ఫ్రీజోన్‌గా సీఆర్‌డీఏ!
* పోలీసు రిక్రూట్‌మెంట్‌లో సమన్యాయం కోసమే
* రెండు జిల్లాలు, జోన్లలోవిస్తరించి ఉండటంతో ఇబ్బంది
* అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (సీఆర్‌డీఏ) పరిధిని ఫ్రీజోన్‌గా చేయాలని పోలీసు విభాగం భావిస్తోంది. పోలీసు రిక్రూట్‌మెంట్స్‌లో 13 జిల్లాలకు చెందిన వారికీ సమప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంటున్నారు. వేర్వేరు రెవెన్యూ జిల్లాలు, జోన్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని ఫ్రీజోన్ చెయ్యడమెలా అనే అంశంపై డీజీపీ కార్యాలయం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. డీజీపీ జాస్తి వెంకట రాముడు సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఫ్రీజోన్ అంశం పైనే చర్చించారు. పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల్ని జోనల్ స్థాయిలో ఎంపిక చేస్తారు. రిక్రూట్‌మెంట్ జరిగే జోన్‌కు చెందిన వారికి 70 శాతం (లోకల్), బయటి జోన్ల వారికి 30 శాతం (నాన్-లోకల్) కోటా ఉంటుంది.
కానిస్టేబుల్ స్థాయి వారిని యూనిట్లుగా పిలిచే జిల్లాల వారీగా ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో లోకల్స్‌కు 80 శాతం, నాన్-లోకల్స్‌కు 20 శాతం కోటా ఉంటుంది. ఈ విధానాల ప్రకారం ఎంపిక చేస్తే రాజధానితో పాటు సీఆర్‌డీఏ పరిధిలో పోలీసు విభాగంలో కేవలం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారే ఉంటారు. ఈ నేపథ్యంలో ఫ్రీ జోన్‌గా చేస్తేనే అన్ని జిల్లాలకు చెందిన వారికి సమప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి రాజధానిలో ఉన్న హైదరాబాద్‌లోని పోలీసు కమిషనరేట్ సైతం చాలా కాలం పాటు ఫ్రీజోన్‌గా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అన్ని ప్రాంతాల వారూ పోలీసు ఉద్యోగాలు పొందారు. దీనికోసం సిటీ పోలీసు చట్టంలో ప్రత్యేకంగా '14ఎఫ్' నిబంధన ఉండేది. సీఆర్‌డీఏ పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. రెవెన్యూ పరంగా రెండు జిల్లాలు, పోలీసు పరంగా రెండు జోన్లలో ఉంది.
కృష్ణా జిల్లా ఏలూరు రేంజ్‌లో, గుంటూరు జిల్లా గుంటూరు రేంజ్‌ల్లో భాగాలు. అంటే కానిస్టేబుల్ పోస్టుల ఎంపికకు యూనిట్, ఎస్సై ఎంపికకు జోన్ సమస్యగా మారుతోంది. ప్రతిపాదిత గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌కు రూపమిచ్చి ప్రత్యేక చట్టం తీసుకువచ్చినా అది సీఆర్‌డీఏ పరిధి మొత్తానికి వర్తించదు. వీటన్నింటికీ మించి హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం వివాదాస్పదంగా మారడం వంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం సీఆర్‌డీఏ ఫ్రీజోన్ విధానం అమలులో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.