తే తప్ప నమ్మలేం
- అమరావతి ఫ్రీజోన్ ప్రకటనపై బైరెడ్డి కర్నూలు(సిటీ): రాష్ట్ర రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు ఫ్రీజోన్‌గా ప్రకటించడంపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌తో ఈనెల 18,19 తేదీల్లో ఆందోళనకు పిలుపునిచ్చామని, అయితే ఈ లోగా ఫ్రీజోన్‌గా ప్రకటించారన్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే వరకు నమ్మలేమన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలతో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని సీఎం ప్రకటించారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణాజలాల వాటాలో సీమ వాటా నిర్ణయించాలని కోరారు. తుంగభద్రపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తేనే రాయలసీమకు సమృద్దిగా నీరందుతుందన్నారు. అలాకాకుండా ముచ్చుమర్రి ఎత్తిపోతలను ప్రారంభించి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
– ఆర్ఎస్ఎఫ్ కార్యాలయంలో పోస్టర్ల ఆవిష్కరణ కర్నూలు (అర్బన్) : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు సంబంధించిన పోస్టర్లను ఆదివారం స్థానిక ఆర్ఎస్ఎఫ్ కార్యాలయంలో నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎఫ్ కో కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ రాజధాని ప్రాంతాఇన్న ఫ్రీజోన్‌గా చేయాలని రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. సీఆర్డీఏ ద్వారా ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన 3వేల ఉద్యోగాలు, 200 కానిస్టేబుల్స్, గ్రూప్–2, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలు కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన వారికి మాత్రమే చెందుతున్నాయన్నారు. ఆర్టికల్ 371 (డీ) ప్రకారం రాజధాని ప్రాంతంలో అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వినోద్, నరసింహులు, పవన్, ప్రశాంత్, సంజీవరెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని సామాజిక హక్కుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహించారు. వేదిక కన్వీనర్ జగదీష్‌తోపాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగ భర్తీలో రిజర్వేషన్ పాటించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు, చేనేతలకు కరువు పెన్షన్ మంజూరు చేయాలన్నారు.ఈ సందర్భంగా శాంతియుత ప్రజా సభ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సాలార్ బాష, నూర్ మహ్మద్, నదీమ్ అహ్మద్, శ్రీరాములు, నాగభూషణం, మధు మాదిగ, డాక్టర్ మైనుద్దీన్, యుగంధర్, ఓబయ్య, జాఫర్, రఘురామయ్య, మల్లికార్జున, చక్రధర్, శ్రీరాములు, లింగమయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని సెప్టెంబర్ 15న చేపట్టనున్న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని సామాజిక హక్కుల వేదిక నిర్ణయించింది. స్థానిక ఎస్ఎస్ ప్యారడైజ్‌లో బుధవారం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక కన్వీనర్ జగదీష్ అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించి ఉద్యోగ నియామకాల్లో 13 జిల్లాల యువతకు అవకాశం కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. బీసీ సంఘం నేతలు రాగే పరశురామ్, ఓబయ్య, మైనార్టీ నాయకులు సాలార్‌బాష, నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి
నెల్లూరు (సెంట్రల్) : నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.లెనిన్‌బాబు డిమాండ్ చేశారు. నెల్లూరు సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ఉద్యోగాల భర్తీలో సీఆర్డీఏకు అధికారాన్ని ఇవ్వకుండా ఏపీపీఎస్సీ ద్వారానే రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కూడా ఒకే ప్రాంతంలో కాకుండా 13 జిల్లాలో చేయాలన్నారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూసి వేయడం చాలా అన్యాయం అన్నారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షులు సిరాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కరీముల్లా, అహ్మద్, సునీల్, సౌజన్య పాల్గొన్నారు. -
రాజధానిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. అలా చేయపోతే సీమవాసులకు, ఉత్తరాంధ్ర వాసులకు భవిష్యత్‌లో అన్యాయం జరుగుతుందని అన్నారు. విశాఖపట్టణం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ తో పాటు.. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఉన్నారు. -
అమరావతిని ఫ్రీజోన్ చేయాలి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని మాజీ మంత్రి టీ జీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్ లో రాయల సీమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే రాయల సీమ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని.. అన్నారు. రాయల సీమకు నీళ్లు అందించే అన్ని ప్రాజక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. పట్టి సీమ, పోలవరం తో పాటు.. రాయల సీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. -
'అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి'
తిరుపతి కల్చరల్: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని శ్రీవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించకపోతే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు కేంద్రంగా అమరావతి మారునుందని, ఈ నేపథ్యంలో దీనిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని తెలిపారు. రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్, ఉత్తరాంధ్రలో వింటర్ క్యాపిటల్ ఏర్పాటు చేసినప్పుడే మరోసారి రాష్ట్ర విభజన ఉద్యమాలు రాకుండా ఉంటాయన్నారు. రాయలసీమలోని 4 జిల్లాలను 8 జిల్లాలుగా, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను 6 జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించాలన్నారు. చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా పీడిస్తున్న మంచి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని తెలిపారు. ఉత్తరాఖండ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం శాంతియుత ఆందోళనలు వేదిక చేపడుతుందన్నారు. -
ఫ్రీజోన్‌గా సీఆర్డీఏ!
