మోసం.. బాబు నైజం
– శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కారు
– శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్న నీటిని దిగువకు తీసుకపోయారు
– సీమ ప్రజలు మేల్కొకపోతే తీవ్ర అన్యాయం
– ముగిసిన బైరెడ్డి దీక్షలు
కర్నూలు సిటీ: ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. అమరావతిని ఫ్రీజోన్ చేయాలని కోరుతూ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో బైరెడ్డి చేపట్టిన నిరహార దీక్షలను.. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారన్నారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా కర్నూలుకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించారని విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా తుంగలోకి తొక్కారన్నారు. రాజధాని కోసం రైతులనుంచి దౌర్జన్యంగా భూములు లాక్కొని.. టీడీపీ నేతలకు దోచి పెట్టారని ధ్వజమెత్తారు. దోచుకున్న డబ్బు ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు ఉన్నారని, పదవులు, పైసలు శాశ్వతం కాదనే విషయాన్ని వారు గమనించుకోవాలన్నారు.
సీమ ప్రజలపై చిన్న చూపు
రాయలసీమ ప్రజలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చిన్నచూపని, అందుకే రాజధాని, ప్రముఖ విద్యా సంస్థలన్నీ కోస్తా ప్రాంతంలోనే నెలకొల్పుతున్నారని బైరెడ్డి విమర్శించారు. రాష్ట్రం విడిపోయి మూడేళ్లయినా నేటికీ రాజధాని సరిహద్దు ఎంత అనే దానిపై స్పష్టత రాలేదన్నారు. చట్ట ప్రకారం రాజధానిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలన్నారు. శ్రీశైలం డ్యాం డెడ్‌స్టోరేజీలో ఉన్నా దిగువకు నీరు తీసుకోయారని, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇకనైనా సీమ ప్రజలు మేల్కొకపోతే తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఫ్రీజోన్‌పై ప్రభుత్వం స్పందించకపోతే చలో అమరావతిపై త్వరలోనే ప్రకటన చేస్తామని బైరెడ్డి పేర్కొన్నారు.దీక్షల్లో ఆర్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర, ఆర్పీఎస్ నాయకులు, విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.