కాంగ్రెస్‌కు మానుకోట
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : పునర్విభజన జరిగిన ప్రతిసారి రూపురేఖలు మార్చుకున్న నియోజకవర్గం మహబూబాబాద్. 1952లో మహబూబాబాద్ తాలుకాగా ఉండేది. ఆ తాలుకా ద్విసభ్య నియోజకవర్గం. మహబూబాబాద్ తాలుకాలో డోర్నకల్, మహబూబాబాద్, చిల్లంచర్ల, నర్సింహులపేట, నెల్లికుదురు, కేసముద్రం మండలాలుండేవి. ఆ సమయంలో ఎస్సీ అభ్యర్థి, జనరల్ అభ్యర్థి బరిలో నిలిచారు.
ప్రతి ఓటరు ఇద్దరికీ ఓట్లు వేసేవారు. 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.రెడ్డిపై పీడీఎఫ్‌కు చెందిన కన్నెకంత శ్రీనివాసరావు సుమారు 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజయ్యపై పీడీఎఫ్ అభ్యర్థి బీఎం.చందర్రావు విజయం సాధించారు.
1957లో డోర్నకల్... చిల్లంచర్ల
1957లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో మానుకోట తాలూకాను డోర్నకల్, చిల్లంచర్ల నియోజకవర్గాలుగా విభజించా రు. డోర్నకల్ నియోజకవర్గంలో మానుకోట, డోర్నకల్, కురవి మండలాలు ఉండేవి. చిల్లంచర్ల నియోజకవర్గంలో కేసముద్రం, చిల్లంచర్ల, నర్సింహులపేట మండలాలు ఉన్నా యి. 1967లో జరిగిన పునర్విభజనలో అవి చిల్లంచర్ల, మహబూబాబాద్ నియోజకవర్గాలుగా విభజింపబడ్డారుు.
చిల్లంచర్ల సెగ్మెంట్లో డోర్నకల్, కురవి, చిల్లంచర్ల మండలాలు... మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం, నర్సిం హులపేట, మహబూబాబాద్ మండలాలు ఉండేవి. 1972 డీలిమిటేషన్లో కేసముద్రం, నర్సింహులపేట, మహబూబాబాద్ మండలాలు అలాగే ఉండగా... గూడూరు మండలంలోని కొన్ని గ్రామాలు, నెక్కొండ మండలాలు మహబూబాబాద్ సెగ్మెంట్లో కలిశారుు.
2004 పునర్విభజనలో మహబూబాబాద్ నియోజకవర్గం మళ్లీ రూపురేఖలను మార్చుకుంది. కేసముద్రం, నెక్కొండ, గూడూరు మండలంలోని పది గ్రామాలు, నెల్లికుదురు మండలంలోని 14 గ్రామాలు, చెన్నారావుపేట మండలంలోని ఏడు గ్రామాలు, కొత్తగూడెంలోని మూడు గ్రామాలు ఇందులో ఉండగా... నర్సింహులపేట మండలం డోర్నకల్ సెగ్మెంట్లోకి మారింది.