* పోలీసు రిక్రూట్మెంట్లో సమన్యాయం కోసమే * రెండు జిల్లాలు, జోన్లలోవిస్తరించి ఉండటంతో ఇబ్బంది * అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆథారిటీ (సీఆర్డీఏ) పరిధిని ఫ్రీజోన్‌గా చేయాలని పోలీసు విభాగం భావిస్తోంది. పోలీసు రిక్రూట్మెంట్స్లో 13 జిల్లాలకు చెందిన వారికీ సమప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంటున్నారు. వేర్వేరు రెవెన్యూ జిల్లాలు, జోన్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని ఫ్రీజోన్ చెయ్యడమెలా అనే అంశంపై డీజీపీ కార్యాలయం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. డీజీపీ జాస్తి వెంకట రాముడు సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఫ్రీజోన్ అంశం పైనే చర్చించారు. పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల్ని జోనల్ స్థాయిలో ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ జరిగే జోన్‌కు చెందిన వారికి 70 శాతం (లోకల్), బయటి జోన్ల వారికి 30 శాతం (నాన్-లోకల్) కోటా ఉంటుంది. కానిస్టేబుల్ స్థాయి వారిని యూనిట్లుగా పిలిచే జిల్లాల వారీగా ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో లోకల్స్‌కు 80 శాతం, నాన్-లోకల్స్‌కు 20 శాతం కోటా ఉంటుంది. ఈ విధానాల ప్రకారం ఎంపిక చేస్తే రాజధానితో పాటు సీఆర్డీఏ పరిధిలో పోలీసు విభాగంలో కేవలం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారే ఉంటారు. ఈ నేపథ్యంలో ఫ్రీ జోన్‌గా చేస్తేనే అన్ని జిల్లాలకు చెందిన వారికి సమప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి రాజధానిలో ఉన్న హైదరాబాద్‌లోని పోలీసు కమిషనరేట్ సైతం చాలా కాలం పాటు ఫ్రీజోన్‌గా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అన్ని ప్రాంతాల వారూ పోలీసు ఉద్యోగాలు పొందారు. దీనికోసం సిటీ పోలీసు చట్టంలో ప్రత్యేకంగా '14ఎఫ్' నిబంధన ఉండేది. సీఆర్డీఏ పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. రెవెన్యూ పరంగా రెండు జిల్లాలు, పోలీసు పరంగా రెండు జోన్లలో ఉంది. కృష్ణా జిల్లా ఏలూరు రేంజ్లో, గుంటూరు జిల్లా గుంటూరు రేంజ్‌ల్లో భాగాలు. అంటే కానిస్టేబుల్ పోస్టుల ఎంపికకు యూనిట్, ఎస్సై ఎంపికకు జోన్ సమస్యగా మారుతోంది. ప్రతిపాదిత గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌కు రూపమిచ్చి ప్రత్యేక చట్టం తీసుకువచ్చినా అది సీఆర్డీఏ పరిధి మొత్తానికి వర్తించదు. వీటన్నింటికీ మించి హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం వివాదాస్పదంగా మారడం వంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం సీఆర్డీఏ ఫ్రీజోన్ విధానం అమలులో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. -
ఏపీ రాజధాని ఫ్రీ జోన్!
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్ నుంచి పాలన మొత్తం ఏపీ రాజధానికి తరలించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెండో జోన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం గుంటూరు-విజయవాడను ఫ్రీ జోన్ చేసేందుకు సర్కారు ప్రయత్నాలు ఆరంభించింది. హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి తరలివెళ్లే ఉద్యోగుల స్థానికతను సడలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికే ఏపీ రాజధాని ప్రాంతంలో రెండు హెచ్ఆర్ఏలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉద్యోగ సంఘాలు సీఎస్‌తో సమావేశమైనప్పుడు స్థానికత అంశం తెరపైకి తెచ్చారు. వరుసగా ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికతగా నిర్ధారిస్తారు. ఏపీ రాజధాని ప్రాంతంలో కొత్తగా వెళ్లే ఉద్యోగుల పిల్లలకు స్థానికత ఉండదు. వారిని అక్కడ నాన్ లోకల్‌గానే పరిగణిస్తారు. ఉద్యోగాల్లో ఇతర అవకాశాల్లో నష్టం జరిగే అవకాశం ఉండటంతో రాజధానిని ఫ్రీ జోన్ చేయాలని మొదట్నుంచీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆర్టికల్ 371 డి ని సవరించాలని కేంద్రానికి లేఖ రాసింది. రెండు నెలల్లోగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసి సవరణ చేస్తే ఉద్యోగుల తరలింపులో ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.