ఉత్తర్వులు వస్తే తప్ప నమ్మలేం
-
అమరావతి ఫ్రీజోన్ ప్రకటనపై బైరెడ్డి
కర్నూలు(సిటీ): రాష్ట్ర రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు ఫ్రీజోన్‌గా ప్రకటించడంపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌తో ఈనెల 18,19 తేదీల్లో ఆందోళనకు పిలుపునిచ్చామని, అయితే ఈ లోగా ఫ్రీజోన్‌గా ప్రకటించారన్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే వరకు నమ్మలేమన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలతో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని సీఎం ప్రకటించారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణాజలాల వాటాలో సీమ వాటా నిర్ణయించాలని కోరారు. తుంగభద్రపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తేనే రాయలసీమకు సమృద్దిగా నీరందుతుందన్నారు. అలాకాకుండా ముచ్చుమర్రి ఎత్తిపోతలను ప్రారంభించి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.