'అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి'
తిరుపతి కల్చరల్: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని శ్రీవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించకపోతే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు కేంద్రంగా అమరావతి మారునుందని, ఈ నేపథ్యంలో దీనిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని తెలిపారు. రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్, ఉత్తరాంధ్రలో వింటర్ క్యాపిటల్ ఏర్పాటు చేసినప్పుడే మరోసారి రాష్ట్ర విభజన ఉద్యమాలు రాకుండా ఉంటాయన్నారు.
రాయలసీమలోని 4 జిల్లాలను 8 జిల్లాలుగా, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను 6 జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించాలన్నారు. చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా పీడిస్తున్న మంచి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని తెలిపారు. ఉత్తరాఖండ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం శాంతియుత ఆందోళనలు వేదిక చేపడుతుందన్నారు.